DailyDose

సచివాలయ కూల్చివేత ఆపమని హైకోర్టు ఉత్తర్వ్యూలు-తాజావార్తలు

సచివాలయ కూల్చివేత ఆపమని హైకోర్టు ఉత్తర్వ్యూలు-తాజావార్తలు

* సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయ ప్రాంతంలో కొత్త నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం ప్రస్తుత భవనాల్ని కూల్చివేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ దీంతో ప్రభుత్వం కూల్చివేత ప్రారంభించింది. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పనులు నిలిచిపోనున్నాయి.

* భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ అరుదైన ఘనత సాధించారు. సంపన్నుల జాబితాలో ఆయన అపర దానకర్ణుడిగా పేరుగాంచిన వారెన్‌ బఫెట్‌ను వెనక్కినెట్టారు. బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. ఆసియా నుంచి టాప్‌-10లో ఉన్న ఒకే ఒక్కరు ముఖేశ్‌ కావడం గమనార్హం.

* లిఫ్ట్‌ అడిగి కారులో ఎక్కిన వ్యక్తి వద్ద ఏటీఎం కార్డు లాక్కొని, రూ.46 వేలు దోచుకున్నవారిని షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. షాద్‌నగర్‌ గ్రామీణ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయకిరణ్‌ యాదవ్‌ షాద్‌నగర్‌లో ఉంటూ కొందుర్గు శివారులోని ఓ టెక్స్‌టైల్స్‌లో పనిచేస్తున్నాడు. జూన్‌ 30న రాత్రి 8 గంటలకు విధులు ముగించుకుని షాద్‌నగర్‌ వెళ్లేందుకు రోడ్డుపై నిలబడి ఉన్నాడు. కొందుర్గు వైపు నుంచి షాద్‌నగర్‌ వెళ్తున్న ఓ కారును లిఫ్ట్‌ అడిగి ఎక్కాడు. డ్రైవర్‌ శివకుమార్‌, అందులో ఉన్న మరో ఇద్దరు రమేశ్‌, రాజు అలియాస్‌ రూప్లా కారులోనే జయకిరణ్‌ను బెదిరించి ఏటీఎం కార్డు తీసుకొని పాస్‌వర్డ్‌ తెలుసుకున్నారు. షాబాద్‌ శివారులో బాధితుడిని వదిలేశారు. షాద్‌నగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద రూ.20 వేలు, నందిగామ పెట్రోల్‌ బంకు వద్ద మరో రూ.26 వేలు ఫోన్‌ పే ద్వారా చెల్లించారు. జయకిరణ్‌ నుంచి ఫిర్యాదు అందుకున్న కొందుర్గు ఎస్‌ఐ శ్రీను, జిల్లేడు చౌదరిగూడ ఎస్‌ఐ కృష్ణ, సిబ్బంది గురువారం నిందితులను పట్టుకొని రూ.35వేలు స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్‌పై గతంలో పలు కేసులు ఉన్నాయన్నారు.

* సచివాలయ భవనాల కూల్చివేతతో ఆలయం, మసీదుకు ఇబ్బంది కలగడంపై సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. సచివాలయ స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో ఆలయం, మసీదు నిర్మిస్తామన్నారు. భవనాలు కూల్చే క్రమంలో ప్రార్థనామందిరాలపై శిథిలాలు పడి కొంతనష్టం జరిగిందని తెలిపారు. ఇలా జరగడంపట్ల ఎంతో చింతిస్తున్నానని, ఇది కాకతాళీయంగా జరిగిందని, అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ‘‘ప్రార్థనామందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు.ఎన్నికోట్లయినా వెనుకాడకుండా ఆలయం, మసీదు నిర్మిస్తాం. పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి వాటిని సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తాం.దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ‘తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్పూర్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

* టీమ్‌ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ 71వ పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ శుక్రవారం ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాడు. గావస్కర్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న లిటిల్‌మాస్టర్‌ ఈ సందర్భంగా తాను తొలిసారి అతడిని కలుసుకున్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘1987లో గావస్కర్‌ సర్‌ను తొలిసారి కలిసే అవకాశం దక్కింది. 13 ఏళ్లు కుర్రాడిగా ఆ రోజు నా అదృష్టాన్ని నమ్మలేకపోయా. నేను ఎవరినైతే అభిమానిస్తూ పెరిగానో, ఎవరంతటి గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకోవాలనుకున్నానో ఆ క్రికెటర్‌ను కలుస్తున్నానని ఆశ్చర్యపోయా. అదెంతో ప్రత్యేకమైన రోజు. మీకు 71వ పుట్టిన రోజు శుభాకాంక్షలు సర్‌. ఈ ఏడాదంతా పూర్తి ఆరోగ్యంతో పాటు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. కాగా, పలువురు క్రికెట్‌ ప్రముఖులు సైతం గావస్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లడించారు.

