Business

మాల్యాకు చేదువార్త-వాణిజ్యం

2020 July Telugu Business News - Mallya Gets Bad News From SBI

* యస్‌ బ్యాంక్‌ రూ.15వేల కోట్ల ఎఫ్‌పీవో (ఫర్‌దర్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌)కు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అవసరమైన పత్రాలను రెగ్యూలేటరీలకు అందజేసినట్లు గురువారం బ్యాంక్‌ వెల్లడించింది. ఈ ఆఫర్‌ జులై 15న మొదలై 17న ముగుస్తుంది. ఈ వారం మొదట్లో బ్యాంక్‌ క్యాపిటల్‌ రైజింగ్‌ కమిటీ నుంచి అనుమతి వచ్చిందని పేర్కొంది. ‘‘జులై 7న మహారాష్ట్రలోని ముంబయి రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వద్ద ఆర్‌హెచ్‌పీని దాఖలు చేశాం’’ అని రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 408 పాయింట్లు లాభపడి 36,737 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు లాభపడి 10,813 వద్ద ముగిశాయి. డీబీకార్ప్‌, డిష్మన్‌ కార్బొజన్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, అరవింద్‌ షేర్లు భారీగా లాభపడగా.. ఎంఎంటీసీ, ఫ్యూచర్‌ రిటైల్‌, ఓమెక్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, జైన్‌ ఇరిగేషన్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. గురువారం మధ్యాహ్నం గ్లోబల్‌ వీక్‌ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం తర్వాత మార్కెట్లు జోరుగా కదిలాయి. ఆయన భారత్‌ వేగంగా కోలుకుంటోందనే దానికి సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పడం మార్కెట్లకు ధైర్యాన్ని ఇచ్చింది. బజాజ్‌ ఫైనాన్స్‌, టాటాస్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ బాగా లాభపడ్డాయి. టీసీఎస్‌ షేర్లు సానుకూలంగా ట్రేడ్‌ అయ్యాయి. నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు నేడు పెరిగాయి.

* వరుసగా రెండేళ్ల పాటు వాహన విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణిస్తున్నందున, అసలే తక్కువగా ఉండే డీలర్ల లాభదాయకత ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత తగ్గిపోతుందని రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ పేర్కొంది. తమ వద్ద రేటింగ్‌ పొందిన 2051 మంది డీలర్ల స్థితిపై క్రిసిల్‌ నివేదిక రూపొందించింది. ఈ ప్రకారం.. 2019-20లో వాహన అమ్మకాల్లో 18 శాతం క్షీణత నమోదవ్వగా, కొవిడ్‌-19 వల్ల జూన్‌ త్రైమాసికంలో మరింత కుదేలవ్వనుంది. వ్యాపారాలు బాగా తక్కువగా జరుగుతుండటం, రాకపోకలపై ఆంక్షలు, విచక్షణకు అనుగుణంగా ఖర్చు పెట్టే శక్తిని ప్రజలు కోల్పోవడం వల్ల వాహన అమ్మకాలు క్షీణిస్తున్నాయని వివరించింది. ఫలితంగా కొత్తగా మరింతమంది వాహన డీలర్లను నియమించుకోవాలన్న కంపెనీల లక్ష్యాలకు అవరోధం ఏర్పడుతోందని పేర్కొంది.

* విజయ్‌ మాల్యాపై తాము దివాలా ఆర్డరు జారీ చేసినందున, చెల్లింపునకు సంబంధించిన సెటిల్‌మెంట్‌ కోసం అతను ముందుకొచ్చినా ప్రయోజనం లేదని భారతీయ బ్యాంకులు ఇంగ్లండ్‌ హైకోర్టుకు తెలిపాయి. లండన్‌లోని హైకోర్టుకు చెందిన దివాలా విభాగంలో మాల్యా కేసుపై జరిగిన విచారణలో భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ) నేతృత్వంలోని 13 భారతీయ బ్యాంకులు తమ వాదన వినిపించాయి. మాల్యా తెలిపినట్లు తాము సెక్యూర్డ్‌ క్రెడిటర్లు కాదని వివరించాయి. రెండో సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ కింద యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ ఆస్తులను మాల్యా చూపారని, అయితే అవి అధికారిక లిక్విడేటర్‌ ఆధీనంలో ఉన్నాయని బ్యాంకులు గుర్తు చేశాయి. అందువల్ల మాల్యా ఆఫర్‌కు విలువ లేదని తెలిపాయి. రాజకీయ కారణాల వల్ల తనకు భారత్‌లో న్యాయం జరగదన్న మాల్యా వాదన పట్టించుకోవద్దని కోరాయి. భారత్‌కు తనను అప్పగించకుండా మాల్యా చేస్తున్న యత్నాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. ఇంగ్లండ్‌ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే హక్కు కూడా గత మేలో తిరస్కరణకు గురైంది. ఇక యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రభుత్వ నిర్ణయమే తేలాల్సి ఉంది.

* కరోనావైరస్‌ రోగులకు అత్యవసర చికిత్సలో వినియోగించే రెమిడెసివిర్‌ను సరికొత్త రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు గిలిద్‌ సైన్సెస్‌ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు రెమిడెసివిర్‌ను ఇంజెక్షన్‌ రూపంలో రోగుల ఇస్తున్నారు. తాజాగా ఈ యాంటీ వైరల్‌ ఔషధాన్ని ఇన్‌హీలర్‌ రూపంలో వినియోగించే అంశంపై సదరు సంస్థ పరీక్షలను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా వెల్లడించింది. దీనికోసం 18-45ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 60 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమై ఇన్‌హీలర్‌ అందుబాటులోకి వస్తే రోగులు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కొత్త విధానంలో నెబులైజర్‌ సాయంతో ఈ ఔషధాన్ని రోగికి ఇవ్వనున్నారు. ఇలా చేయడం వల్ల రోగికి ఇన్ఫెక్షన్‌ సోకిన భాగంలోనే తొలుత నయం చేసే అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. భారత్‌లో కూడా ఇటీవల కొవిడ్‌ రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల పర్యవేక్షణలో రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 సమయంలో సెన్సెక్స్‌ 123 పాయింట్లు లాభపడి 36,452 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 10,744 వద్ద కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. నిన్న అమెరికన్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నేడు ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు ఆతృతగా ఉన్నారు. శంకర బిల్డింగ్స్‌, తేజస్‌ నెట్‌వర్క్‌, మాగ్మా ఫిన్‌ కార్ప్‌, సెంటీరియం క్యాపిటల్‌, సెయిల్‌ లాభపడగా.. ఫ్యూచర్‌ రిటైల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌, జైన్‌ ఇరిగేషన్‌, సుజ్లాన్‌ ఎనర్జీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నేడు మొత్తం 19 కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.