DailyDose

జగన్ కార్యాలయ గార్డులకు కరోనా-తాజావార్తలు

జగన్ కార్యాలయ గార్డులకు కరోనా-తాజావార్తలు

* ఏపీ సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. తాడేపల్లిలోని కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న ఎనిమిది మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8మంది సెక్యూరిటీ గార్డులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 2న సీఎం నివాసం వద్ద భద్రతా సిబ్బందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించిన అధికారులు.. ఆ ఫలితాలను ఈ రోజు వెల్లడించారు. దీంతో సీఎం కార్యాలయం వద్ద కరోనా కలకలం మొదలైంది. గతంలోనూ సీఎం నివాసం వద్ద ఇద్దరు భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. తాజగా కరోనా బారినపడిన ఎనిమిది మంది కానిస్టేబుళ్లను క్వారంటైన్‌కు తరలించారు.

* దిల్లీ తర్వాత అత్యధిక మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నది తెలంగాణలోనేనని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి. శ్రీనివాసరావు‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత నెలరోజుల్లో 12వేల మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందారని తెలిపారు. ప్రస్తుతం 13 ల్యాబ్‌ల ద్వారా రోజుకు 6,500 టెస్టులు చేస్తున్నామని, త్వరలో మరో ఐదు ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. టెస్టుల సంఖ్య కూడా పెంచుతామన్నారు.

* విద్యుత్‌ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ విమర్శించారు. విద్యుత్‌ విధానంలో మార్పులు చేయాలన్నారు. శనివారం ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. ‘‘కేంద్రమంత్రి మాటలకు పెడర్ధాలు తీస్తున్నారు. రూ.11కు ఎందుకు విద్యుత్‌ కొన్నారో చెప్పలేకపోతున్నారు. అంతర్జాతీయ పీపీఏలు రద్దు చేయలేదని అజేయ కల్లం చెప్పడం అసత్యం. కరోనా కష్టకాలంలో ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపారు’’ అని లేఖలో విమర్శించారు.

* మహారాష్ట్రలోని ముంబయి, థానే, రత్నగిరి జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ముంబయిలో నిన్న ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ముంబయి పరిసర ప్రాంతాల్లో శనివారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

* వైకాపా నేత మోకా భాస్కర్‌రావు హత్యకేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్‌ ముందుహాజరు పరిచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.

* అమరావతి రైతులకు సీఎం జగన్‌ అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. చంద్రబాబు 30 గ్రామాలకే ప్రతినిధిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రాజధాని రైతులకు ఆయన కౌలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. చంద్రబాబు చేయలేని అభివృద్ధిని అమరావతిలో తమ ప్రభుత్వం చేస్తోందని చెప్పారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,962 మంది నమూనాలు పరీక్షించగా 765 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన 6, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 32 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 727 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 17,699 కేసులు నమోదయ్యాయి.

* అమరావతి అనేది తెలుగువాళ్ల ఆత్మగౌరవ విషయమని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రాభివృద్ధితో ఇది ముడిపడిన అంశమని చెప్పారు. అమరావతి కోసం పోరాడుతున్న వారంతా మహనీయులని కొనియాడారు. అమరావతి పేరుతో ఈ ప్రభుత్వం రాక్షస క్రీడ ఆడుతోందని మండిపడ్డారు. పాత ప్రభుత్వ నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాలన్నారు.

* అమెరికాలోని అలబామాలో కొందరు విద్యార్థులు ‘కొవిడ్‌-19’ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ పార్టీకి విద్యార్థులతో పాటు కరోనా సోకిన వారిని ఆహ్వానిస్తున్నారు. అందరూ ఓ కుండలో డబ్బులు వేసి.. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో కరోనా ఉన్న వారి నుంచి ఎవరికి మొదట కరోనా సోకుతుందో వారికి ఆ కుండలోని డబ్బంతా చెందుతుందని నిబంధన పెట్టుకొని మరీ పార్టీలు జరుపుకొంటున్నారట.

* ఏపీ రాజధాని అమరావతి అంశంపై నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమరావతికి పర్యావరణ సానుకూలతలు ఎన్నో ఉన్నాయని, పాలనా రాజధానిగా అమరావతి ఉండటమే సమంజసమని రఘురామకృష్ణరాజు అన్నారు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం పార్టీ నిర్ణయం కాదని.. ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు.

* అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. కేంద్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన పోరాటం 200 రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.