Movies

కరోనాతో ఆసుపత్రిలో జేరిన అమితాబ్

కరోనాతో ఆసుపత్రిలో జేరిన అమితాబ్

బాలీవుడ్‌ నటుడు, బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమితాబ్‌ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగతా వారి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. చికిత్స నిమిత్తం అమితాబ్‌ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. గత పదిరోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా నుంచి అమితాబ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్విటర్‌ చేశారు.
#############
దేశంలో కరోనా హద్దు అదుపు లేకుండా విజృంభిస్తోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదవడమే దీనికి నిదర్శనం. ఇటీవలి వరకు ఆరు రోజులకు లక్ష కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ వ్యవధి నాలుగు రోజులకు తగ్గడం గమనార్హం. గత సోమవారం రాత్రికి దేశంలో వైరస్‌ బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరగా.. శుక్రవారం రాత్రికి 8,14,898కి చేరింది. అంతకుముందు శుక్రవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 26,506 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. 475 మంది మృతి చెందినట్లు పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్యను 7,93,802గా తెలిపింది. కాగా, దేశంలో రోజువారీ కేసులు 25 వేలు దాటడం ఇదే తొలిసారి. కోలుకున్నవారి సంఖ్య 4.95 లక్షలకు చేరింది. 24 గంటల వ్యవధిలో 19,138 మంది కోలుకున్నారని, రికవరీ రేటు 62.09కు చేరిందని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా మరణాల రేటు 2.72కు తగ్గిందని.. గత నెలలో ఇది 2.82 శాతం ఉండేదని వివరించింది