Agriculture

తెలంగాణాలో లాభదాయకంగా చేపల సాగు

2020 Telugu Agriculture News - Telangana Fisheries On Rise

ఒకప్పుడు చేపల చెరువులంటే ఉభయ గోదావరి జిల్లాలే గుర్తుకొచ్చేది. ‘చేపల చెరువు’ అనే పదమే తెలంగాణ రైతులకు కొత్తగా ఉండేది. గతంలో సరైన నీటివసతి లేకపోవడం కూడా మత్స్య సేద్యంపై రైతుల ఆసక్తిని నీరుగార్చింది. కానీ, కాలం మారింది. ‘కాళేశ్వరం’తో తెలంగాణ రూపురేఖలే మారినయ్‌. రాష్ట్రవ్యాప్తంగా నీళ్లు పరవళ్లు తొక్కుతున్నయ్‌. ఫలితంగా చేపల చెరువులకు తెలంగాణ అనువుగా మారింది. ఇన్నాళ్లూ ఊర చెరువులు, కుంటలకే పరిమితమైన మీనాల పెంపకం, క్రమంగా చేపల చెరువులవైపు మళ్లుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులు చేపల సాగుతో లాభాలు గడిస్తున్నారు. ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

చేపల చెరువులు నీటి ఆధారితమైనవి. చేపల పెంపకానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ఊర చెరువులు, కుంటలు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు వృద్ధి చెంది, బావులు, బోర్లలోనూ నీటిమట్టం పెరిగింది. గతంలో నీటి వసతి లేక చేపల చెరువుల సాగుకు దూరంగా ఉన్న తెలంగాణ రైతులు, ఇప్పుడు ఈ రంగంవైపు ఆసక్తి చూపుతున్నారు. పలు జిల్లాల్లోని రైతులు తమకున్న కొద్దిపాటి భూమిలోనే చెరువులను తవ్వించి, చేపలను పెంచుతున్నారు. ఏడాది పొడవునా అమ్మకాలు చేస్తూ, మంచి లాభాలను గడిస్తున్నారు.

చేపల చెరువుల కోసం ఎకరాల కొద్దీ భూములు అవసరం లేదు. ఉన్న కొద్దిపాటి నేలనీ సద్వినియోగం చేసుకుంటూ, అతి తక్కువ ఖర్చుతో చేపలను పెంచుకోవచ్చు. రైతుల ఆర్థిక స్థోమత, పనితీరు, ఆసక్తినిబట్టి గుంటభూమిలోనూ చేపల చెరువును ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక ఎకరంలోనూ చిన్న చిన్నగా నాలుగు చెరువుల్ని తవ్వించుకోవచ్చు.

ఇతర పంటల మాదిరిగా చేపల సాగుకు ప్రత్యేకంగా ఓ కాలం అంటూ ఉండదు. రైతు ఓపికను బట్టి ఏడాదంతా పెంచుకోవచ్చు. నిరంతరం ఆదాయమూ పొందవచ్చు. అయితే, మొదటిసారి సాగు చేసేటప్పుడు కనీసం కొంతకాలం వేచి చూడాలి. చెరువులో పిల్లల్ని వేసిన తర్వాత వాటి రకాల్ని బట్టి దిగుబడి ప్రారంభమవుతుంది. నాలుగు నెలల తర్వాత నుంచి చేపల అమ్మకం మొదలుపెట్టవచ్చు. ఆరేడు నెలల్లో చేపలు పెద్దగా పెరిగి, లాభాలు కూడా భారీగా వస్తాయి. ఒకటికన్నా ఎక్కువ చెరువుల్లోనే చేపల్ని పెంచితే ఆదాయం బాగుంటుంది. ఒక చెరువులోని చేపలు పెద్దగా అయిన తర్వాత, వాటిని మరొక చెరువులోకి మార్చాలి. తద్వారా ఖాళీ అయిన చెరువులో కొత్త పిల్లల్ని వేయాలి. దీంతో ఒక చెరువులోని చేపలు పూర్తి కాగానే, మరో చెరువు చేతికొస్తుంది. ఈ విధంగా రైతులకు ఏడాదంతా ఆదాయమే.

ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే రైతులకు చేప పిల్లల్ని ఎక్కడ తెచ్చుకోవాలి? చెరువుల్ని ఎలా తవ్వాలి? అనే విషయంలో అయోమయం ఉంటుంది. అయితే రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే అన్ని రకాలు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలో చేపల చెరువులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే చేపల చెరువులపై ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగానే చెరువుల్ని తవ్విస్తున్నది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ వెసులుబాటును కల్పిస్తున్నది. అయితే చెరువుల్ని ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలన్నదానిపై రైతుదే తుది నిర్ణయం. ఎక్కువ విస్తీర్ణంలో చెరువులను తవ్వడం వల్ల చేపలు తిరగడానికి ఎక్కువ స్థలం ఉంటుంది. దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. ఇక చేప పిల్లల విషయానికొస్తే మత్స్యశాఖ ద్వారా ఉచితంగానే చేప పిల్లల్ని పంపిణీ చేస్తున్నది. దీనికి తోడు సాగు విషయంలో రైతులకు అవసరమైన అన్ని రకాల సూచనలు, సలహాలను అందిస్తూ ప్రొత్సహిస్తున్నది. చేపల చెరువుల్ని సాగు చేయాలనుకునే రైతులు వారి వారి జిల్లాల ఉపాధి హామీ పథకం అధికారిని, మత్స్య శాఖ అధికారిని సంప్రదిస్తే పూర్తి వివరాలను అందిస్తారు.

