Devotional

విగ్రహారాధన ఎందుకు చేయాలి?

విగ్రహారాధన ఎందుకు చేయాలి?

వేదాంతులు ఏ దేవుణ్నీ ప్రత్యేకించి ప్రస్తావించరు. మనిషికైతే మాత్రం దేవుడు తనకు మానవాకారంలో కాని, సృష్టిలో కనిపించే రూపాల్లోకాని, అతణ్ని ఊహించుకుంటూ చూస్తున్నప్పుడే సంతృప్తి. అందుకే అతడు ఆ రూపాలను విగ్రహాలుగా మలిచి, దేవాలయాలు నిర్మించి, అందులో ప్రతిష్ఠించుకుంటాడు.

వేదాంతులన్నట్ల్లుగా- దేవుణ్ని నిరాకార నిర్గుణ చైతన్యం అన్నా, నామ గుణ రూప రహితుడన్నా… పామరుడు సామాన్య జ్ఞానంతో తెలుసుకోలేడు. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం అని చెబితే- పండితులకు కానీ తెలియని పెద్ద మాటలని అనుకుంటాడు. దేవుణ్ని దేవాలయాల్లో విగ్రహంగా చూసుకుంటూ ఆరాధించడమే అతడికి ఇష్టం. తనకు నచ్చిన పేర్లు పెట్టి ఆ దేవుణ్ని పిలుచుకోవడానికే అతడు మొగ్గుచూపుతాడు. సృష్టిలో కనిపించే శ్రేష్ఠమైన వస్తువులను, ధన కనక వస్తువాహనాలను కానుకలుగా దేవుడికివ్వాలని అనుకుంటాడు. ఇష్టదైవాల పేర్లు పెట్టి పిల్లలను పిలుచుకుంటాడు.

భగవంతుడి శక్తి విద్యుచ్ఛక్తిలాంటిది. అది నేరుగా చూడలేనిది. పరికరాలుంటేనే కానీ అది ప్రవహించదు. ఆస్తికతను అర్థం చేసుకున్న జ్ఞానులు, ఆ దైవశక్తిని అందుబాటులోకి తెచ్చుకుని అనుభవించడానికి ఉన్న పరికరమే దైవ విగ్రహమని తెలుసుకొమ్మంటారు. త్రిమతాచార్యులుగా ప్రసిద్ధికెక్కిన వేదాంత మహాగురువులు శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు ముగ్గురూ విగ్రహారాధనను సమర్థనీయమన్నారు.

ఆస్తికతకు అర్థం తెలియనివారికి దేవతామూర్తుల విగ్రహాలు ప్రయోజనం లేని మానవ కల్పితాలుగా కనిపిస్తాయి. దేవుడికి అన్ని పేర్లా అంటూ అవహేళనగా ప్రశ్నిస్తారు. దైవంతో సరళమైన, శక్తిమంతమైన, తిరుగులేని సంబంధం ఏర్పడటానికి విగ్రహారాధన ప్రక్రియగా ఏర్పరచుకుని, మహాత్ములెందరో ఫలితం సాధించారని తెలియనప్పుడు అటువంటి విమర్శలు వస్తాయి. సత్యశోధనకు విగ్రహారాధనతో వచ్చే ఉపశమనం వేరుగా ఉంటుంది. ఏకాగ్రచిత్తంతో జరిపిన విగ్రహ పూజతో భావరహిత స్థితికి చేరుకుని, ఆరాధన ఆరాధకుడూ వేరు కాదన్న విషయాన్ని నిరూపించిన భాగవతోత్తముల చరిత్రలు తెలియనివి కావు. రామభక్తుడైన వాగ్గేయకారుడు త్యాగరాజు, నిత్యపూజ కోసం తన పూజాగృహంలో ప్రతిష్ఠించుకుని నిరంతరం ఆరాధించుకుంటున్న రామలక్ష్మణ సీతాదేవి విగ్రహాలను కిట్టనివారు ఎవరో నదిలోకి విసిరి పారవేస్తారు. అప్పుడాయన ఆవేదనతో, రచించి ఆలపించిన కీర్తనలకు స్పందించి భగవంతుడే ఆ విగ్రహాలను అవి ఉన్నచోటుకు చేర్చినట్లు వివరించే కథనం తెలిసిందే. కలియుగంలోనే, నిష్కామ భక్తితో కాళీమాత రూపాన్ని ఆరాధించిన రామకృష్ణ పరమహంస భగవత్‌సాక్షాత్కారం పొందిన అనుభూతి కలిగించుకున్నారు.

మనోవాక్కాయ కర్మలతో ముడివడిన విగ్రహారాధననే సనాతన ధర్మం ఆచరించమంటున్నది. దేవాలయ నిర్మాణాలు, విగ్రహ పూజల విధి విధానాలను ఆగమ శాస్త్రం సహేతుకంగా వివరిస్తుంది. దేవాలయంలో దేవుడి ఎదుట చదివే మంత్రాలను, స్తోత్రాలను దేహానికి, మనసుకు ఉపశమనమిచ్చే విధంగా మహర్షులు రచించి ఇచ్చారు. దేవాలయాలు సందర్శిస్తున్నప్పుడు భక్తితో దైవరూపాలను కొలుస్తున్నప్పుడు మనిషికి- భగవంతుడు పత్రం, ఫలం, తోయాలు తప్ప మరేదీ అడగలేదని గీతలో ఆయనే చెప్పిన విషయం గుర్తుకు రావాలి.

భగవంతుడి సాక్షాత్కారం ఇప్పించలేని మహిమలు తనకు వద్దంటాడు వివేకానందుడు. అంతర్యామిని చేరుకోవడమే లక్ష్యంగా సాగే ఆధ్యాత్మికులందరికీ గుర్తుండవలసిన విషయమది.