WorldWonders

కిలాడీ లేడీ ఎస్సై

Ahmedabad Lady SI Arrested For 35Lakhs Bribery From Rape Culprit

అత్యాచార కేసు నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేసిన మహిళా ఎస్సైని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన. రేప్ కేసు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అహ్మదాబాద్ పశ్చిమ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శ్వేతా జడేజా రూ. 35 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీసులు ఆమెపై ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ (సంఘ వ్యతిరేక చర్యల చట్టం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. తాము పనిచేస్తున్న కంపెనీ ఎండీ కేనాల్ షా తమపై అత్యాచారానికి పాల్పడినట్టు ఇద్దరు మహిళలు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన శ్వేతా జడేజా నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 35 లక్షలు డిమాండ్ చేశారు. 2019లో ఈ కేసు నమోదు కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన శ్వేత.. నిందితుడు కేనాల్ షా సోదరుడు భావేశ్‌కు ఫోన్ చేసి రూ. 35 లక్షల లంచం డిమాండ్ చేశారు. అయితే, చివరికి ఇద్దరి మధ్య రూ. 20 లక్షలకు బేరం కుదిరింది. మధ్యవర్తి ద్వారా శ్వేత ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 20 లక్షలు అందుకున్నారు. ఆ తర్వాత మరో రూ. 15 లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

శుక్రవారం శ్వేతను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై సంఘ వ్యతిరేక చర్యల చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం ఆమెను సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టి ఏడు రోజుల కస్టడీ కోరారు. అయితే కోర్టు మాత్రం తదుపరి దర్యాప్తు కోసం మూడు రోజుల రిమాండ్‌కు అంగీకరించింది. నిందితుడు అహ్మదాబాద్‌లో షా క్రాప్ సొల్యూషన్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు.