Food

నాటుకోడి కనిపించట్లేదు

Huge scarcity of country chicken and hens in India

వాన జల్లులు.. చలి వాతావరణం మధ్య నాటుకోడి కూర లేదా పులుసుతో వేడివేడిగా ఓ ముద్ద నోట్లో పడితే ఆ మజాయే వేరు! కానీ.. ఎంతో రుచిగల నాటుకోడి మాంసం నేడు నాలుకకు తగలడం లేదు. కొందామంటేనే బంగారమైపోయింది. నాటుకోళ్లకు అడ్డా అయిన పల్లెల్లోనే అవి హాంఫట్‌ అవుతున్నాయి. నగరాల దాకా రావట్లేదు!!
*****కరోనా నేపథ్యంలో పోషక విలువలున్న మాంసాహారాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో గ్రామీణప్రాంతాల్లో ‘నాటు చికెన్‌’నే ఎక్కువగా లాగించేస్తున్నారు. దీంతో పట్టణాలకు నాటుకోళ్ల పంపిణీపై తీవ్ర ప్రభావం పడటంతో అక్కడ నాటుకోళ్లకు కొరత ఏర్పడింది. కిలో కోడి ఽధర రూ.450కి చేరి బాగా పిరం అయింది. అంత ధర పెట్టినా కొన్నిచోట్ల దొరకడం లేదు. ఎలాంటి ఇంజక్షన్లు, యాంటీబయాటిక్స్‌ వాడకుండా సహజ వాతావరణంలో పెరిగే నాటుకోటి అంటే మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టపడతారు. రుచికి రుచి, బలం, ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకంతో నాటుకోడిని కొనేందుకు ఇష్టపడతారు. ఆషాఢ మాసంలో ప్రజలు వివిధ దేవతలకు బోనాలు, మొక్కులు చెల్లించుకునే క్రమంలో చాలా మంది నాటుకోళ్ల వైపే మొగ్గు చూపుతారు. బ్రాయిలర్‌ కోళ్లపై అపోహలు ఉండటం కూడా నాటుకోళ్లకు డిమాండ్‌ పెరిగేలా చేసింది.
***లాక్‌డౌన్‌ విధించడంతో హైదరాబాద్‌, నల్లగొండ వంటి నగరాల నుంచి జనం పల్లెలకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. మూడు నెలలుగా పంట పొలాలు చూసుకుంటూ, పిల్లలను ఆన్‌లైన్‌ క్లాసులు చదివిస్తూ కాలం గడిపేస్తున్నారు. కరోనాకు బలమైన ఆహారంగా భావిస్తూ వారంలో కనీసం రెండు రోజులు నాటుకోడి కూరతో పిల్లలకు వండిపెడుతున్నారు. కరోనాకు ముందు పల్లెల్లో కిలో నాటుకోడి రూ.200కి దొరికితే.. బేరగాళ్లు వాటిని పట్టణాలకు తీసుకెళ్లి రూ.250కి విక్రయించేవాళ్లు. ఇప్పుడు దాదాపు రెట్టింపయింది. నిజామాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రూ.260-280 వరకు ఉండే కిలో కోడి ధర రూ.400-450 వరకు ఉంది. ఖమ్మంలో రూ.380 నుంచి రూ.400 దాకా విక్రయిస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌ ముందు కిలో మటన్‌ ధర రూ.600 ఉండేది. లాక్‌డౌన్‌ పేరుతో రూ.750కి పెంచారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా మటన్‌ ధరలు తగ్గించలేదు. కరోనా నేపథ్యంలో కోడిగుడ్ల వినియోగం కూడా పెరిగింది. నల్లగొండ సుభా్‌షనగర్‌లో కిరాణాషాపులో వారానికి ఐదు ట్రేలు విక్రయించే వ్యాపారి సైదులు గౌడ్‌, ఇప్పుడు రోజుకు ఐదు ట్రేలు అమ్ముతున్నాడు. చిరు వ్యాపారినైన తనకే ఇంత గిరాకీ ఉంటే పెద్ద దుకాణాల్లో చాలా ఎక్కువ వ్యాపారం జరుగుతుంది అని ఆయన అభిప్రాయపడ్డాడు.
**వీడియో గ్రూప్‌కాల్‌లో మందుబాబుల సరదా
రోజూ దావత్‌ లేనిదే నిద్రపోని వారు సాయంత్రం కాగానే కలిసి బార్లు, క్లబ్బుల్లో, వైన్స్‌ సిట్టింగ్‌ ఏరియాల్లో జమయ్యేవారు. ఇప్పుడా అవకాశం లేకపోవడంతో కొంతకాలంగా రాత్రి తొమ్మిది అవగానే ఎవరి ఇంట్లో వారు లిక్కర్‌ బాటిల్స్‌ సిద్ధం చేసుకుని వాట్సప్‌ వీడియో గ్రూప్‌ కాన్ఫరెన్స్‌లోకి వచ్చేస్తున్నారు. రాత్రి 9-10.30 సమయంలో మందులో ముచ్చట కొనసాగుతోంది. ‘‘మొదట 9 మంది లైన్‌లో ఉండేవారు. గందరగోళంగా ఉండటంతో నలుగురికే లిమి ట్‌ పెట్టుకున్నాం, హాయిగా ఉంది’’ అని నల్లగొండకు చెందిన ఓ మద్యం ప్రియుడు చెప్పాడు.
**50% పెరిగిన డ్రై ఫ్రూట్స్‌ వినియోగం
బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ విక్రయాలు సైతం భారీగానే పెరిగాయి. ‘కరోనాకు ముందు నెలకు సుమారు వంద కిలోల డ్రై ఫ్రూట్స్‌ అమ్మే తాము ప్రస్తుతం 150 కిలోల వరకు విక్రయిస్తున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు. బాదం, పిస్తా, వాల్‌నట్‌ విక్రయాలు బాగా పెరిగినా ధరలు మాత్రం పెరగలేదని చెబుతున్నారు. బాదం కిలో రూ.1200 నుంచి వెయ్యికి తగ్గిందని తెలిపారు. ‘‘ఢిల్లీ, ముంబై నుంచి నేరుగా కొనుగోలు చేస్తాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ నేరుగా వెళ్లి కొనే పరిస్థితి లేదు. అమ్మే వాళ్లు సైతం నగదు చెల్లించే వారితోనే వ్యాపారం చేయడం మూలంగానే ధరలు తగ్గాయని అనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘శొంఠి, యాలకులు, లవంగాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. కరోనాకు ముందు నెలకు రెండు కిలోల శొంఠి విక్రయించే వాళ్లం. ప్రస్తుతం 10 కిలోల వరకు విక్రయిస్తున్నాం’’ అని తెలిపారు.