Agriculture

ఆద్యంతం లాభదాయకం…కొబ్బరి సాగు

ఆద్యంతం లాభదాయకం…కొబ్బరి సాగు

కొబ్బరి.. అనగానే కోనసీమే గుర్తుకొస్తుంది. భారీ ఎత్తున పెరిగే కొబ్బరి చెట్ల వల్లే ఆ ప్రాంతానికి సరికొత్త అందం వచ్చింది. పుష్కలమైన ఆదాయమూ సమకూరుతున్నది. ఆ కోనసీమ అందాలు తెలంగాణలో కనిపిస్తే..? కనులకు ఇంపుగా అనిపించే ఆ కొబ్బరి తోటలు.. ఇక్కడి రైతులనూ లాభాల బాట పట్టిస్తే..? అవును.. కేరళ, కోనసీమలకే పరిమితమైన కొబ్బరి తోటల అందాలు, త్వరలోనే తెలంగాణలోనూ కనువిందు చేయనున్నాయి. గతంలో సరైన నీటి వసతి లేక కొబ్బరిసాగుపై ఆసక్తి చూపని రైతాంగం, ఇప్పుడు పుష్కలంగా నీటి సౌకర్యం పెరగడంతో ఆ దిశగా ముందడుగు వేస్తున్నది.
*ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నది.
కొబ్బరి చెట్టు కల్పవృక్ష సమానమైంది. మానవ జీవనంలో ఈ చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరి ఈనె నుంచి కొబ్బరి నూనె వరకు.. కొబ్బరి కాయ నుంచి కొబ్బరి బెరడు వరకు.. ప్రతి ఒక్కటీ మనిషికి ఉపయోగపడేదే. అందుకోసమే కొబ్బరి చెట్లను పెంచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మన తెలంగాణలో ఎక్కువగా వ్యవసాయ బావుల వద్ద, పొలం గట్లపైన ఒకటో రెండో చెట్లను మాత్రమే పెంచుకొనేవారు. కానీ, కొబ్బరి తోటలవైపు అడుగు మాత్రం వేయలేకపోయారు. కాళేశ్వరంతో నీటి తిప్పలు తప్పిన తర్వాత.. ఇప్పుడు కొబ్బరి తోటల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో, ఈ ఏడాది ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టు కింద గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో కొబ్బరి తోటల పెంపకాన్ని చేపడుతున్నది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 1141 ఎకరాల్లో సాగు చేస్తుండగా, 68.46 లక్షల కొబ్బరి కాయల ఉత్పత్తి జరుగుతున్నది. ఇతర జిల్లాల్లోనూ ఆసక్తి ఉన్న రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.
*ఎక్కువ తేమ అవసరం..
కొబ్బరి సాగుకు అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండే నేలలు అనుకూలంగా ఉంటాయి. అయితే ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఇతర ప్రాంతాల్లోనూ వీటిని సులభంగా సాగు చేసుకోవచ్చు. వేసవిలో రోజూ కనీసం 50 నుంచి 60 లీటర్ల నీరు అందించాల్సి ఉంటుంది. సేంద్రియ విధానం ద్వారా నేలలో ఎక్కువ కాలం తేమ ఉండేలా చేయవచ్చు. రాలిపోయే కొబ్బరి ఆకుల్ని, అంతర పంటల ఆకుల్ని కాల్చివేయకుండా అదే స్థలంలో ఉంచాలి. తద్వారా నేలలో తేమశాతం అధికంగా ఉంటుంది. ఈ చెట్లకు నీరు అందించేందుకు డ్రిప్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఫలితంగా నీటి వృథాను అరికట్టడంతోపాటు చెట్టుకు సరైన పద్ధతిలో నీరు అందించే అవకాశం ఉంటుంది. సౌడు (నీరు ఇంకే స్వభావం లేని) నేలలు మినహా, అన్ని రకాల నేలలూ కొబ్బరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా పొట్టిరకం, సంకర జాతి చెట్లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెరుగుతాయి.
*మనకు ప్రత్యేకం
ప్రస్తుతం మన రాష్ట్రంలో కొన్ని పొడుగు రకాలను, పొట్టి రకాలను రైతులు సాగు చేస్తున్నారు. పొడుగు రకాల్లో ఈస్ట్‌ కోస్ట్‌ టాల్‌, వెస్ట్‌ కోస్ట్‌ టాల్‌, అండమాన్‌ ఆర్డినరీ, లక్కదీవి ఆర్డినరీ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అదే పొట్టి రకాల్లో చౌగట్‌ ఆరెంజ్‌ డ్వార్ఫ్‌, గంగాబోండం (గౌతమీ గంగ), మలయన్‌ గ్రీన్‌ డ్వార్ఫ్‌, మలయన్‌ ఎల్లో డ్వార్ఫ్‌, గోదారి గంగా సంకరరకాలు సాగవుతున్నాయి. సంకర రకాలను మినహాయిస్తే మిగతా రకాల్లో దిగుబడి కాస్త తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న పొడవు, పొట్టి రకాలతోపాటు తెలంగాణ వాతావరణానికి అనుకూలమైన కొత్త వంగడాలను కేరళలోని సెంట్రల్‌ ప్లాంటేషన్‌ క్రాప్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీపీసీఆర్‌ఐ) అభివృద్ధి చేసింది. ఇందులో ఎక్కువగా పొట్టిరకం జాతులే ఉన్నాయి. కల్పజ్యోతి, కల్పసూర్య, సంకరజాతి రకాలైన కేర సంకర, చంద్ర సంకర, కల్పసమృద్ధి వంటి రకాలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ జాతులతో పోల్చితే ఈ రకం చెట్లు ఎక్కువ కాయల్ని అందించనున్నాయి. కల్పజ్యోతి రకం వంగడాలకు ఒక్కో చెట్టుకు సగటున 144 కాయలు, కల్పసూర్య వంగడాలకు ఒకోచెట్టుకు 123 కాయలు, కేర సంకర చెట్లకు 130 కాయల దాకా దిగుబడి వస్తుంది. దిగుబడి అధికంగా వస్తుండటంతో, రైతులకు అదే స్థాయిలో లాభాలూ పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి కొబ్బరి సాగుకు నీరు అధికంగా అవసరం అవుతుంది. అందుకే కేరళతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కొబ్బరిని సాగు చేస్తుంటారు. నదీ పరీవాహక ప్రాంతాలు ఇందుకు అనుకూలం. ఇన్నేళ్లూ తెలంగాణలో నీటి వనరులు లేకపోవడంతో కొబ్బరి పంట సాగువైపు రైతులు దృష్టి పెట్టలేదు. ఏపీ సరిహద్దులోని ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో కొంత మంది రైతులే కొబ్బరిని సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ పుణ్యామా అని చెరువులు, కుంటలు, బావులు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు కూడా గతంతో పోల్చితే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కొబ్బరి సాగుకు మన రాష్ట్రం కూడా అనుకూలంగా మారింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో కొబ్బరి సాగును ప్రోత్సహిస్తున్నది. అంతర పంటలతో అదనం: కొబ్బరి సాగులో రైతుకు కలిసొచ్చే మరో అంశం అంతరపంటల సాగు. కొబ్బరి చెట్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. దీంతో రైతులు అంతరపంటలను సాగు చేసుకోవచ్చు. అంతర పంటలుగా మొదటి మూడేండ్లపాటు కూరగాయలు, పసుపు, అల్లం, అరటి, పూల తోటల్ని సాగు చేసుకోవచ్చు. ఆ తర్వాత, ఏడేండ్ల నుంచి కోకో పంట సాగు చేసుకోవచ్చు. కూరగాయలు, అల్లం, పసుపు, పూల సాగు వల్ల అప్పటి ధరను బట్టి ఆదాయం పొందవచ్చు. అదే విధంగా కోకో పంట సాగుతో ఏటా నికరంగా రూ. 20వేల వరకు అదాయం పొందే వీలుంది. ఈ విధంగా అంతరపంటలతో ఏటా కనీసంగా రూ.50వేలకు పైగానే ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంటే అన్నీ కలిపి ఏడాదికి నికరంగా రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తున్నది.
*రైతులకు భారీ సబ్సిడీ :
కొబ్బరి సాగు చేసే రైతులకు భారీ స్థాయిలో సబ్సిడీ లభిస్తున్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం తరపున కొబ్బరి అభివృద్ధి సంస్థ కూడా సబ్సిడీ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీలో భాగంగా గుంతలు తీసేందుకు, ఇతర ఖర్చుల కోసం ఎకరానికి మూడేండ్లకు గానూ రూ.37,414 సబ్సిడీ కింద అందిస్తున్నది. దీనికి తోడు నీరు పారించేందుకుగాను డ్రిప్‌ సిస్టమ్‌కు అదనపు సబ్సిడీ ఉంటుంది. అదే విధంగా కొబ్బరి అభివృద్ధి సంస్థ రైతుకు అయ్యే ఖర్చులో 25శాతం సబ్సిడీ ఇస్తున్నది. దీంతో రైతుకు పెట్టుబడి భారమంతా ఈ సబ్సిడీలతోనే తీరనున్నది. ఒక విధంగా చెప్పాలంటే, రైతు తన సొంత పెట్టుబడి లేకుండానే కొబ్బరి సాగు చేయవచ్చు. ఇక కొబ్బరి అభివృద్ధి సంస్థ హెక్టారు(2.5 ఎకరాలు)కు అయ్యే ఖర్చులో 25శాతం సబ్సిడీని ఇస్తుంది. ఇందులో భాగంగానే పొడుగు రకం మొక్కలు హెక్టారుకు 150 నాటాల్సి ఉంటుంది. ఒక్కో మొక్కకు రూ. 173 ఖర్చవుతుంది. మొత్తం రూ. 26వేలు ఖర్చయితే ఇందులో రూ. 6,500 రాయితీ లభించగా రైతు రూ.19,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక హైబ్రీడ్‌ రకాల్లో ఒక హెక్టారుకు 200 మొక్కలు నాటుతారు. ఒక మొక్కకు రూ.135 చొప్పున మొత్తం రూ.27వేలు ఖర్చవుతుంది. ఇందులో 25శాతం సబ్సిడీ రూపంలో.. అంటే రైతుకు రూ. 6750 రాయితీ రాగా, రూ. 20,250 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పొట్టి రకాల్లో హెక్టారుకు 200 మొక్కలు నాటాలి. ఒక్కో మొక్కకు రూ. 150 ఖర్చుకాగా, మొత్తం రూ.30వేలు వ్యయం అవుతుంది. ఇందులో రైతుకు రూ.7500 సబ్సిడీరాగా, రూ.22500 చెల్లించాల్సి ఉంటుంది.
*భారీ డిమాండ్‌:
మార్కెట్‌లో కొబ్బరి బొండాలు, కొబ్బరి కాయలు, కొబ్బరి నూనెలకు భారీ డిమాండ్‌ ఉంది. సాగు విస్తీర్ణం తగ్గుతుండటం, రవాణా ఖర్చులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం కొబ్బరి ధరలపై పడుతున్నది. భవిష్యత్‌లోనూ ఈ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు రాష్ట్ర ఉద్యానవన అధికారులు. ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్నది. దీంతో కొబ్బరి నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లోనూ వారానికి కనీసం మూడు నుంచి నాలుగు కొబ్బరి బొండాలు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కొబ్బరి కాయ కొట్టాల్సిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ధరలు ఇంకా ఎక్కువ అవుతాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
**ప్రతిభాగం ఉపయోగమే..
కొబ్బరి చెట్టు కాయలే కాకుండా, చెట్టులోని ప్రతి భాగమూ ఉపయోగకరమే. ఏదీ వృథా కాదు. కొబ్బరి పీచు నుంచి తాళ్లు నేయడంతోపాటు, ఈ పీచును చైనాకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇక ఆకుల పుల్లల నుంచి చీపుర్లను తయారు చేయవచ్చు. కొబ్బరి పెంకులను కాల్చి ఆ పొడిని రంగుల తయారీలో ఉపయోగిస్తారు. చెట్టుకు గల ఇతర ఉపయోగాలతో, ఉప ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. చెట్టు కొట్టిన తర్వాత వాటి కాండాలను ఇండ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఇలా.. చెట్టు ప్రతి భాగంతో రైతుకు ఆదాయం సమకూరుతుంది.