చేపల చెరువుల నిర్వహణలో తరుచుగా నీటిని మారుస్తూ ఉండాలి. అయితే చెరువులోంచి తొలగించే నీరు ఇతర వ్యవసాయ పంటలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నీటిలో చేపల వ్యర్థాలు కలవడంతోపాటు వాటికి వేసే దాణా కూడా ఇందులోనే కరిగి ఉంటుంది. దీంతో ఈ నీళ్లు అధిక సేంద్రియ లక్షణాలను కలిగి ఉంటాయి. వరితోపాటు ఇతర పంటలకు పారించడం వల్ల రసాయన ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు అధిక దిగుబడి కూడా వస్తుంది.

సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు రాజయ్య ఎకరం విస్తీర్ణంలో నాలుగు చేపల చెరువుల్ని తవ్వించాడు. ఇందులో 12వేల చేప పిల్లల్ని పెంచుతున్నాడు. ప్రభుత్వమే ఉచితంగా చెరువును తవ్వించడంతోపాటు చేప పిల్లలను కూడా అందించింది. దీంతో 6 నుంచి 7 నెలల కాలంలో చేపల దాణాకు, చెరువు చుట్టూ ఫెన్సింగ్‌, ఇతర ఖర్చులకు సుమారు రూ.50వేలు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటి వరకు సుమారు 22 క్వింటాళ్ల చేపల్ని విక్రయించి, రూ. 3లక్షల ఆదాయం పొందాడు. ఇంకో చెరువులోని చేపలు అమ్మకానికి సిద్ధంగా ఉండటంతో వాటికి సుమారు రూ. 50వేల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాడు. ఏడు నెలల్లోనే అన్ని ఖర్చులు పోనూ ఏకంగా రూ.2.50 లక్షల నుంచి రూ. 3లక్షల వరకు ఆదాయం పొంది, ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ లెక్కన చేపల చెరువు సాగువల్ల రైతుకు ఏడాదికి కనీసంగా రూ. 5లక్షల ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తున్నది.

తెలంగాణలో చేపలకు భారీ డిమాండ్‌ ఉన్నది. దీంతో వీటిని అమ్ముకోవడం రైతుకు సమస్య కానే కాదు. వ్యాపారులతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చెరువు వద్దకే వచ్చి చేపలు కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వ్యాపారులే చేపలు పెంచుతున్న రైతుల్ని గుర్తించి, మార్కెటింగ్‌ కోసం ఎప్పటికప్పుడు లావాదేవీలు జరుపు తుంటారు. పక్క రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకునే చేపలు చనిపోయి ఉంటాయి. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇష్టపడరు. ఒకవేళ ఆసక్తి చూపినా ధర కూడా తక్కువే పెడుతారు. దీంతో వ్యాపారులు నష్టపోవాల్సి వస్తున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యాపారులు తమకు దగ్గర్లోని చేపల చెరువుల నుంచి చేపల్ని కొనుగోలు చేసి, బతికుండగానే విక్రయిస్తున్నారు. దీంతో వారికి కూడా ఆదాయం ఎక్కువగా వస్తున్నది. ఇటు రైతుకు మార్కెటింగ్‌ ఇబ్బంది లేకుండా, వ్యాపారులకు మంచి లాభాలు రావడంతోపాటు వినియోగదారులకు కూడా తాజా చేపలు లభిస్తున్నాయి.

చేపల చెరువులతో రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సమకూరుతున్నది. ప్రభుత్వమే చెరువుల్ని తవ్వించడంతోపాటు చేప పిల్లల్ని కూడా ఉచితంగానే పంపిణీ చేయడంతోపాటు రైతుకు ఆ మేర ఖర్చులు మిగులుతున్నాయి. ఇక రైతు పెట్టుబడి కేవలం చేపల దాణా మాత్రమే. ఈ దాణాను కూడా మక్కలు, బియ్యం, పల్లీలతో రైతులు సొంతంగా తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్‌లో సుమారు రూ. 30 నుంచి రూ.40కి కిలో చొప్పున లభిస్తుంది. చెరువు విస్తీర్ణం, చేపల సంఖ్యను బట్టి దాణా వేయాల్సి ఉంటుంది. సంప్రదాయ వ్యవసాయంలో రైతులకు ఎక్కువ ఇబ్బంది కలిగించేది కూలీల కొరత. కానీ, చేపల చెరువు విషయంలో ఈ ఇబ్బందే ఉండదు. కూలీల అవసరం లేకుండానే రైతు కుటుంబం సొంతంగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది.