Fashion

కుంకుడుకాయలతో కేశాలు ప్రకాశిస్తాయి

కుంకుడుకాయలతో కేశాలు ప్రకాశిస్తాయి

‘అబ్బా… కుంకుడుకాయలా… పరమబోర్‌…’ అంటూ ముఖం చిట్లించకండి. కాసిని కుంకుళ్లు ఉంటే చాలు… రసాయనాల్లేని సహజమైన సబ్బు, షాంపూ, డిటర్జెంట్‌, క్లీనర్‌… అన్నీ నిమిషాల్లోనే తయార్‌. అందుకే పది కాయలు కొట్టండి, పలు రకాలుగా వాడుకోండి… అంటున్నారు సేంద్రియ ప్రియులు.
** రెండు దశాబ్దాల క్రితం వరకూ తలస్నానం అంటే కుంకుడుకాయలు కొట్టాల్సిందే. రసం తీయాల్సిందే. ఎలా పోయిందోగానీ క్రమంగా కుంకుడుకాయ సైడయిపోయింది. పేదాగొప్పా తేడా లేకుండా అందరి ఇళ్లలోకీ చౌకదో ఖరీదైనదో షాంపూ చొరబడిపోయింది. కారణం కచ్చితంగా అందులోని సౌకర్యమే. కుంకుడుకాయల వాడకంలోని కష్టమే. అవునుమరి, కుంకుడు రసం కళ్లలో పడితే మంట… నోట్లోకి వెళితే చేదు… దాంతో పిల్లలయితే అవంటేనే గగ్గోలు పెట్టేవారు. ఇవన్నీ అలా ఉంచితే వాటిని కొట్టాలి. రసం తీయాలి. ఇంత కష్టం ఎందుకని ప్రతి ఒక్కరూ ఇష్టంగానో కష్టంగానో షాంపూకి అలవాటుపడిపోయారు. ఫలితం… చుండ్రు తగ్గదు. జుట్టు రాలడం ఆగదు. అందుకే రూటు మార్చుకుని మళ్లీ మూలాల్లోకి తొంగి చూస్తున్నారు. దీనికితోడు కొందరు సేంద్రియ యువ వ్యాపారవేత్తలు కుంకుళ్లతో షాంపూలూ సబ్బులూ డిటర్జెంట్‌లూ ఫ్లోర్‌ క్లీనర్లూ… వంటి ఉత్పత్తులకీ శ్రీకారం చుట్టారు. దాంతో మర్చిపోయిన కుంకుడుకాయ మరోసారి అందర్నీ పలకరిస్తోంది.
** కుంకుడుకాయనే హిందీలో రీటా, అరిత అని పిలిస్తే; ‘అనర్థాల నుంచి కాపాడే పండు’ అనే అర్థంలో సంస్కృతంలో రక్ష బీజ, అరిష్టక అని అంటారు. ఆసియా, అమెరికా ఖండాల్లో పెరిగే ఈ జాతిలో అనేక రకాలున్నాయి. మనదగ్గర పెరిగే రకాల్లో కాయల తొక్క మందంగా ఉంటే, పాశ్చాత్యదేశాల్లో పెరిగే కాయల్లో గింజ కనిపిస్తూ పారదర్శకంగా ఉంటాయి. వేల సంవత్సరాల నుంచీ మనతోబాటు అమెరికన్లూ దీన్ని వాడిన దాఖలాలు ఉన్నాయి. మనదగ్గర దీంతో తల రుద్దుకోవడాన్నే చంపూ అని పిలిచేవారు. అదే క్రమంగా షాంపూగా పాశ్చాత్య దేశాలకు పరిచయమైంది. అంటే- షాంపూ పుట్టుకకి కుంకుడుకాయలే కారణం అన్నమాట.