Fashion

ఆలుగడ్డతో ఫేస్‌ప్యాక్

ఆలుగడ్డతో ఫేస్‌ప్యాక్

ఆలు వంటల్లో వాడుతుంటాం. దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా చర్మసంరక్షణకు, కురుల సంరక్షణకు ఆలు పనిచేస్తుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఆలు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అదెలాగంటే..

* ఆలు తురుమును పిండితే వచ్చిన రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గుడ్డుసొన, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ను కుదుళ్ల నుంచి జుట్టంతా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి షాంపూతో తలస్నానం చేయాలి. ఇరవై రోజులకోసారి ఇలా చేస్తే ఆరోగ్యవంతమైన మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది.

* ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడిచేయాలి. అవి ఉడుకు పట్టగానే బంగాళాదుంప పొట్టు వేసి ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఆ నీటిని వడకట్టాలి. షాంపూతో తలస్నానం చేశాక వడకట్టిన నీళ్లతో జుట్టును కడగాలి. ఇది జుట్టుకు సహజమైన నలుపు రంగునిస్తుంది. వారంలో ఒక్కసారైనా ఇలా చేస్తే జుట్టు తెల్లబడే సమస్య నుంచి బయటపడొచ్చు.

* బంగాళదుంప, కలబంద రసాలను సమానంగా తీసుకొని 21 టీ స్పూన్ల తేనెను తీసుకోవాలి. వీటన్నింటినీ ఓ గిన్నెలో వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు అంతటా పట్టించి రెండు గంటలు ఉంచుకోవాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

* మెడ తెల్లగా కావాలంటే ఒక స్పూన్‌ గంధంలో కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రివేళ మెడకు రాసుకొని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ తెల్లగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా పసుపు కలిపి పెట్టుకున్నా మెడ తెల్లగా కనిపిస్తుంది. ఆలుగడ్డను ముక్కలుగా కోసుకొని రెండు వారాలకోసారి మెడ మీద రుద్దుకుంటే నెల రోజుల్లో తేడాను గమనించవచ్చు.

* ఒక ఆలుగడ్డను మెత్తగా అయ్యేవరకు గ్రైండ్‌ చేయాలి. అందులో రెండు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, రెండు స్పూన్లు తేనె, రెండు స్పూన్లు పాలు తీసుకోవాలి. ఆ మొత్తాన్ని కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారంలో రెండు లేదా మూడుసార్లు చేతులకు రాసుకొని 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత సబ్బుతో కడిగేసుకుంటే చేతులు మృదువుగా మారుతాయి.