DailyDose

తెలంగాణా సచివాలయ కూల్చివేతకు హైకోర్టు ఆమోదం-తాజావార్తలు

తెలంగాణా సచివాలయ కూల్చివేతకు హైకోర్టు ఆమోదం-తాజావార్తలు

* తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, సచివాలయం కూల్చివేతపై వేసిన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు, ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హౌకోర్టు, సుధీర్ఘంగా కొనసాగిన వాదనలు

* చైనాతో వివాదం అంశంలో భాజపాకు మద్దతుగా ఉంటామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌-భాజపా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలతో ఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని.. వీటిపై రాజకీయాలు తగవని హితవు పలికారు. అంతర్గత విభేదాలను చైనా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఘర్షణల పేరిట దేశంలో ఇతర సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల దేశ పౌరులు ఎంతో నష్టపోతున్నారన్నారు.

* సొంత వ్యాపార సంస్థ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జల చౌర్యానికి పాల్పడ్డారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. నిబంధనల ప్రకారం అనుమతించిన దానికంటే రెట్టింపు నీటిని సరస్వతి ఇండస్ట్రీస్‌కు మళ్లిస్తూ జారీ చేసిన జీవో అక్రమం అని పట్టాభి అన్నారు. అక్రమ జలకేటాయింపుల జీవోను తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సీఎం జగన్‌మోహన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. సరస్వతి ఇండస్ట్రీస్‌ కోసం సీఎం జగన్‌ అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.

* సామాన్య కార్యకర్త నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. భూ సంస్కరణల చట్టం తెచ్చి ఎంతో మంది పేదలకు మేలు చేకూర్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆదివారం పీవీ శత జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు.

* కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని… హైదరాబాద్‌ కరోనా హబ్‌గా మారిందని మాజీ మంత్రి, భాజపా నాయకురాలు డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని ఆమె ఎండగట్టారు. కరోనా వైరస్‌ను అడ్డం పెట్టుకొని తెరాస చేస్తున్న శవ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు బలవుతున్నారని ఆమె దుయ్యబట్టారు. పదవిని కాపాడుకునే ప్రయత్నంలో భాజపాపై విమర్శలు చేస్తూ కేసీఆర్‌ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు.

* విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రం అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే హైదరాబాద్‌ ఓ ముఖ్యమైన మెట్రోపాలిటన్‌ నగరమని తెలిపారు. హైదరాబాద్‌- విజయవాడ మధ్య హైస్పీడ్‌ రైలు రావాలని ఆయన ఆకాంక్షించారు. రెండు నగరాల మధ్య హైస్పీడ్‌ రైలు కోసం తమవంతు కృషిచేస్తామని.. రైలు వస్తే హైవే వెంబడి అభివృద్ధి జరుగుతుందని అభిలషించారు. సోమవారం ఆయన హుజూర్‌నగర్‌లో ఆర్డీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

* చైనా సరిహద్దుల్లో భారత్‌ ఘాతక్‌ బృందాలను మోహరిస్తోంది. ఇప్పటికే చైనా టిబెట్‌ నుంచి దాదాపు 20 మంది మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణులను సరిహద్దులకు తరలించి తమ బలగాలకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఆ దేశ మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో భారత్‌ ఈ చర్యలు తీసుకొంది. భారత్‌ కూడా తమ బలగాల రక్షణ కోసం ఈ చర్యను చేపట్టింది.

* బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బురిగంగ నదిలో రెండు బోట్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ బోటు నీటిలో మునిగిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటును మరో ప్రయాణికుల బోటు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.

* ఆరోగ్యం విషమించిన కరోనా పాజిటివ్‌ బాధితుల్లో ప్లాస్మా థెరపీ చికిత్స మెరుగైన ఫలితాలిస్తున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కోరల్లోంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి నుంచి ప్లాస్మాను సేకరించేందుకు ‘ప్లాస్మా బ్యాంక్‌’ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. వచ్చే రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు.

* అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ‘‘కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాం. రేపటి నుంచి పెద్ద మొత్తంలో స్వాబ్‌ సేకరణ చేపడతాం. ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా హోం క్వారంటైన్‌లో చికిత్స చేస్తాం. రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు కొనసాగిస్తాం. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఉన్నచోట కంటైన్‌మెంట్‌జోన్లు పెడతాం’’అని ఈటల తెలిపారు.

* ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 793 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 706 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల్లోని వారు 81 మంది, ఇతర దేశాల్లోని వారు ఆరుగురు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది.

* వైకాపా నుంచి షోకాజ్‌ నోటీసు అందుకున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. విజయసాయిరెడ్డి నుంచి ఇటీవల నోటీసు అందిందని.. దానిపై స్పందిస్తూ ఈ లేఖ రాశానని ఎంపీ పేర్కొన్నారు. రిజిస్టరైన పార్టీ కాకుండా మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు వచ్చిందని తప్పుబట్టారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని పేర్కొన్నారు.

* సినీ నిర్మాత, వైసీపీ నేత ప్రసాద్‌ వి.పొట్లూరి(పీవీపీ)పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల పీవీపీపై నమోదైన ఒక కేసు విచారణకు సంబంధించి పలువురు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతున్న పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

* సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వటాన్ని బహిష్కరిస్తున్న సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తమ లాభాల కోసం విద్వేష పూరిత సమాచారాన్ని ఉపేక్షిస్తున్న సామాజిక మాధ్యమాల వైఖరికి నిరసనగా.. #స్తొఫతెFఒర్ఫ్రొఫిత్ (స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌)పేరుతో ఈ నెల మొదట్లో సోషల్‌ మీడియా ఉద్యమం ప్రారంభమైంది. దీనిలో భాగంగా అమెరికాకు చెందిన 160కి పైగా దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వటాన్ని బహిష్కరించాయి.

* మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు జులై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఇందులో భాగంగా ‘మిషన్‌ బిగెన్‌ అగైన్‌’ పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది.