Devotional

తితిదేకు ₹200కోట్లు చెల్లించనున్న కర్ణాటక

Karnataka To Pay 200Crores To TTD

తిరుమలలోని కర్ణాటక చారిటీస్​కు తితిదే లీజుకు ఇచ్చిన స్థలంలో నూతన వసతి సముదాయాల నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం, తితిదే నిర్ణయం తీసుకుంది.

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌తో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ శ్రీ ఏవీ ధర్మారెడ్డి బెంగళూరులో సమావేశమయ్యారు.

తిరుమ‌ల‌లోని 7.05 ఎకరాల భూమిని 50 సంవత్సరాల కాల పరిమితికి 2008 సంవత్సరంలో తితిదే కర్ణాటక ప్రభుత్వానికి లీజుకు ఇచ్చింది.

ఈ ప్రాంతంలో నూతన వసతి సముదాయాల నిర్మాణం ప‌నులు చేప‌ట్టేందుకు తితిదే అనుమ‌తి కోరుతూ కర్ణాటక రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఒక ప్లాన్‌ను దేవస్థానానికి స‌మ‌ర్పించింది.

ఈ అంశంపై ముఖ్యమంత్రి య‌డ్యూర‌ప్పతో తితిదే ఛైర్మన్ చర్చించారు.

క‌ర్ణాట‌క స‌త్రాల ప్రాంతంలో కొత్త‌గా నిర్మించాలనుకుంటున్న నూతన వసతి సముదాయం తితిదే నిబంధనల మేరకు నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

పడమర మాఢ వీధి వైపు 1.94 ఎకరాల భూమిని బ్రహ్మోత్సవాలు, ఇతర సమయాల్లో భక్తుల అవసరాల కోసం ఖాళీగా ఉంచి మిగిలిన భూమిలో నిర్మాణాలు చేసుకోవడానికి అంగీకారం కుదిరింది.

ఈ ప్రతిపాదనలు తితిదే పాలకమండలి సమావేశంలో ఆమోదించాక కర్ణాటక ప్రభుత్వం రూ.200 కోట్లు తితిదే ఖాతాలో జమ చేస్తుంది.

అనంతరం కర్ణాటక సీఎం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

తితిదే భవనాలు నిర్మించి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించేలా అవగాహన కుదుర్చుకొన్నారు.