DailyDose

సరిహద్దులో రాత్రివేళ ఆపరేషన్లకు ఏర్పాట్లు-తాజావార్తలు

TNILIVE Breaking News - Border Security Arrangements For Night Battle

* అస్తవ్యస్త నిర్మాణాలతో తెలంగాణ సచివాలయం ప్రజల అవసరాలను తీర్చలేకపోతోందని తెరాస నేత, ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. కొత్త సచివాలయం అందుబాటులోకి వస్తే.. ప్రజలందరికీ ఒకేచోట నుంచి సేవలు అందించే అవకాశముంటుందన్నారు. సచివాలయ భవనం కూల్చివేత నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రతిపక్షాల ఆరోపణలకు కాళేశ్వరం ప్రాజెక్టు సరైన సమాధానం చెప్పిందని, అలాగే కొత్త సచివాలయ భవనం అందుబాటులోకి వచ్చాక తాజా ఆరోపణలకు కూడా సరైన సమాధానం లభిస్తుందని తెలిపారు.

* క‌రోనావైర‌స్‌ను ఎదుర్కోవ‌డం కోసం చైనా సినోవాక్ బ‌యోటెక్ త‌యారుచేస్తోన్న వ్యాక్సిన్ మూడో ద‌శకు చేరుకున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్‌ బ్రెజిల్‌లో ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్ కోసం చైనా కంపెనీ సినోవాక్ బ్రెజిల్‌కి చెందిన‌ వ్యాక్సిన్ త‌యారీదారు ‘ఇన్‌స్టిట్యూటో బూటాన్‌ట‌న్’‌తో క‌లిసి ప‌నిచేయ‌నుంది. దీనిలోభాగంగా జులైలో మూడోద‌శ ట్ర‌య‌ల్స్‌ ప్రారంభించ‌డానికి దాదాపు 9వేల మంది ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకోనుంది. జ‌న‌వ‌రి చివ‌ర‌లోనే క‌రోనా వ్యాక్సిన్ త‌యారీని ప్రారంభించిన సినోవాక్ బ‌యోటెక్ కొవిడ్ వ్యాక్సిన్ ప్లాంటును సిద్ధం చేస్తోంది. సంవ‌త్స‌రానికి ప‌దికోట్ల డోసుల‌ను త‌యారుచేసే సామ‌ర్థ్యం క‌లిగిన ఈ ప్లాంటు ఈ సంవ‌త్స‌రం చివ‌రినాటికి పూర్తికానుంది.

* విద్యార్థుల పాఠ్య ప్రణాళికా భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను 9-12 తరగతుల పాఠ్యప్రణాళికను హేతుబద్ధీకరించామని సీబీఎస్‌ఈ తెలిపింది. దాదాపు 30శాతం వరకు సిలబస్‌ తగ్గించామని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖా మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు.

* భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనా బలగాలు వివాదాస్పద ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా కుయుక్తులను దృష్టిలో ఉంచుకొని భారత్ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ మేరకు లద్దాఖ్‌ ప్రాంతంలో భారత్ వాయుసేన రాత్రి పగలుతో పాటు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా యుద్ధ సన్నద్ధతపై అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా వాయుసేనకు చెందిన ఫైటర్‌ జెట్‌లు, యుద్ధ హెలికాఫ్టర్లు, మల్టీ మిషన్ చాపర్లు వంటి వాటిని అక్కడి ఎయిర్‌బేస్‌ నుంచి రాత్రి సమయాల్లో కూడా ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

* ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఉగ్రవాదులు కొత్త అవకాశంగా మలుచుకునే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. ఉగ్రవాదంపై కరోనా ప్రభావాన్ని ఇప్పటికిప్పుడే అంచనా వేయడం సాధ్యం కాకపోయినప్పటికీ.. దీన్ని ఆసరాగా చేసుకునేందుకు ఉగ్రముఠాలు యత్నిస్తున్నాయన్న విషయం సుస్పష్టం అని తెలిపారు. ప్రజల మధ్య విభజన, ప్రాంతీయ అస్థిరత వంటి దుశ్చర్యలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కొవిడ్‌-19 సంక్షోభాన్ని ఓ అస్త్రంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నారు. ఒకప్పుడు సిరియా, ఇరాక్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించిన ఐసిస్‌.. ఈ సంక్షోభం ఆసరాగా చేసుకొని మరోసారి తన పట్టుకోసం యత్నింస్తోందని తెలిపారు. సోమవారం ఐరాస ఉగ్రవాద నిరోధక వారోత్సవాల్ని ప్రారంభిస్తూ ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

* ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బాధాకరమైన రోజని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం 4 కోట్ల ప్రజలను పణంగా పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేది.. కానీ ఇవాళ న్యాయవ్యవస్థ పై కూడా ప్రజల అసంతృప్తితో ఉన్నారన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే లోపే కూల్చివేత పనులు పూర్తి చేయాలనే ఆలోచనతోనే సచివాలయాన్ని కూల్చుతున్నారని ఆరోపించారు.

