DailyDose

విజయవంతంగా రష్యా టీకా-తాజావార్తలు

విజయవంతంగా రష్యా టీకా-తాజావార్తలు

* ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయినట్లు రష్యాలోని సెచెనోవ్‌ విశ్వవిద్యాలయం పేర్కొంది. వాలంటీర్లపై పరీక్షలు పూర్తయ్యాయని ఆ యూనివర్సిటీలోని ఇనిస్ట్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషనల్‌ మెడిసిన్‌ అండ్‌ బయో టెక్నాలజీ డైరెక్టర్‌ వాడిత్‌ తారాసోవ్‌ పేర్కొన్నారు.

* నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే కొవిడ్‌ సేవలందిస్తున్న ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాల కోసం రూ.265 కోట్లు విడుదల చేశామని చెప్పారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కిషన్‌రెడ్డి పరామర్శించారు.

* ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు కరోనా సోకిందని సమాచారం. ఆమెతోపాటు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్‌వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే ట్వీట్‌ చేశారు. ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు శనివారం కరోనా పాజిటివ్‌ రావడంతో కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. వాటిలో ఐశ్వర్య, ఆరాధ్య శాంపిల్స్‌కు పాజిటివ్‌ వచ్చిందని అంటున్నారు.

* అంగరంగవైభవంగా నిర్వహించాల్సిన హైదరాబాద్‌ బోనాలు కరోనా కారణంగా ఈ సారి వెలవెలబోతున్నాయి. భక్తులు లేకుండానే ఇవాళ ఉదయం మహంకాళికి తొలి బోనం సమర్పించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది భక్తులు లేకుండానే ఉజ్జయిని మహంకాళి బోనాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి అని, అయితే, సంప్రదాయ పూజలన్నీ సజావుగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు.

* కరోనాపై భారత్‌ చేస్తున్న పోరును యావత్తు ప్రపంచం ప్రశంసిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. కొవిడ్‌పై చేస్తున్న యుద్ధంలో భద్రతా బలగాల కృషి మరువలేనిదన్నారు. గురుగ్రామ్‌లోని సీఆర్‌పీఎఫ్‌ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఆదివారం జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏపీఎఫ్‌ నేతృత్వంలో నేడు దేశవ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలకు చేరువలోకి వచ్చింది. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 వరకు) రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1,914 మంది ఉండగా… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 18 మంది ఉన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారు ఒకరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 29,168కి చేరింది.

* మూడు నెలలుగా సగం వేతనాలు అందుకున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు జూన్‌లో పూర్తి జీతం అందుతుందని ఆశపడ్డారు. ఆ ఆశ ఎంతో సేపు నిలవలేదు. పేస్లిప్‌లు చూసుకొని వారు కంగుతిన్నారు. తమకు రూ.7మాత్రమే వచ్చాయి అని కొందరు చెప్పగా, చాలా మంది రూ.5వేలకు మించి జీతాలు రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం చేస్తామని ఎంప్లాయిస్‌ యూనియన్‌ హెచ్చరించింది.

* చైనాతో సరిహద్దు వివాదంపై కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. చైనాకు మోదీ తలొగ్గారంటూ విమర్శలు చేస్తూ వస్తున్న ఆయన మరోసారి అలాంటి విమర్శలే చేశారు. ‘‘భారత భూభాగాలను చైనా లాక్కుంటోందని, మోదీజీ హయాంలో అసలు ఏం జరుగుతోంది’’ అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు.

* రాజ‌స్థాన్‌లో రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి. రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌య‌త్నిస్తోందంటూ నిన్న ముఖ్య‌మంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గానే రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ కొంత‌మంది శాస‌న‌స‌భ స‌భ్యుల‌తో కలిసి దిల్లీ వెళ్ల‌డంతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయం వేడెక్కింది. ముఖ్య‌మంత్రి గ‌హ్లోత్ నన్ను ప‌క్క‌కు త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ స‌చిన్‌ పైల‌ట్‌ ఇప్ప‌టికే కేంద్ర నాయ‌క‌త్వానికి ఫిర్యాదు చేశారు.

రిలయన్స్‌ జియోలో దాదాపు 25.09శాతం వాటాలను విక్రయిస్తూ రిలయన్స్‌ చేసుకొన్న డీల్స్‌ వేగంగా అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే వీటిల్లో నాలుగు డీల్స్‌ నుంచి రూ.30,062 కోట్లు అందినట్లు ఆ సంస్థ నిన్న సెబీకి అందజేసిన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దాదాపు 6.13శాతం విలువైన వాటాలకు సంబంధించి ఎల్‌ కాటర్టన్‌, ది పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్, సిల్వర్‌ లేక్‌, జనరల్‌ అట్లాంటిక్‌ వంటి సంస్థలతో కుదుర్చుకొన్న ఒప్పందాలు పూర్తయినట్లు ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది.

* ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టడానికి తాను ఇంకా చిన్నవాడినేనని, ఇప్పుడే తనకు ఆ తొందర లేదని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ ఇటీవల వైదొలిగిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆ పదవి రేసులో గంగూలీ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆ స్థానంపై కన్నేసిన ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ఇప్పుడు ఆ రేసులో వెనుకబడ్డాడు.