Fashion

నారింజ రంగు చరిత్ర ఇది

నారింజ రంగు చరిత్ర ఇది

చూసేకొద్దీ చూడాలనిపించే రంగూ మనసుకు ఉల్లాసాన్నిచ్చే వాసనా తింటూనే ఉండాలనిపించే రుచీ… ఈ మూడు లక్షణాలూ ఉన్న పండు ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా కమలా ఉరఫ్‌ ఆరెంజ్‌. చిన్నాపెద్దా అంతా ఇష్టంగా తినేదీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది పండించేదీ కూడా ఆ పండునేనట. ఆ పండు కథాకమామీషు..!
ఆరెంజ్‌… వినడానికి ఇదేదో ఇంగ్లిష్‌ పేరులా వినిపించినా అది ‘నారంగా’ అనే సంస్కృత పదం నుంచే పుట్టుకొచ్చింది. అదే క్రమంగా నారింజ, ఆరెంజ్‌గా మారింది. అయితే ఆరెంజ్‌ అంటే- కమలా పండ్లు తియ్యగా మృదువైన తొక్కతో ఉంటే, నారింజ పండ్లు మాత్రం పుల్లగా గరుకు తొక్కతో ఉంటాయి. సిట్రస్‌ జాతుల్లో ఒకటైన నారింజ అత్యంత ప్రాచీన కాలం నుంచీ వాడుకలో ఉండగా, కమలా మాత్రం తరవాతి కాలంలో పామెలో, మాండరిన్‌ అనే రెండు పండ్ల సంకరీకరణం ద్వారా చైనాలో పుట్టుకొచ్చింది. అప్పటినుంచీ సిట్రస్‌ జాతుల్లో ఇది అందరి ఫేవరెట్‌ ఫ్రూట్‌గా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడున్నర కోట్ల టన్నుల పండ్లని పండిస్తుంటే- అందులో ప్రధాన వాటా బ్రెజిల్‌ది కాగా తరవాతి స్థానాల్లో చైనా, భారత్‌ ఉన్నాయి. పాశ్చాత్యదేశాల్లో కొందరు వీటిని గోల్డెన్‌ ఆపిల్స్‌ అంటే, మరికొందరు చైనీస్‌ ఆపిల్‌ అనీ పిలుస్తారు.
***రంగుతో సంబంధం లేదు!
ఇటాలియన్‌, పోర్చుగీసు వర్తకులు 15, 16 శతాబ్దాల్లో కమలాపండుని ఐరోపా అమెరికా దేశాలకు తీసుకెళ్లారట. అప్పట్నుంచీ ఆపిల్‌కన్నా ఎక్కువగా ఇది అందరికీ నచ్చేసింది. అప్పట్లో సముద్రయానం చేస్తూ స్కర్వీ వ్యాధి బారినపడి చాలామంది వర్తకులు చనిపోయేవారట. దాన్ని నివారించేందుకే ఆయా వాణిజ్య మార్గాల్లో పోర్చుగీసు, స్పెయిన్‌, డచ్‌ వర్తకులు ఈ చెట్లను నాటారట. ఎందుకంటే నారింజలో సి-విటమిన్‌ సమృద్ధిగా ఉండటంతోబాటు అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. దాంతో ఆ దారిలో వెళ్లే నావికులకు ఇవి అందుబాటులో ఉండేవి. ఆపై ఇందులోనూ అనేక రకాలు పుట్టుకొచ్చాయ్‌. నారింజ రంగు తొక్కా గుజ్జుతో ఉండే వాలెన్సియా, హామ్‌లిస్‌ రకాలూ, ఎర్రని తొక్కతోనూ ఎర్రని గుజ్జుతోనూ ఉండే మోరో, టరొకో, సాంగ్వినెల్లి, మాల్టీస్‌.. వంటి బ్లడ్‌ ఆరెంజ్‌ రకాలూ, కాడ దగ్గర కాస్త ఉబ్బినట్లుగా ఉండే నేవల్‌ రకాలన్నీ తియ్యని రుచితో నోరూరిస్తుంటాయి. అయితే కాస్త చేదుగా ఉండే సెవెల్లే, తొక్కల నుంచి పరిమళాన్ని తయారుచేసే బెర్గామాట్‌… వంటి కమలా రకాలూ చాలానే ఉన్నాయ్‌. అందుకే మార్కెట్లో కమలాలు కొన్ని ఆకుపచ్చగానూ మరికొన్ని పసుపు, ఎరుపు, నారింజ వర్ణంలోనూ కనిపిస్తుంటాయి. అలాగే వాలెన్సియా రకం కమలాలు పండనిదశలో నారింజ వర్ణంలో ఉండి పండాక ఆకుపచ్చరంగులోకి మారతాయి. కానీ వీటి రుచి అమోఘం. అందుకే తొక్క రంగుని బట్టి రుచిని అంచనా వెయ్యలేం. నిజానికి నారింజ రంగూ రుచీ అనేవి ప్రధానంగా అవి పెరిగే వాతావరణం మీదే ఆధారపడి ఉంటాయి. దాదాపు అందరూ వీటిని నేరుగా తినేందుకో జ్యూస్‌ రూపంలో తాగేందుకో వాడితే అఫ్గానిస్థాన్‌లో మాత్రం చేతులకు జిడ్డు అంటుకోకుండా కూరల్లో కమలాలు పిండుకుంటారట. ఇందులోని లిమోనిన్‌ జిడ్డును అద్భుతంగా శుభ్రం చేస్తుందన్న కారణంతో గచ్చు తుడిచేందుకూ గ్రీజూ నూనె మరకలూ పోయేందుకూ కమలాల్ని వాడుతుంటారు జమైకన్లు. 19వ శతాబ్దంలో ఉప్పు డబ్బాల్లో నిల్వ చేసి మరీ వీటిని ఫ్రాన్స్‌కు తరలించేవారు. ఎందుకంటే వీటిని ప్రేమ సంకేతంగా భావించి, అక్కడి పెళ్లికూతురి చేతిలోని బొకేనీ కమలాలతో అలంకరిస్తారట.