* ఇవాళ తెలంగాణాలో బ్లాక్ డే అని.. కేసీఅర్ ఇతర మతాల విశ్వాసాలు, ఆచారాలను దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సచివాలయాన్ని ఇప్పుడు కూల్చి వేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ‘వాస్తు పేరుతో కేసీఆర్ సచివాలయాన్ని కూల్చివేయడం మంచిది కాదు. తన కొడుకును సీఎం చేయడం కొసమే సచివాలయం కూల్చివేస్తున్నారు. సెంటిమెంట్ తప్పు కాదు, కానీ మూఢ నమ్మకాలు మంచివి కావు. వందల కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారు. మంత్రివర్గంలో తుది నిర్ణయం తీసుకోలేదని మేం వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అన్ని రకాల పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా కూల్చుతారు? కూల్చివేసిన గార్బెజ్‌ను ఎక్కడ వేస్తారో చెప్పాలి’

* టాప్‌ 10 న్యూస్ @ 5 ఫం

1. సౌర వెలుగుల్లో భారత్‌ కొత్త శిఖరాలకు..

శుద్ధ ఇంధన రంగంలో ప్రపంచంలోనే ఆకర్షణీయ మార్కెట్‌గా భారత్‌ ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని రీవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్‌ పార్కు ఏర్పాటైంది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ పార్కుని శుక్రవారం ప్రారంభించిన మోదీ.. దీన్ని జాతికి అంకితం చేశారు. దీంతో మధ్యప్రదేశ్‌ శుద్ధ, సౌర ఇంధనానికి కేంద్రంగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. సౌర శక్తి శుద్ధమైన, భద్రతమైన, భరోసా కల్పించే ఇంధనమని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తితో సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ఐదు అగ్రశ్రేణి దేశాల సరసన భారత్‌ నిలిచిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘అది.. కొవిడ్‌ కంటే ప్రమాదం’

ఇప్పటికే కరోనాతో బెంబేలెత్తిపోతున్న ప్రపంచాన్ని రోజుకో కొత్త రోగం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కుదిపేస్తుండగానే.. కొత్తగా జీ-4, బ్యుబానిక్‌ ప్లేగు వంటివి ప్రజల్ని మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా కజఖ్‌స్థాన్‌లో మరో కొత్త వ్యాధి బయటపడ్డట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం తెలిపింది. జాగ్రత్తగా ఉండాలంటూ ఆ దేశంలోని చైనా పౌరుల్ని అప్రమత్తం చేసింది. ఈ కొత్త న్యుమోనియాతో బాధపడుతున్న వారిలో మరణాల రేటు కొవిడ్‌-19తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఈ కొత్త వ్యాధికి కొవిడ్‌-19తో పోలికలు ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేనట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మళ్లీ అప్పుడు జిల్లాలు మారుస్తారా?: సోమిరెడ్డి

పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన ఏపీలో జిల్లాల పెంపు యోచన సరికాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం, నెల్లూరు, శ్రీకాకుళం, కడప, లాంటి జిల్లాలను పెంచాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పెద్ద జిల్లాలను విభజిస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. 2026లో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగడం వల్ల పార్లమెంటు నియోజకవర్గాల హద్దులు మారిపోతాయని, అప్పుడు జిల్లాలను మళ్లీ మారుస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటి నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నాన్న నల్లగా ఉన్నాడని అమ్మ వాళ్లు మాట్లాడలేదు

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్న జాతి వివక్షపై స్పందించిన విండీస్‌ దిగ్గజ పేసర్‌ మైఖేల్‌ హోల్డింగ్‌ లైవ్‌లో కంటతడి పెట్టుకున్నాడు. సౌథాంప్టన్‌ వేదికగా బయోసెక్యూర్‌ విధానంలో ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా మైఖేల్‌ బుధవారం స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా జాతి వివక్షపై ప్రజలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ‘నిజం చెప్పాలంటే అలా భావోద్వేగం చెందడానికి కారణం నా తల్లిదండ్రులను గుర్తుచేసుకోవడమే. ఇప్పుడు కూడా ఏడుపొస్తుంది. మా నాన్న నల్లగా ఉన్నాడని మా అమ్మవాళ్ల కుటుంబం ఆమెతో మాట్లాడలేదు. వాళ్లు ఎలాంటి అనుభవాలు చవిచూశారో నాకు తెలుసు’ అని వాపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కరోనా మరణాలు తగ్గిస్తున్న బీసీజీ!

