Kids

కోపాన్ని నియంత్రించమని చెప్పే ఖాళీపడవ

The use of empty boat to control anger - Telugu kids moral stories

ఒక ముని ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని ఒక చిన్న పడవను తీసుకుని, తన ఆశ్రమానికి దూరంగా వెళ్ళి, సరస్సు మధ్యలో ఆపి, ధ్యానంలో నిమగ్నమౌతాడు.

నిరాటంకంగా కొన్ని గంటల పాటు ధ్యానం చేసిన తర్వాత, తన పడవను మరొక పడవ ఢీకొట్టడంతో, ధ్యానానికి భంగం కలిగేసరికి, అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.

తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరుస్తాడు.

కానీ, అక్కడ ఒక ఖాళీ_పడవ మాత్రం ఉంటుంది. అందులో మనుష్యులు ఒక్కరూ లేకపోయే సరికి ఆశ్చర్యపోతాడు.

అది గాలువాలుకు కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే, అతనికి ఒక సత్యం గోచరిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.

అసలు ”కోపం” తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక కుదుపు కారణంగానే అది బయట పడిందని గ్రహిస్తాడు.

అప్పటి నుండి, ఆ ముని తనకెవరైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా, ‘అవతలి వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే. కోపం తనలోనే ఉందన్న ఙ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహిస్తాడు.

అందుకే, మనం కూడా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనకు ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి.

“ఖాళీ పడవ” అనేది ఒక గొప్ప నానుడి. ఖాళీ పడవ మంచిదే. మనను మనకు పరిచయం చేస్తుంది.