Devotional

ఏలిననాటి శని అంటే ఏమిటి?

ఏలిననాటి శని అంటే ఏమిటి?

ఏలినాటి శని పీడిస్తున్నట్లైతే శనివారం పూట నవగ్రహాలను తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెగిలించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శవి ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమవుతాయని పురోహితులు చెబుతున్నారు. 

అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలని అందరూ దేవతలను వేడుకోవడం సహజమే. దేవతలతో పాటు నవగ్రహాలు కూడా కోరిన కోర్కెలు నెరవేరుస్తాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేసారు. గ్రహ సంచారాన్ని బట్టి గ్రహాధిపత్య కాలంలో నవగ్రహాలను అర్చించే జాతకులకు బాధలు తొలగిపోతాయి. 

అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధము, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి గానీ,  శూద్రునికి గానీ సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగము దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

మరోవైపు నవగ్రహ దోషాలు గల జాతకులు, ఆ దోష నివారణకు కొన్ని ప్రత్యేక పూజలు చేస్తే శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే,  ఏ గ్రహ శాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, జపాదులను చిత్తశుద్ధితో చేయడం మంచిది. దేవతామూర్తులకు, సద్భ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారాలు చేసినట్లైతే కొంతమేరకు దోషవృత్తి తగ్గవచ్చును. 

ఇష్టదైవమును నిష్టతో జపించి, దానధర్మములను త్రికరణ శుద్ధిగా నిర్వహించినచో కొంత మేరకు నవగ్రహ దోషాన్ని నివారించవచ్చునని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.