***ఉపయోగాలెన్నో..!
అందమైన రంగే కాదు, అంతకు మించిన ఆరోగ్యమూ కమలాలకే సొంతం అంటారు పోషక నిపుణులు. అందుకే ఐరోపా వాసులంతా బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఆరెంజ్‌ జ్యూస్‌ని తాగుతుంటారు. నేపాలీలయితే కమలాల్ని నేరుగా తొక్కతోనే తింటారట. స్విస్‌ వాసులయితే మీగడ, పంచదార అద్దుకుని ఈ పండ్లను తింటారు. ఎవరెలా తిన్నా ప్రపంచవ్యాప్తంగా రోగులకి ఆపిల్‌తోబాటు ఇచ్చే మరో పండు ఆరెంజ్‌ మాత్రమే. హెస్పర్‌డిన్స్‌ అనే ఒక రకమైన ఫ్లేవొనాయిడ్లతోబాటు విటమిన్‌-బి1, బి6, డి, ఫోలేట్‌, బి12, విటమిన్‌-సి, బీటాకెరోటిన్‌ ఇందులో పుష్కలంగా ఉంటాయి.
* మీడియం సైజు కమలాపండులో సుమారు 260 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. ఇది శరీర పెరుగుదలకీ జీవక్రియకీ బీపీ హృద్రోగాల నివారణకీ ఎంతో తోడ్పడుతుంది. రోజూ ఓ గ్లాసు కమలారసం, నాలుగు వారాలపాటు తాగినవాళ్లలో మంచి కొలెస్ట్రా ఫోలేట్‌ల శాతం పెరిగినట్లు కొన్ని పరిశీలనల్లో తేలింది. హృద్రోగాలకి కారణమయ్యే హోమోసిస్టైన్‌లను తగ్గించడంలో ఈ ఫోలేట్‌లు ఎంతో ఉపకరిస్తాయి.
* రోగులు మందు వేసుకున్నాక ఓ గ్లాసు కమలారసం తాగడం వల్ల అది మరింత త్వరగా ఒంటబడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాల్ని నియంత్రించడంతోబాటు వయసునీ మీదపడనీయవు.
* ఆరెంజ్‌ జ్యూస్‌ మూత్రపిండాల వ్యాధులు రాకుండానూ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండానూ చూస్తుంది.
* చాలా రకాల పండ్లూ కూరగాయల్లోకన్నా కమలాల్లో పీచు ఎక్కువ. ఈ పీచు జీర్ణరసాల్ని పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
* వీటిల్లో సమృద్ధిగా ఉండే విటమిన్‌-సి హృద్రోగాలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటుంది. పాలీఫినాల్స్‌ వైరల్‌ ఇన్ఫెక్షన్లనీ రానీయవు. అందుకే తరచూ జలుబూజ్వరంతో బాధపడేవాళ్లకి కమలాలు మేలు చేస్తాయి.
* వీటిల్లోని కెరోటినాయిడ్లు విటమిన్‌-ఎగా మారి వయసుతోబాటు వచ్చే మాక్యులర్‌ డీజనరేషన్‌ని తగ్గిస్తాయి.
* హెస్పరిడిన్‌ అనే ఫ్లేవొనాయిడ్‌, మెగ్నీషియంలు కలిసి బీపీని నియంత్రిస్తాయి. బీటా కెరోటిన్‌ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ చర్మ సంరక్షణకి తోడ్పడుతుంది. ఇందులోని పిండిపదార్థాలు రక్తంలో చక్కెర శాతాన్ని పెరగనీయవు.
* డి-విటమిన్‌ను కమలాలతో కలిపి తీసుకుంటే బాగా ఒంటబడుతుంది. అయితే ఒకసారి కోసి రసం తీశాక ఎనిమిది గంటల్లోపే తాగాలి. ఎందుకంటే- అందులోని సి-విటమిన్‌ 20 శాతం తగ్గిపోతుంది. అలాగే పరగడుపున సిట్రస్‌ పండు ఏదీ తినకూడదన్నది తెలిసిందే. లేదంటే ఇందులోని ఆమ్లాలు పొట్టలోని గ్యాస్ట్రిక్‌ ఆమ్లాల్ని మరింత పెంచుతాయి. బ్రష్‌ చేసిన వెంటనే ఆరెంజ్‌ తిన్నా, రసం తాగినా అందులోని ఆమ్లాలు పేస్టుతో కలిసి రుచి మారిపోతుందట. ఆరెంజ్‌ తినడానికీ పాలు తాగడానికీ మధ్య కనీసం గంట వ్యవధి ఉంటే మంచిది. లేదంటే పాలల్లోని ప్రొటీన్‌ ఆరెంజ్‌లోని ఆమ్లాలతో కలిసి జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి.
చూశారుగా మరి… ఈ కాలంలో ఎక్కువగా కనిపించే కమలా పోషకఫలం మాత్రమే కాదు, రంగూరుచీవాసనా ఉన్న అందమైన పండు కూడా!