DailyDose

₹1000 తగ్గిన బంగారం-వాణిజ్యం

2020 TNILIVE Business News Roundup - Gold Price Comes Down By 1000 INR

* బంగారం ధరలు సోమవారం వరుసగా నాలుగో రోజూ తగ్గుముఖం పట్టాయి. రూపాయి బలోపేతం కావడంతో పాటు అధిక ధరల వద్ద లాభాల స్వీకరణతో పసిడి ధరలు దిగివచ్చాయి. గత బుధవారం రికార్డుస్ధాయిలో 10 గ్రాముల బంగారం 48,982 రూపాయలు పలుకగా వరుసగా నాలుగు రోజుల్లో తులం బంగారం ఏకంగా 1000 రూపాయలు దిగివచ్చింది. సోమవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి 0.34 శాతం తగ్గి 47,882 రూపాయలకు పడిపోయింది. కిలో వెండి 0.36 శాతం పతనమై 49,000 రూపాయలకు తగ్గింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ 0.1 శాతం తగ్గి ఔన్స్‌ ధర 1772 డాలర్లకు దిగివచ్చింది. కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండటం, అంతర్జాతీయ అనిశ్చితి పరిణామాలతో పసిడి ధరలు నిలకడగా కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

* భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ)లో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధనలు వచ్చాయి. బ్యాంకు శాఖల్లో పరిమితికి మించి లావాదేవీలు నిర్వహిస్తే ఇకపై రుసుము కట్టాల్సి ఉంటుంది. కాగా చిన్న, నో ఫ్రిల్‌ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవు. సగటు నెలవారీ మొత్తం (ఏఎంబీ) రూ.25000 వరకు ఉండే ఖాతాదారుడు బ్యాంకు శాఖల్లో రెండుసార్లు మాత్రమే నగదు ఉపసంహరించుకొనేందుకు అవకాశం ఉంటుంది. రూ.25,000-50000 అయితే 10 విత్‌డ్రావల్స్‌ ఉచితం. రూ.50,000-100,000 ఉంటే 15, రూ.లక్షకు మించి ఏఎంబీ ఉంటే అపరిమితంగా నగదు వెనక్కి తీసుకోవచ్చు. పరిమితి దాటిన వారుమాత్రం ఒక్కో లావాదేవీకి రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లో మాత్రం ఉచితంగా అపరిమిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

* స్వయంసమృద్ధి చెందిన భారతావనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చైనా యాప్‌లను నిషేధించిన ప్రభుత్వం.. వాటికి దీటుగా దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయాలని సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ-కామర్స్‌ రంగంలోనూ దేశీయ కంపెనీలకు పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు త్వరలో ఓ సరికొత్త ఈ-కామర్స్‌ విధానాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అల్ఫాబెట్‌వంటి విదేశీ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించాలన్న డిమాండ్‌ వినిపిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలకు సమాయత్తమైనట్లు సమాచారం. అలాగే ఆయా కంపెనీలు సమాచారాన్ని ఎలా నిర్వహిస్తున్నాయనే అంశంపై నిత్యం ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగేలా నిబంధనల్లో సవరణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ ముసాయిదా రూపొందించిందని.. ఈ కొత్త విధానం రెండేళ్లపాటు అమల్లో ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

* దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 465 పాయింట్లు లాభపడి 36,487 వద్ద, నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 10,763 వద్ద నేటి ట్రేడింగ్‌ను ముగించాయి. ఐటీఐ, త్రివేణీ టర్బైన్‌, గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌, బీహెచ్‌ఈఎల్‌, హింద్‌ కాపర్‌ లాభపడగా.. హిమత్‌ సిగ్కా సెడీ, ఓమెక్స్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌ వంటివి నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేడు రూ.11.5 లక్షల కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది.

* దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.11.5 లక్షల కోట్ల మార్కును దాటేసింది. షేరు ధర ఈ రోజు ఉదయం 2.5 శాతం పెరిగి రూ.1,833.10 దాటింది. ఇటీవలే కంపెనీ జియో డిజిటల్‌ విభాగంలో 12వ విదేశీ పెట్టుబడి రావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఈ డీల్‌ శుక్రవారం ఫైనల్‌ అయిన విషయం తెలిసిందే. డీల్‌లో భాగంగా ఇంటెల్‌ క్యాపిటల్‌కు 0.39 శాతం వాటాను విక్రయించారు. నేటి ఉదయం 10.26 సమయంలో సంస్థ మార్కెట్ విలువ రూ.11,60,142.72 కోట్లకు చేరింది.