Politics

రాయలసీమ కరువు నివారణపై జగన్ సమీక్ష

రాయలసీమ కరువు నివారణపై జగన్ సమీక్ష

అక్టోబర్‌ 1 నుంచి రాయలసీమ కరువు నివారణ పనులు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వాటర్‌గ్రిడ్‌, ఇరిగేషన్‌, నదుల అనుసందానం, స్కూల్స్‌, ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రమంత్రులు బుగ్గన, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలకు నిధుల సమీకరణపై అధికారులతో చర్చించారు. నిధుల సమీకరణపై కచ్చితమైన ప్రణాళిక ఉండాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా లక్ష్యాలు, అంతేవేగంతో చేయనున్న పనులను పూర్తి చేయాలని సూచించారు. ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు-నేడు పూర్తి కావాలన్నారు.

స్టేట్‌వాటర్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌లో భాగంగా పోలవరం నుంచి అదనపు జలాల తరలింపు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ,తాగునీటి కల్పనపై చర్చించారు. కృష్ణ-కొల్లేరు ప్రాంతం ఉప్పు నీటిమయం కాకుండా చేపట్టాల్సిన నివారణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు.