Kids

మాటను మించిన ఆయుధం ఉందా?

Telugu Kids News - Words Are The Most Powerful Weapons

అవసరం లేకపోయినా గోరంతలు, కొండంతలు చేసి గొడవలు సృష్టించి అనవసరంగా అందరినీ విసిగించి నోరు పారేసుకుంటారు కొందరు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు పెద్దలు. నోరుందని నోటి దురద తీర్చుకోవటానికి కాబోలు కొందరు ఏమీ లేనిదానికి కూడా అవాకులు, చవాకులు మాట్లాడుతుంటారు.

కొందరికి చిరుతిండ్లు తినందే ఆకలి తీరదు. అదే విధంగా మరికొందరికి దురుసుగా మాట్లాడందే నోటిదురద తీరదు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. దైవం ఇచ్చిన నోటితో దైవనామాన్ని పలకాలి, కీర్తించాలి. పదిమంది మేలు కోరుకోవాలే గాని, అనరాని మాటలు మాట్లాడి, నోటికి కల్మషం అంటించరాదు.

ఎవరైనా ఎదురుపడితే, ఆత్మీయంగా “బాగున్నారా?” అని అడిగితే, ఆ ఒకే ఒక్కమాట వల్ల ఇద్దరి మధ్యా ఆత్మీయత ఏర్పడుతుంది. ఎదుటి వ్యక్తికి మనపై సదభిప్రాయం ఏర్పడుతుంది. కష్టనష్టాల్లో ఉన్న వ్యక్తిని ఆదరంగా పలకరిస్తే, ఆ మాటలు అతనికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే పలకరింపు అనేది మొక్కుబడిగా ఉండరాదు. సహజంగా ఉండాలి. ఎవరైనా మనల్ని చక్కగా పలకరిస్తే మనం ఎంత ఆనందిస్తామో, మనం కూడా ఇతరులను అదే విధంగా పలకరించాలి.

కాలుజారినా ప్రమాదం లేదు గానీ, నోరు జారితే ఎంతో ప్రమాదం. కాలుజారితే అయ్యే గాయాన్ని మందుతో మాన్పవచ్చు. నోరుజారి మనస్సును గాయపరచిన గాయాన్ని మాన్పుట ఎంతో కష్టం. ఎందుకంటే చిరిగిన వస్త్రాన్ని సరిచేయవచ్చునేమో గానీ, విరిగిన మనస్సును సరిచేయటం ఎంతో కష్టం. అందుకే నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారరాదు. నోటిని అపవిత్రం చేయరాదు.

నోటితో మంచి పలుకులే పలకాలి, ఆ పలుకులు ఇంపుగా ఉండాలి. మాట్లాడే మాటలపై మనకు అదుపు ఉండాలి. ఎందుకంటే మాటలలోనే మర్మం ఉంది. మాటలలోనే సర్వం ఉంది.