Movies

నాకు వాళ్లకి సంబంధం లేదు

నాకు వాళ్లకి సంబంధం లేదు

తెలుగులో ‘సీమటపాకాయ్, అవును’ వంటి సినిమాలతోనూ, బుల్లితెరపై ప్రసారమయ్యే ‘ఢీ’ జడ్జ్‌గానూ షమ్నా ఖాసిం(పూర్ణ) ప్రేక్షకులకు సుపరిచితమే. గత కొన్ని రోజులుగా పూర్ణ గురించి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఆమెను కొందరు దుండగులు మనీ డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారని చెప్పి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను బెదిరించిన కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. అయితే ఈ కేసులో ఉన్న నిందితుడు, అతని వెనుక ఉన్న ముఠాతో పూర్ణకు సంబంధం ఉన్నట్లుగా వార్తలు రావడంతో.. వాటిపై వివరణ ఇస్తూ పూర్ణ ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

‘‘ఇటువంటి కష్ట సమయంలో నాకు అండగా నిలిచి, మద్దతు తెలిపిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఈ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలను చూపిస్తున్నాయి. అందుకే ఈ లేఖ ద్వారా వాటికి క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ బ్లాక్‌మెయిల్ కేసులోని నిందితుడితో కానీ, అతని వెనుక ఉన్న ముఠాతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్లతో సంబంధం ఉన్నట్లుగా వార్తలను ప్రసారం చేయవద్దని ఈ సందర్భంగా మీడియాను కోరుతున్నాను. పెళ్లి సంబంధం నిమిత్తం తప్పుడు పేర్లు, చిరునామాలతో మమ్మల్ని మోసం చేయాలని చూసినందుకు మా కుటుంబం వారిపై కేసు పెట్టాలని నిర్ణయించింది. మేము పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నామని తెలిసి.. వారు మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటనేది మాకు ఇప్పటి వరకు తెలియదు. అయితే మేము చేసిన ఫిర్యాదుపై కేరళ పోలీసులు వెంటనే స్పందించి, నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సంస్థలకు నాదొక విన్నపం.. దయచేసి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని కోరుకుంటున్నాను. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కేసు విచారణ అంతా పూర్తయిన తర్వాత మీడియా ముందుకు వస్తాను. మరొక్కసారి నాకు ఈ కష్టసమయంలో అండగా నిలబడిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు జరిగిన ఈ సంఘటనతో మిగతా సోదరీమణులు మేల్కొంటారని, జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రేమతో.. షమ్నా ఖాసిం(పూర్ణ)’’ అని పూర్ణ ఈ లేఖలో తెలిపింది.