Editorials

జీవితమే ఒక ధ్యానం

Life is a meditation - Telugu spiritual news

‘జీవితమే ఒక కాలాతీత ధ్యానం’ అయినప్పుడు జీవితంలో మనకు మరో పని ఉండదు. ధ్యానం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. ధ్యానం కోసం ప్రత్యేక సమయాన్ని వెదుక్కోవాల్సిన అగత్యం ఉండదు. ఎండాకాలం పగటిపూట ఎండ కోసం వెదుక్కోవాల్సిన పని ఉండదు. పౌర్ణమిరోజు వెన్నెల కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాదు.

అమావాస్య, చీకటి వేరు కాదు. జీవితమే ధ్యానం అయినప్పుడు, ధ్యానం మరో పని కాదు. ధ్యానం జీవిత పరమావధి అయినప్పుడు ధ్యానం ఒక సంబరం అవుతుంది. ఒక సంరంభం అవుతుంది. నిత్యజీవితంలో మరో పని ఉండదా, మరే అవసరం రాదా? ధ్యానమే క్షణక్షణం, ధ్యానమే కణకణం అయినప్పుడు మరో పనికోసం ప్రత్యేక క్షణం ఏదీ? నిజమే. కానీ ధ్యానంలోంచే మరో పని కోసం సమయాన్ని వెదుక్కోవాలి. కేటాయించుకోవాలి. త్వరగా ముగించుకోవాలి.

ఎందుకంటే ప్రాధాన్య క్రమంలో ప్రాపంచిక అవసరాలు ద్వితీయ శ్రేణివే అవుతాయి. మన ఆలోచనా పరిధిలోకి రానివే రాకూడనివే అవుతాయి. సర్వసంగ పరిత్యాగులకు తప్ప ప్రాపంచికావసరాలు తప్పనివే అవుతాయి. తనకోసం కాకపోయినా తనవాళ్ల కోసం తన సమాజం కోసం. కొండొకచో తనకోసం కూడా. అందువల్ల ధ్యానమయ జీవితంలోనూ ప్రపంచానికి కొంత చోటివ్వక తప్పదు. ఆలోచనల్లో, ఆచరణలో కొంతభాగం పెట్టక తప్పదు. ధర్మవ్యాధుడి లాంటివాళ్లు ఇందుకు ఉదాహరణ.

భావాతీత ధ్యానాన్ని కాలాతీత ధ్యానంగా మలచుకుంటే… నిజానికి భావాతీత ధ్యానం కాలానికి అతీతంగానే కాలాతీత ధ్యానంగానే నడుస్తుంది. గుర్తురాని, గుర్తుండని కాలం కోసం ధ్యాని ప్రయత్నపూర్వకంగా స్పృహలోకి రావలసి ఉంది. వచ్చినా ఆ ఎరుక ఉంటుంది.

క్రీడలో ఒక వర్తులంలో ఆడుకుంటున్న పిల్లలు ఆటలో అవసరార్థం ఆ వర్తులపు పరిధి దాటి ఇవతలికి వచ్చినా వెంటనే ఆ పని చేసుకుని మళ్లీ వర్తులంలోకి హడావుడిగా పరిగెత్తిపోతారు. శ్రద్ధాళువైన ధ్యాని కూడా ధ్యాన జీవితమనే పరిధిలోంచి అవసరార్థం ఇవతలకు రావలసి వచ్చినా వెంటనే ధ్యాన వర్తులంలోకి వెళ్లిపోవలసి ఉంది. అంత నిష్ఠగా, అంత నిబద్ధతాపూర్వకంగా అనుసరిస్తే తప్ప- ధ్యానం ఒక శ్వాసగా, భగవంతుడికి సేవగా జీవిస్తే తప్ప అల్పాయుష్కులైన కలియుగ మానవులు గమ్యాన్ని చేరుకోలేరు.

ఈ అరిషడ్వర్గాల బంధనాలు, ఇంద్రియలాలసలు మన ఆధ్యాత్మిక ప్రయోగానికి, ప్రయత్నానికి శల్య సారథ్యంలాంటివి. లోపభూయిష్ఠ రహితంగా కాలాన్ని వినియోగించుకుంటే తప్ప జీవితాన్ని, కాలాన్ని ధ్యానావశిష్టం చేసుకోలేం. ముక్తి అంటే… ఒక చిట్టిచీమ మేరుపర్వతం ఎక్కేపని ఇది. ఒక అంగుళమంత పక్షిపిల్ల ఆకాశాన్ని అధిగమించి సప్తసముద్రాలు దాటేందుకు చేసే ప్రయత్నం ఇది. నిజానికి, పూనుకొన్న పనిపట్ల వాటికున్నంత నిబద్ధత మనకు లేదు. ఓపిక, సహనం మనకుండవు. మిగిలిన జీవజాలం అనుకుంటే మరుక్షణం, అదేక్షణం పనిలో పడిపోతుంది. ఒక పక్షి తన పిల్లలను రక్షించుకోవాలని సముద్రాన్నేతోడిపోసే పనిలో పడింది. విశ్వపరిమాణంలో మనిషి అత్యల్పుడే కావచ్చు. కానీ అతడికి పరిమాణ రహితమైన మనసుంది. మేధ ఉంది. ఆత్మను ధరించిన మరో పరమాత్మ అతడు… నిజంగా సంకల్పిస్తే చేయలేనిది ఏముంది?