కరోనా వైరస్‌ మరణాలను అడ్డుకోవడంలో వందేళ్లనాటి క్షయ వ్యాక్సిన్‌‌ కీలక పాత్ర పోషిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే బీసీజీ వ్యాక్సినేషన్‌‌ కొనసాగుతున్న దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన అలర్జీ, సంక్రమణ రోగాల సంస్థ చేసిన ఓ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపించాయి. అమెరికాలోని న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, లూసియానా, ఫ్లోరిడాతో పోలిస్తే బ్రెజిల్‌లోని పెర్నాంబుకో, రియోడి జనీరో, సావో పాలో, మెక్సికోలోని మెక్సికో నగరంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని అధ్యయనం ద్వారా తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హ్ఛ్Qతో ఎంత బాగున్నానో చూశారు కదా!

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో మరోసారి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రతి రోజూ ఒకటి చొప్పున తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇప్పుడు తనకెంతో తేలిగ్గా ఉందని, స్పష్టంగా మాట్లాడగలుగుతున్నానని అన్నారు. కొవిడ్‌-19 సోకినప్పటికీ బొల్సొనారో ఎప్పటిలాగే తన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తన అధికారిక నివాసం నుంచి గురువారం సాయంత్రం ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. ఆయనతో పాటు మంత్రులు, సీనియర్‌ అధికారులు, భాషా అనువాదకులు ఉండటం గమనార్హం. ముందు నుంచీ ఆయన ‌మహమ్మారిని తేలిగ్గా తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టిక్‌టాక్‌: బీజింగ్‌కు దూరంగా ప‌్ర‌ధాన‌ కార్యాల‌యం‌!

భార‌త్‌లో కోట్ల మంది యూజ‌ర్ల‌కు దూర‌మైన టిక్‌టాక్ త‌న‌పైప‌డ్డ మ‌ర‌క‌ల‌ను చెరిపే ప్ర‌య‌త్నం చేసుకుంటోంది. తాజాగా త‌న మాతృసంస్థ బైట్‌డాన్స్‌లో భారీ మార్పులు చేప‌ట్టే యోచ‌న‌లో ఉన్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. దీనిలోభాగంగా తొలుత ఆ సంస్థ‌ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని బీజింగ్ నుంచి దూరంగా త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తోంది. అతిపెద్ద కార్యాల‌యాలు లాస్ఏంజెల్స్, న్యూయార్క్‌, డ‌బ్లిన్‌, ముంబ‌యిలలో ఉన్న‌ట్లు ఇదివ‌రకే వెల్ల‌డించిన సంస్థ, ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌కార్యాల‌యాన్ని ఎక్క‌డికి మారుస్తార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ధోనీ రనౌట్‌తో కోట్లాది మంది నిరాశ

టీమ్‌ఇండియా కష్టాల్లో ఉన్న ఎన్నోసార్లు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. బ్యాట్స్‌మన్‌ అంతా పెవిలియన్‌ చేరినా టెయిలెండర్లతో కలిసి విజయాలు అందించాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ గెలిపిస్తాడని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును విజయానికి చేరువ చేసినా ఆఖర్లో ఇద్దరూ ఔటయ్యారు. దీంతో భారత్‌ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరీ ముఖ్యంగా ధోనీ రనౌట్‌‌ అయ్యాక కోట్లాది మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అదే రోజు మహీ చివరిసారి మైదానంలో కనిపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సినిమాల్లోకి బిగ్‌బీ మనవడు?

ప్రస్తుతం బాలీవుడ్‌లో బంధుప్రీతి హాట్‌ టాపిక్‌గా మారింది. చిత్రపరిశ్రమలో ప్రముఖుల వారసులకే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయని, సినీ నేపథ్యంలేని వారికి ప్రోత్సాహం అందట్లేదని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు వారసుల సినీరంగ ప్రవేశాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం నుంచి మరో వ్యక్తి వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబంలో దాదాపు అందరూ నటులే. ఆయన సతీమణి జయా బచ్చన్‌ అప్పట్లో నటిగా మెప్పించారు. అమితాబ్‌ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌.. కోడలు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ కూడా నటులే. తాజాగా అమితాబ్‌ మనవడు.. కుమార్తె శ్వేతా బచ్చన్‌ నందా కుమారుడు అగస్త్య నందా హీరోగా మారబోతున్నాడట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నష్టాలతో ముగిసిన మార్కెట్లు

పబ్లిక్‌, ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో తలెత్తిన అమ్మకాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను శుక్రవారం దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్‌ 143 పాయింట్లు క్షీణించి 36,594 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,768 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు డీలాపడటంతో తొలి నుంచీ మదుపర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్‌ 36,401 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఓ దశలో 36,749 వద్ద గరిష్ఠాన్ని తాకి తిరిగి వెనక్కి తగ్గింది . ఇదే బాటలో 10,764 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 10,819 వద్ద గరిష్ఠాన్ని తాకగా.. 10,713 వద్ద కనిష్ఠాన్ని చవిచూసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి