DailyDose

జగన్‌కు పరిమళ్ ప్రశంసలు-తాజావార్తలు

TNILIVE Breaking News Roundup || Parimal Nathwani Praises Jagan

* చైనాలోని వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ ఆవిర్భవించిందన్న వార్తలు తెలిసినప్పటి నుంచి చైనాకు వ్యతిరేకంగా భారత్‌లో నినాదాలు మొదలయ్యాయి. చైనా తయారీ టీవీలు, స్మార్ట్‌ ఫోన్లను పగులగొడుతున్న భారతీయుల వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రసారం అయ్యాయి. చైనా సైనికుల దాడిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారనే వార్త తెల్సినప్పటి నుంచి చైనా పట్ల భారతీయుల వ్యతిరేకత మరింత పెరిగింది. దేశంలో అక్కడక్కడ గత వారం చైనా ఉత్పత్తులు అమ్ముతున్న దుకాణాలపై దాడులు కూడా జరిగాయి. ఈ పరిణామాలను చూస్తుంటే అబ్బో! దేశంలో చైనా పట్ల వృతిరేకత బాగా పెరిగిందని అనుకుంటాం. చైనాను లేదా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే విషయంలో మెజారిటీ భారతీయులు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేక పోతున్నారు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల కంపెనీ తన ‘వన్‌ప్లస్‌’ స్మార్ట్‌ఫోన్ల సిరీస్‌లో తీసుకొచ్చిన ‘వన్‌ప్లస్‌ 8 ప్రో’ మోడల్‌ ఫోన్లను జూన్‌ 18వ తేదీన అమెజాన్‌ ద్వారా భారత్‌లో అమ్మకాలు ప్రారంభించగా క్షణాల్లో అమ్ముడు పోయాయి. అయితే ఎంత సంఖ్యలో, ఎన్ని కోట్లకు అమ్ముడు పోయావో చైనా కంపెనీగానీ, అమెజాన్‌గానీ తెలియజేయలేదు. స్టాక్‌ అయిపోయినందున బుకింగ్‌ క్లోజ్‌ చేసినట్లు అమెజాన్‌ ప్రకటించింది.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పరిమళ్‌ నత్వాని ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిస్తున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇంటింటి సర్వే, వలంటీర్‌ వ్యవస్థలతో పాటుగా అనేక పథకాలను ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని అన్నారు. జాతీయ మీడియా న్యూస్‌ ఎక్స్‌లో వచ్చిన ఓ కథనాన్ని ఆయన షేర్‌ చేశారు. కరోనాపై పోరులో తొలి నుంచి సీఎం వైఎస్‌ జగన్ చేస్తున్న‌ కృషికి ఇది నిదర్శనమని చెప్పారు.

* ప్రపంచంలో కరోనా బారిన పడిన వారిలో స్త్రీలకన్నా పురుషులు ఎక్కువగా మరణిస్తున్నారని మొన్నటి వరకు అంతర్జాతీయ విశ్లేషణలు తెలియజేశాయి. భారత్‌లో ఆ విశ్లేషణలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కరోనా బారిన పడిన భారతీయ మహిళల్లో మృతుల సంఖ్య 3.3 శాతం ఉండగా, పురుషుల్లో మృతుల సంఖ్య 2.9 శాతం ఉంది. కరోనా బారిన పడిన మహిళల్లో 40 నుంచి 49 మధ్య వయస్కులే ఎక్కువ మంది మరణిస్తున్నారు. మృతుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఈ వయస్కులే. మిగతా వయస్కుల్లో స్త్రీలు ఎంత మంది మరణిస్తున్నారో, పురుషులు కూడా దాదాపు అంతే సంఖ్యలో మరణిస్తున్నారు.

* తెలంగాణ గరీబోళ్ల రాష్ట్రం కాదు.. 100 శాతం ధనిక రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటి ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్టు పార్కును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ… ‘‘92 వేల ఎకరాల అడవిని పోగొట్టుకున్నాం. సినిమా షూటింగ్‌ల కోసం నర్సాపూర్‌ అటవీప్రాంతాన్నే ఎంపిక చేసుకునేవారు. గతంలో నర్సాపూర్‌ అడవుల్లో చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయి. సమష్టి కృషితోనే నర్సాపూర్‌ అటవీ ప్రాంతానికి పునరుజ్జీవం కలుగుతుంది’’ అని చెప్పారు.

* అక్టోబరులో అవుకు టన్నెల్‌-2 ద్వారా సాగునీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభించనున్న ఆరు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అవుకు టన్నెల్‌-2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. వెలుగొండ టన్నెల్‌-1లో ఇంకా 700 మీటర్లు తవ్వాల్సి ఉందని చెప్పారు. వచ్చే అక్టోబరు నాటికి టన్నెల్‌-1 ద్వారా నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. నెల్లూరులోని సంగం ప్రాజెక్టు ద్వారా అక్టోబరు నాటికి సాగునీటిని విడుదల చేయాలని జగన్‌ తెలిపారు.

* తూర్పు లద్దాఖ్‌ వద్ద చైనా దురాక్రమణను ధైర్యంగా ఎదిరించి పోరాడిన తెలుగు తేజం కర్నల్‌ సంతోష్‌బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు గౌరవార్థం స్వస్థలం సూర్యాపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కర్నల్‌ సంతోష్‌బాబు విగ్రహానికి పశ్చిమగోదావరి జిల్లాలో శిల్పిలు తుది మెరుగులు దిద్ది సిద్ధం చేశారు. ఈ వీర సైనికుడి విగ్రహాన్ని సూర్యాపేట పాత బస్టాండ్‌ కూడలిలో ఏర్పాటు చేయనున్నారు.

* వైకాపా ప్రభుత్వం అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ‘‘అచ్చెన్నాయుడును ఆస్పత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు చెప్పింది. నిలబెట్టవద్దు, కూర్చోపెట్టవద్దని కూడా సూచించింది. పది రోజులు బెడ్‍ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబితే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడిచేసి, అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయాలని చూడటం ఏంటి?. ఏసీబీ అధికారులు అర్ధరాత్రే అదుపులోకి తీసుకోవాలని చూడటం ఏంటి? అసలీ అర్థరాత్రి కుట్రలేంటి? కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇది కేసు విచారణలా లేదు, బీసీ నేతపై హత్యాయత్నంలా ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

* దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. గురువారం సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జులై 1 నుంచి 15 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఐసీఎస్‌ఈ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు బోర్డు తెలిపింది.సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్ని వివరాలను సుప్రీంకోర్టుకు వివరించారు.

* కరోనా వైరస్‌తో వైద్యసేవల్లో ఏర్పడే అంతరాయాలతో భారత్‌లో క్షయ రోగులు భారీ సంఖ్యలో మరణిస్తారట! వైరస్‌ గుర్తింపు, వైద్యసేవల్లో జాప్యం వల్ల ఐదేళ్ల కాలంలో కనీసం 95వేల అదనపు టీబీ మరణాలు సంభవిస్తాయని యూరోపియన్‌ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం పేర్కొంది. ‘కొవిడ్‌-19 ప్రభావం వల్ల ఆసుపత్రుల్లో క్షయ రోగుల సందర్శన తగ్గుదల, వ్యాధి గుర్తింపు, చికిత్సకు అంతరాయం కలిగే అవకాశం ఉంది’ అని లండన్‌ స్కూల్‌ ఆఫ్ హైజిన్‌, ట్రోపికల్‌ మెడిసన్‌లో సహాయ ఆచార్యుడు ఫిన్‌ మెక్‌‌ఖాయిద్‌ అన్నారు.

* కరోనా వైరస్‌ కోసం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న టీకా తుది దశకు చేరింది. ఇప్పటి వరకు చాలా మంచి ఫలితాలు రావడంతో దీనిని అక్టోబర్‌ నాటికి విడుదల చేసేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అడ్రెన్‌ హిల్‌ తెలిపారు. తాము తయారు చేసిన ఛాదోక్ష్1 ంఛొవ్-19 టీకా చింపాజీలపై మంచి ఫలితాలను చూపిందన్నారు. ఆయన స్పానిష్‌ సొసైటీ ఆఫ్‌ రూమటాలజీలో నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫలితాలను ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నాటికి ప్రకటిస్తామన్నారు. అక్టోబర్‌ నాటికి మార్కెట్లోకి వస్తుందని వెల్లడించారు.

* కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించనున్న ఔషధం ‘కొవిఫర్‌’ను తొలివిడతగా ఐదు రాష్ట్రాలకు అందచేశారు. వీటిలో అత్యధిక కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, దిల్లీతో సహా గుజరాత్‌, తమిళనాడు, తెలంగాణా ఉన్నాయి. అమెరికాకు చెందిన గిలిద్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేసిన ‘రెమ్‌డెసివర్‌’కు జనరిక్‌ తయారుచేసి, పంపిణీ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటిరో ల్యాబ్స్‌కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. హెటిరో తొలివిడతగా 20,000 వయల్స్‌ను ఆయా రాష్ట్రాలకు అందచేసింది. మరో రెండు-మూడు వారాల్లో లక్ష వయల్స్‌ తయారు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

* భారత అంతరిక్ష రంగంలో ఓ నూతన అధ్యాయానికి తెర లేచింది. దేశ అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రభుత్వ అనుమతి లభించింది. ఇకపై రాకెట్లు, ఉపగ్రహాల నిర్మాణం, వాటి ప్రయోగం, గ్రహాంతర యాత్రలతో సహా అన్ని రకాల అంతరిక్ష కార్యక్రమాల్లోనూ ప్రైవేటు సంస్థలు పాల్గొనవచ్చని ఇస్రో అధ్యక్షులు కె.శివన్‌ ప్రకటించారు. దేశంలో ప్రైవేటు అంతరిక్ష వ్యవహారాల పర్యవేక్షణకు ‘‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌’’ (ఇన్‌ స్పేస్‌) అనే నూతన సంస్థ ఏర్పాటును కేంద్ర క్యాబినెట్‌ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఈ సంస్థ ఇస్రోకు – ప్రైవేటు అంతరిక్ష కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలనుకునే వ్యక్తులు, సంస్థలకు మధ్య వారధిగా వ్యవహరించనుంది.

* కథానాయకుడు బుల్లెట్‌ నడుపుతూ స్టైలిష్‌గా కనిపించడం సాధారణం‌.. కానీ కథానాయిక రైడింగ్‌ చేయడం అరుదుగా చూస్తుంటాం. ఇలా ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ సినిమా కోసం తొలిసారి బుల్లెట్‌ ఎక్కిన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్‌ కిందపడ్డారు. ‘జెర్సీ’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. నానికి జంటగా నటించి మెప్పించారు. దీని తర్వాత ‘క్రిష్ణ అండ్‌ హిజ్‌ లీల’లో నటించారు. రవికాంత్‌ పేరూరు దర్శకత్వం వహించిన చిత్రమిది. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడు. సీరత్‌ కపూర్‌, శాలినీ కథానాయికలు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రానా సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.