*రూ. 60వేల నుంచి రూ. 80వేల దాకా..
కొబ్బరి సాగు వల్ల రైతులకు పెద్ద మొత్తంలోనే ఆదాయం సమకూరనున్నది. ఏడాదికి ఎకరానికి రూ. 60 వేల నుంచి రూ.80వేల దాకా నికర ఆదాయం లభించనున్నది. ఒక మొక్క కొనుగోలు చేసి నాటేందుకు రూ. 70 దాకా ఖర్చవుతుంది. అంటే, ఎకరానికి 60 మొక్కలు నాటితే.. రైతుకు రూ.4,200 వ్యయం. వీటికితోడు ఎరువులు, ఇతర ఖర్చులు అదనంగా ఉంటాయి. ఏటా అన్నీ పోనూ ఒక్కో చెట్టుకు రూ. వెయ్యి నుంచి రూ.1500 నికర ఆదాయం వస్తుంది.
*70 ఏండ్ల పాటు దిగుబడి
ఇతర పంటల మాదిరిగా కాకుండా కొబ్బరి సాగు దీర్ఘకాలిక పంట. మొక్క నాటిన నాటి నుంచి కనీసం 50 నుంచి 70 ఏండ్ల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. మరో నాలుగైదేండ్లలో దిగుబడి తగ్గుతుందన్న దశలో.. అదే ప్రాంతంలో కొత్త పంట సాగుకు చర్యలు తీసుకోవాలి. పాత చెట్లకు మూడు నాలుగు మీటర్ల దూరంలో కొత్త మొక్కల్ని నాటుకోవాలి. దీంతో పాత మొక్క దిగుబడి ఆగిపోయే నాటికి కొత్త మొక్క దిగుబడి ప్రారంభం అవుతుంది. దీంతో రైతుకు నిరంతర ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.
*ఎకరానికి 60 మొక్కలు..
కొబ్బరి సాగులో మొక్కల ఎంపిక నుంచే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యమైన మొక్కల్ని ఎంపిక చేసుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి చీడపీడల బాధలు లేకుండా నివారించవచ్చు. ఏడాది నుంచి ఏడాదిన్నర వయసు గల మొక్కల్ని మాత్రమే నాటుకోవాలి. ఎక్కువ ఆకులు, మొదలు లావుగా ఉండి, ఆకులు త్వరగా విడివడే లక్షణాలు గల మొక్కల్ని ఎంచుకోవాలి. 20 నుంచి 40 ఏండ్ల వయసు గల చెట్టు నుంచి తీసిన విత్తనాల ద్వారా ఉత్పత్తి చేసే మొక్కకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక రకాన్ని బట్టి ఎకరానికి 60 నుంచి 70 మొక్కలను నాటుకోవచ్చు. మొక్కకూ మొక్కకూ కనీసం 8 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. కొబ్బరి సాగు చేయాలనుకునే రైతులకు ఉద్యానశాఖ అధికారులే మొక్కలను సరఫరా చేస్తారు.
*3 నుంచి 5 ఏండ్లలో కాత..
కొబ్బరి వంగడాల రకాలను బట్టి మూడు నుంచి ఐదేండ్లలో పంట ఉత్పత్తి ప్రారంభమవుతుంది. పొడవు రకం వంగడాల్లో ఐదు నుంచి ఆరేండ్లలో కాయలు కాస్తాయి. అదే పొట్టి రకం, సంకర జాతి వంగడాల్లో మూడు నుంచి నాలుగేండ్లలోనే కాయలు వస్తాయి. పొడుగు వంగడాలతో పోలిస్తే పొట్టి రకం, సంకరజాతి వంగడాల్లో దిగుబడి కూడా అధికంగానే ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి కాయలను తెంపేందుకు వీలుగానూ ఉంటుంది.