DailyDose

జియో-ఇంటెల్ చెట్టాపట్టాల్:వాణిజ్యం

Jio Intel Partner - Telugu Business News Roundup

* ప్రముఖ టెలికాం రంగ సంస్థ జియోలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్‌కు చెందిన ‘ఇంటెల్‌ క్యాపిటల్‌’ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.39 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ. 1,894 కోట్లు. జియోలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఇది పన్నెండోది. ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్‌, కేకేఆర్, ముబదాలా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఎల్ కాటర్‌టన్‌, వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ పెట్టుబడుల వెల్లువతో రిలయన్స్‌ ఇప్పటికే నికర రుణరహిత సంస్థగా నిలిచిన విషయం తెలిసిందే.

* గత రెండు రోజుల వరుస లాభాల పరంపరను దేశీయ మార్కెట్లు శుక్రవారం కూడా కొనసాగిస్తున్నాయి. ఉదయం 9.41 గంటల సమయంలో సెన్సెక్స్‌ 83 పాయింట్లు లాభపడి 35,927 వద్ద కొనసాగుతుండగా.. సెన్సెక్స్‌ 23 పాయింట్లు ఎగబాకి 10,575 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.68 వద్ద కొనసాగుతోంది. అమెరికాలో నిరుద్యోగిత తగ్గడం, వ్యాక్సిన్‌ తయారీపై ఆశాజనక వార్తల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు సానుకూలంగా కదిలాయి. దీంతో ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే దేశీయ సూచీలు లాభాల్లో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

* జాతీయ రహదారుల రంగంలో పెట్టుబడులను సులభతరం చేసే లక్ష్యంతో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(ఐఐటీ) ఏర్పాటుకానుంది. జాతీయ రహదారుల ప్రాజెక్టుల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి నిపుణులతో కూడిన సమర్థమైన సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌, బోర్డు ఛైర్మన్‌, ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లను నియమించడానికి కమిటీని నియమించినట్టు తెలిపింది. ఈ కమిటీలో కన్వీనర్‌గా ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌, ఐసీఐసీఐ బ్యాంకు ఛైర్మన్‌ గిరీశ్‌ చంద్ర చతుర్వేది, రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి సంజయ్‌ మిత్రా సభ్యులుగా ఉంటారని పేర్కొంది.

* యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగే చెల్లింపులు జూన్‌లో జీవన కాల గరిష్ఠానికి చేరాయి. గత నెలలో 134 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ దాదాపు రూ.2.62 లక్షల కోట్ల వరకు ఉంటుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. మే నెలలో నమోదైన 123 కోట్ల లావాదేవీలతో (విలువ రూ.2.18 లక్షల కోట్లు) పోలిస్తే జూన్‌లో లావాదేవీలు 8.94 శాతం పెరగడం గమనార్హం. మరోవైపు లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ఏప్రిల్‌లో యూపీఐ చెల్లింపులు 99.57 కోట్లకు పరిమితమయ్యాయి. లావాదేవీల విలువ రూ.1.51 లక్షల కోట్లు. తిరిగి లాక్‌డౌన్‌ సడలింపులతో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో మే నుంచి లావాదేవీలు పుంజుకుంటున్నాయి. జూన్‌లో రికార్డు గరిష్ఠానికి చేరాయి. 2019 అక్టోబరు తర్వాత నుంచి యూపీఐ లావాదేవీలు 100 కోట్లకు పైగా నమోదవుతూ వచ్చాయి. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 100 కోట్ల దిగువకు వచ్చిన లావాదేవీలు తిరిగి మేలో పుంజుకొని 100 కోట్ల స్థాయిని అధిగమించాయి.

* సూచీల లాభాల జోరు రెండో రోజూ కొనసాగింది. కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయన్న వార్తలతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారాయి. ముఖ్యంగా ఐటీ, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. రూపాయి బలపడటం సైతం దన్నుగా నిలిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 56 పైసలు పెరిగి 75.04 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా షేర్లు మెరుగ్గా ట్రేడయ్యాయి.

* మోటొరోలా తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ‘మోటొరోలా వన్ ప్యూజన్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్లస్ వెర్షన్‌ను గత నెలలో భారత్‌లో పరిచయం చేసింది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. మోటొరోలా వన్ ఫ్యూజన్ ఫీచర్ల విషయానికొస్తే 6.5 అంగుళాల మ్యాక్స్ విజన్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ, మైక్రో ఎస్డీకార్డు ద్వారా మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి.