WorldWonders

నిబద్ధతకు పరాకాష్ఠ ఈ పెద్దాయన

నిబద్ధతకు పరాకాష్ఠ ఈ పెద్దాయన

విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగుల నిబద్ధత గురించి మనం ఎన్నో రకాలుగా వింటూనే ఉంటాం. వారిలో కొందరు మాత్రం తమ ఉద్యోగ స్థాయితో సంబంధం లేకుండా ఎంతో నిజాయితీగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా విధులకు మాత్రం ఆటంకం కలగనివ్వరు. అలా 30 ఏళ్లుగా ఓ ప్రభుత్వ ఉద్యోగి రోజుకు 15 కి.మీ నడుచుకుంటూ విధులకు హాజరవుతున్నాడు. ఇందులో గొప్పతనం ఏముంది అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు విషయం.. ఎందుకంటే సదరు ఉద్యోగి ప్రయాణించేది మామూలు దారి గుండా కాదు..దట్టమైన అడవి మార్గంలో. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కున్నూర్‌ ప్రాంతంలో డి శివన్‌ పోస్ట్‌మాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధిల్లో భాగంగా ఆయన 30 ఏళ్లుగా అడవిలో రోజూ 15 కి.మీ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాల్లో ఉత్తరాలను డెలివరీ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన కొన్నిసార్లు క్రూర మృగాలు దాడులను కూడా ఎదుర్కొన్నారట. అయినా ఏ మాత్రం బెదరకుండా అలానే నడుకుంటూ విధులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఆయన పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా శివన్ అంకిత భావాన్ని మెచ్చుకుంటూ ఐఏఎస్‌ అధికారిణి సుప్రియ సాహూ ఆయన గురించి ట్వీట్‌ చేశారు. ‘‘ పోస్టమాన్‌ డి. శివన్‌ మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు డెలివరీ చేసేందుకు దట్టమైన అడవి గుండా రోజూ 15 కి.మీ నడుకుంటూ 30 ఏళ్లపాటు విధులకు హాజరయ్యారు. పలుమార్లు ఆయన్ను ఏనుగులు, ఎలుగుబంట్లు వెంబడించాయి. అయినా ఆయన భయపడకుండా జలపాతాలను దాటుకుంటూ అంకితభావంతో కర్తవ్యాన్ని నిర్వహించాడు. గత వారం ఆయన పదవీ విరమణ పొందాడు’’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ చూసిన పలువరు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు, నెటిజన్లు ‘దేశ నిర్మాణంలో ఇటువంటి వారి పాత్ర ఎంతో ముఖ్యం’, ‘ఆయన ఎంతో మంది యువతకు స్ఫూర్తి’, ‘పద్మ పురస్కారానికి ఆయన అర్హుడు’ అంటూ శివన్‌ అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.