DailyDose

అంచనాలను మించిన ఇన్ఫోసిస్-వాణిజ్యం

Business News Roundup Today - Infosys Beats Predictions

* ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రభావంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో సరైన వ్యూహంతో తగినన్ని కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయకపోతే మహమ్మారిని నియంత్రించలేమని టాటా గ్రూప్ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ప్రతిరోజు పెరుగుతున్న కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు. తాజాగా విడుదల చేసిన టాటా గ్రూప్‌ కంపెనీ న్యూస్‌లెటర్‌లో చంద్రశేఖరన్‌ తన అభిప్రాయాలు వెల్లడించారు.

* టిక్‌టాక్‌ సహా అనేక చైనీస్‌ యాప్‌లను నిషేధించాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుల్లో కొందరు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖరాశారు. కఠిన నిర్ణయాలు తీసుకొని భారత్‌ చూపిన బాటలో నడవాలని సూచించారు. అమెరికన్‌ పౌరుల సమాచారం బయటకు పోకుండా, వారి గోప్యత, భద్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

* భారత‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అంచనాలను మించి రాణించడంతో గురువారం ఆ కంపెనీ షేర్ల ధర దూసుకుపోతోంది. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభం కాగానే మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. క్రితం ముగింపు రూ.831.45తో పోలిస్తే ఆరంభమే రూ.900తో మొదలైంది. గంటలోపే ధర రూ.950కి చేరి అప్పర్‌ లిమిట్‌ అయిన రూ.955ను తాకేలా కనిపించింది. దాదాపు 15% షేరు ధర పెరగడంతో కంపెనీ మార్కెట్‌ విలువ అమాంతం రూ.50వేల కోట్లు పెరిగింది.

* ఇంధన పంపు మోటారులో ఉన్న లోపాలను సరిచేసేందుకు వీలుగా వాహన దిగ్గజం మారుతీ తన వాగన్‌ఆర్‌, బాలెనో కార్లను వెనక్కి పిలిపించాలని నిర్ణయించింది. దీంతోపాటు బాలెనో ఫ్లాట్‌ఫాం మీద వచ్చిన టొయోటా క్లిరోస్కర్‌ మోటార్‌ గ్లాంజా కార్లనూ కంపెనీ వెనక్కి పిలిపించనుంది. ఈ మేరకు రెండు సంస్థలూ ఒక బుధవారం ఒక ప్రకటన జారీ చేశాయి. దీని ప్రకారం.. నవంబరు 15, 2018 నుంచి అక్టోబరు 15, 2019 మధ్య కాలంలో మార్కెట్లోకి విడుదలైన 56,663 వ్యాగన్‌ఆర్‌ (1లీటర్‌) కార్లు, జవనరి 8, 2019 నుంచి నవంబరు 4, 2019 మధ్య కాలంలో ఉత్పత్తి చేసిన 78,222 బాలెనో (పెట్రోలు) కార్లలో ఈ లోపం ఉండేందుకు ఆస్కారం ఉందని మారుతి సుజుకి తెలిపింది. ఇదే తరహా లోపంతో ఏప్రిల్‌ 2, 2019 నుంచి అక్టోబరు 6, 2019 మధ్య కాలంలో వచ్చిన 6,500 గ్లాంజా కార్లనూ పరిశీలన నిమిత్తం టొయోటా వెనక్కి పిలుస్తోంది. ఈ వాహనాలను కొనుగోలు చేసిన యజమానులకు కంపెనీ అధీకృత డీలర్లు త్వరలోనే ఫోన్‌ చేసి, వివరాలు తెలియజేస్తారని రెండు సంస్థలూ తెలిపాయి. లోపంతో ఉన్న విడిభాగాన్ని ఉచితంగానే సరిచేస్తామని వెల్లడించాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీగా పెరిగాయి. సెన్సెక్స్‌ 419 పాయింట్లు పెరిగి 36,471 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 10,739 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌, ఇన్ఫోసిస్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌, ఇప్కా లేబరేటరీస్‌ షేర్లు లాభపడగా.. హాత్‌వే కేబుల్స్‌, వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఇన్ఫ్రాటెల్‌, ప్రస్టీజ్‌ ఎస్టేట్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.