Health

ఖబడ్దార్…కరోనా+డెంగీ కలిసి వస్తున్నాయి

Corona + Dengue Will Come Together - 2020 Health News

కరోనాతో డెంగ్యూ దోస్తీ.. మున్ముందు ఎదురయ్యే సమస్యలివే: శాస్త్రవేత్తలు

డెంగ్యూ అంటేనే డేంజర్.. దీనికి కోవిడ్-19 తోడైతే, ఊహించుకుంటేనే భయమేస్తోంది కదూ. దీనిపై వైరాలజిస్టులు ఏం చెబుతున్నారో చూడండి.

వర్షాకాలం అంటేనే వ్యాధుల సీజన్. ఈ కాలంలో ఏర్పడే వ్యాధులు.. కరోనా సమస్యను మరింత జఠిలం చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధితో మరింత ప్రమాదం పొంచి ఉందని, త్వరలో వైద్యులకు మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. కరోనా వైరస్, డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఒకే తరహాలో ఉంటాయి. వీటి మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం. దీంతో ప్రజలు డెంగ్యూ లక్షణాలను కరోనాగా భావించే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ డెంగ్యూ సోకినవారికి కరోనా కూడా ఉన్నట్లయితే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని భావిస్తున్నారు.

‘డెంగ్యూ-కోవిడ్ 19’ సీజన్‌లో రెండు రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే, ఈ వ్యాధుల లక్షణాలతో రోగుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక రోగం వల్ల మరో రోగం మరింత ముదురుతుంది. అంటే, కరోనా సోకిన రోగికి డెంగ్యూ ఏర్పడినా, డెంగ్యూ రోగికి కరోనా సోకినా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఫలితంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.

దేశంలో కోవిడ్-19 కేసులు 8 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు ఈ వ్యాధితో 21,604 మంది చనిపోయారు. 2016-2019 నాటి గణంకాలను పరిశీలిస్తే.. ఏటా లక్ష నుంచి రెండు లక్షల డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (NVBDCP) లెక్కల ప్రకారం 2019లో 1,36,422 కేసులు నమోదయ్యాయి. సుమారు 132 మంది చనిపోయారు.

దక్షిణాదిలోనే ఎక్కువ?: ‘‘దక్షిణాదిలో వర్షాల ప్రభావం వల్ల డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాగే, ఉత్తరాదిలో చలికాలం ఆరంభంలో దీని తీవ్రత అధికం’’ అని డీబీటీ, వెల్‌కమ్ ట్రస్ట్ ఇండియా అల్లియన్స్ సీఈవో, వైరాలజిస్ట్ షహీద్ జమీల్ ‘పీటీఐ’ వార్తా సంస్థకు తెలిపారు.

రెండు రోగాల లక్షణాలు ఒక్కటే: కోవిడ్-19, డెంగ్యూ వ్యాధి లక్షణాలు సుమారు ఒకేలా ఉంటాయి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. డెంగ్యూ సీజన్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోతే పరిస్థితి దయనీయంగా ఉంటుందని అమిటీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, వైరాలజిస్ట్ ద్రువజ్యోతి చటోపాధ్యాయ్ తెలిపారు. ‘‘కరోనా-డెంగ్యూల సీజన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం మీద పూర్తిస్థాయిలో అధ్యయనం జరగలేదు. కానీ, దక్షిణ అమెరికా నుంచి సమాచారం మేరకు ఇది చాలా భయానకంగా ఉంటుందని, వైద్య రంగానికి ఇది పెద్ద సవాలుగా మారుతుందని తెలిసింది’’ అని ఆయన పేర్కొన్నారు.

డెంగ్యూ సిజన్ మొదలైందంటే పరిస్థితి అదుపు చేయడం కష్టమని మరో వైరాలజిస్ట్ ఉపాసనా రాయ్ తెలిపారు. ముఖ్యంగా దోమల నియంత్రణపై తప్పకుండా శ్రద్ధ పెట్టాలన్నారు. డెంగ్యూ, కరోనా లక్షణాలతో హాస్పిటల్‌లో చేరే రోగుల కోసం తగిన సదుపాయాలను సిద్ధం చేసుకోవాలన్నారు. మూడు రోజులపాటు జ్వరంతో బాధపడే రోగికి డెంగ్యూ టెస్టుతోపాటు కరోనా వైరస్ పరీక్షలు కూడా నిర్వాహించాల్సి ఉంటుందన్నారు. మరి, ఇందుకు తగిన వైద్య సదుపాయాలు, హాస్పిటళ్లలో పడకల సదుపాయాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మరి, ప్రభుత్వాలు దీనిపై ముందుగానే జాగ్రత్తపడి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. పరిస్థితి దయనీయంగా మారుతుంది.