* వైకాపా ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజల కోసం కాదు అని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతిపై తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ‘‘పేదల ఇళ్లలోనూ వైకాపా నేతలు కక్కుర్తి పడుతున్నారు. ప్రజాధనాన్ని ఎక్కడికక్కడ దుర్వినియోగం చేస్తున్నారు. తెదేపా హయాంలో 10 లక్షల ఇళ్లు కట్టాం. మేం కట్టిన ఇళ్లను కరోనా సెంటర్లుగా మార్చారు’’ అని ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.

* క‌రోనావైర‌స్‌ను ఎదుర్కోవ‌డం కోసం చైనా సినోవాక్ బ‌యోటెక్ త‌యారుచేస్తోన్న వ్యాక్సిన్ మూడో ద‌శకు చేరుకున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్‌ బ్రెజిల్‌లో ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్ కోసం చైనా కంపెనీ సినోవాక్ బ్రెజిల్‌కి చెందిన‌ వ్యాక్సిన్ త‌యారీదారు ‘ఇన్‌స్టిట్యూటో బూటాన్‌ట‌న్’‌తో క‌లిసి ప‌నిచేయ‌నుంది. దీనిలోభాగంగా జులైలో మూడోద‌శ ట్ర‌య‌ల్స్‌ ప్రారంభించ‌డానికి దాదాపు 9వేల మంది ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకోనుంది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,178 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి 1,155 మంది, ఇతర ప్రాంతాల నుంచి వారు 23 మందికి సోకినట్లు పేర్కొంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 21,197కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 11,200 మంది చికిత్స పొందుతుండగా.. 9,745 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది.

* విండీస్‌ ఆటగాడైన బ్రావో మంచి సింగర్‌. తనే స్వయంగా పాటలు రాసి ఆల్బమ్స్‌ రూపొందిస్తాడు. మహీ పుట్టిన రోజు సందర్భంగా అతడు ‘హెలికాప్టర్‌’ పేరుతో ఒక పాటను విడుదల చేశాడు. మహీ తనకు సోదరుడని పేర్కొన్నాడు. నంబర్‌ 7 జెర్సీ ధరించే ధోనీ అంటే అందరికీ ఇష్టమన్నాడు. అంతేకాదు.. అతడిని మూడో స్థానంలో పంపి ప్రపంచానికి గొప్ప క్రికెటర్‌ను పరిచయం చేసిన గంగూలీకి ధన్యవాదాలు తెలిపాడు.

* కరోనా చికిత్సలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛార్జీల వసూలుపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది శ్రీకిషన్‌ శర్మ పిల్‌ వేశారు. కరోనా చికిత్సలు, ఛార్జీల్లో పారదర్శకతపై ప్రైవేటు ఆస్పత్రులకు మర్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. కరోనా చికిత్సలకు ఎంత చార్జీ తీసుకోవాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం శోచనీయమని హైకోర్టు అభిప్రాయపడింది.

* ‘‘ప్రైవేటు ల్యాబుల్లో ఒకట్రెండు ఫలితాలు తప్పుగా వచ్చినట్లు తెలిసింది. మరోసారి తప్పుడు రిపోర్టు వస్తే లైసెన్స్‌ రద్దు చేయడానికి వెనుకాడం’’ అని ఆంధ్రప్రదేశ్‌ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా బాధితులతో మంత్రి మాట్లాడారు. వారికి అందుతున్న ఆహారం, వైద్య చికిత్సపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై కొవిడ్‌ బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. టెస్టుల సంఖ్య పెంచడం వల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం నిజమే అని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

* స్వతంత్ర బ్రాండ్‌గా అవతరించిన పోకో.. భారత మార్కెట్‌లోకి తన మూడో ఫోన్‌ను విడుదల చేసింది. పోకో ఎం2 ప్రో పేరిట మంగళవారం లాంచ్‌ చేసింది. ఇంతకుముందు పోకో ఎఫ్‌1, పోకో ఎక్స్‌2 పేరిట ఫోన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ ఫోన్‌ ఫీచర్స్‌ ఏంటి? ధరెంత లాంటి వివరాలపై లుక్కేద్దాం! మార్చిలో షావోమి విడుదల చేసిన రెడ్‌మీ నోట్‌ 9 ప్రోను.. పోకో ఎం2 ప్రో పోలి ఉంటుంది. పంచ్‌ హోల్‌ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్‌ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.

* భారత హిమాలయ పర్వతసానువుల్లో ఉద్రిక్తతలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయవద్ద నుంచి భారత్‌, చైనా బలగాలు వెనక్కిమళ్లడంతో పరిస్థితి కొంత తేలికపడింది. మరోపక్క భారత్‌-నేపాల్‌ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదంలో మరోసానుకూల పరిణామం చోటు చేసుకొంది. తాజాగా గల్వాన్ పై ప్రకటన వెలువడిన సమయంలో ఈ వార్త బయటకు రావడం విశేషం.

* ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే సంవత్సరం ఆరంభం వరకూ భారత్‌.. కరోనా వైరస్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి నెలకొందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. తాజాగా మయాంక్‌ అగర్వాల్‌తో ఓపెన్‌ చాట్‌లో పాల్గొన్న దాదా కొవిడ్‌ 19పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి ఐపీఎల్‌ను మన దేశంలో నిర్వహించే పరిస్థితులు లేవన్నాడు.