Sports

వ్యవసాయం చేస్తున్న కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత

Guntur Commonwealth Gold Winner Is Now Farmer

పొద్దున్నే ట్రాక్టర్‌ నడుపుకుంటూ పొలానికి వెళ్లాడు…వరి బస్తాలు మోశాడు…తిరిగి సాయంత్రానికి ఇల్లు చేరుకున్నాడు..! ఇందులో ప్రత్యేకత ఏముంది ఏ వ్యవసాయదారుడైనా చేసే సాధారణ పనులేగా అనుకుంటున్నారా! కానీ ఈ పనులు చేసింది ఓ ఛాంపియన్‌ అయితే! కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచిన విజేత అయితే.. ! కచ్చితంగా అది విశేషమే! ఈ కుర్రాడే.. యువ వెయిట్‌ లిఫ్టర్‌ రాగాల వెంకట రాహుల్‌! లాక్‌డౌన్‌ ఈ లిఫ్టర్‌ని తాత్కాలిక రైతుని చేసింది. తండ్రిగా సాయంగా పొలం పనులు చేసిన ఈ గుంటూరు కుర్రాడు లాక్‌డౌన్‌ అనుభవాలపై ఏమంటున్నాడంటే.. కరోనా వైరస్‌ ఇంతలా విస్తరిస్తుందని, దాని వల్ల లాక్‌డౌన్‌ విధిస్తారని అసలు ఊహించలేదు. ఆట నుంచి ఇంత కాలం పాటు దూరంగా ఉండడం ఇదే తొలిసారి. వెయిట్‌లిఫ్టర్లకు ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. శరీర బరువును ఎల్లప్పుడూ ఒకేలా ఉంచుకోవాల్సి ఉంటుంది. పొద్దున లేవడం నుంచి బరువులు ఎత్తుతూ.. కసరత్తులు చేస్తూ ఉండేవాణ్ని. కానీ ఈ విరామం అనుకోని దెబ్బ కొట్టింది. అయినప్పటికీ ఇంట్లో ఉంటూనే శారీరక శిక్షణ మీద ప్రత్యేక దృష్టి పెట్టా. ఇంట్లో వెయిట్‌లిఫ్టింగ్‌ కిట్‌ ఉండడం కలిసొచ్చింది. దాంతో సాధన చేశా. రోజుకు అయిదారు గంటలు కష్టపడుతున్నా. మా పొలంలో పరుగులు తీశా. సరైన ఆహార నియమాలు పాటిస్తూ బరువును నియంత్రణలోనే ఉంచుకుంటున్నా. లాక్‌డౌన్‌ వల్ల ఏడాది పాటు వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తోంది. టోర్నీలు లేవు. సాధారణ పరిస్థితులు ఏర్పడి తిరిగి పోటీలు జరగాలంటే మరో ఆరు నెలలు పట్టొచ్చు. నవంబర్‌లో జరగాల్సిన జాతీయ ఛాంపియన్‌షిప్‌ కోసం సన్నద్ధమవుదామనుకున్నా. కానీ వైరస్‌ అడ్డుపడింది. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయకపోవడానికి మోకాలి గాయమే కారణం. నొప్పితోనే ఆ క్రీడల్లో పాల్గొని పసిడి గెలిచా. ఆ తర్వాత గాయం తీవ్రంగా మారింది. దానికి తోడు వెన్నెముక గాయం కూడా బాధించింది. తొమ్మిది నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కానీ మూడు నెలల్లోనే తిరిగి వెయిట్‌లిఫ్టింగ్‌ చేశా. అందుకే అనుకున్న స్థాయి ఫలితాలు రాలేదు. ఈ లాక్‌డౌన్‌ వల్ల తిరిగి పూర్తిగా కోలుకున్నా. మునుపటి జోరు అందుకుంటాననే నమ్మకంతో ఉన్నా. తిరిగి ఆటలు మొదలయ్యాక కుదురుకునేందుకు సమయం పట్టేలా ఉంది. కానీ ఇన్నేళ్లుగా ఆటతోనే సాగుతున్నా కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. టోర్నీల షెడ్యూల్‌ వస్తే పూర్తిస్థాయిలో సన్నద్ధమవుదామని అనుకుంటున్నా. దేశంలో రోజురోజుకూ కరోనా రోగుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇప్పట్లో ఆ అవకాశం లేదనిపిస్తోంది.