Business

మీ విమాన టికెట్ల ధర పెరగవచ్చు

Flight Ticket Prices May Hike In India

విమాన ఇంధన ధరలను (ఏటీఎఫ్‌) 1.5 శాతం మేర ప్రభుత్వం పెంచింది. ఆరు వారాల్లో ఏటీఎఫ్‌ ధరలను పెంచడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. మరోవైపు పెట్రోలు, డీజిల్‌ ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రభుత్వ రంగ చమురు విక్రయ కంపెనీలు విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. దేశ రాజధానిలో విమానం ఇంధనం ధర కిలోలీటరుకు రూ.635.47 (1.5%) పెరిగి రూ.42,628.28కి చేరింది. ఇంతకుముందు జూన్‌ 1వ తేదీన 56.6% (కిలో లీటరుకు రూ.12,126.75), జూన్‌ 16న 16.3% (రూ.5,494.50), జులై 1న 7.48% (రూ.2,922.94) చొప్పున ఏటీఎఫ్‌ ధరలను ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయ ప్రామాణిక ధరల సరాసరి, అంతకుముందు పక్షం రోజుల్లో రూపాయి మారకపు విలువ ఆధారంగా ప్రతి నెల 1వ తేదీన, 15వ తేదీన ఏటీఎఫ్‌ ధరలను సవరిస్తుంటారు. పెట్రోలు, డీజిల్‌ ధరలను మాత్రం రోజువారీగా సవరిస్తుంటారు. అయితే దేశ రాజధాని దిల్లీలో 17 రోజులుగా అంటే జూన్‌ 29 నుంచి పెట్రోలు ధరల్లో ఎటువంటి మార్పు లేనప్పటికీ.. డీజిల్‌ ధరను మాత్రం నాలుగు సార్లు పెంచారు.