Politics

రఘురామపై మరోసారి చర్యలు

YSRCP Second Round Of Actions Against MP Raghurama Krishnamraju

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ సీరియస్ అయింది. పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై చర్యలకు సిద్ధమైంది. స్పీకర్‌కు అనర్హత పిటిషన్ సమర్పించే యోచనలో ఉంది. వైసీపీ షోకాజ్ నోటీసుపై ఆయన స్పందించిన తీరుపై కూడా అధిష్టానం ఆగ్రహంగా ఉంది. రఘురామకృష్ణంరాజు తీరుపై అటు వైసీపీ సీనియర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజును తొలగించాలని సొంత జిల్లా ఎమ్మెల్యేలు అంటున్నారు. కాగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ నేతల పట్ల అసహనంగా ఉన్నారు. సంక్షేమ పథకాల్లో కొందరు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆయన బహిరంగంగానే ప్రకటన చేశారు. దీంతో సీరియస్ అయిన వైసీపీ అధిష్టానం.. రఘురామకృష్ణంరాజు‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్‌పై ఆయన వెరైటీగా రియాక్షన్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీస్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎంపీ షోకాజ్ నోటీస్‌ ఇవ్వడాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తీసుకెళ్లారు. వైసీపీ అధినేత జగన్‌ను ప్రశంసిస్తూనే ఆ పార్టీ నేతలను, ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. మరోవైపు బీజేపీకి దగ్గరవుతున్నట్లు ఆయన వ్యవహార శైలి కనబర్చారు. మోదీని పొగుడుతూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయనపై మరింత గుర్రుగా ఉంది. ఇక రఘురామకృష్ణంరాజుపై వేటు వేయక తప్పదని భావిస్తోంది. రఘురామరాజు తీరును లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.