DailyDose

40వేలు దాటిన ఏపీ కరోనా కేసులు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - Andhra Corona Cases Cross 40000

* ఏపీలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో రోజుకు రెండు వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 2602 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో ఇతర రాష్ట్రాల్లోని వారు 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 40,646కి చేరింది.

* దేశంలో 135 కోట్ల జనాభాలో పదిలక్షల మందికి 727.4 కొవిడ్‌-19 కేసులు మాత్రమే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు ఎన్ని కేసులో తీసుకుంటే భారత్‌లో 4-8 రెట్లు తక్కువేనని పేర్కొంది. శుక్రవారం నాటికి ఉన్న యాక్టివ్‌ కరోనా బాధితుల సంఖ్య 3,42,756 మాత్రమేనని వెల్లడించింది. 6.35 లక్షల కన్నా ఎక్కువ మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

* భారతావనిపై కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా తొలి రోజుల్లో లక్ష కేసులు నమోదైతేనే వామ్మో అన్నాం. ఇప్పుడు వైరస్‌ విలయతాండవం చేస్తూ ఆ సంఖ్య పది లక్షలను దాటింది. గడిచిన కొన్ని రోజుల్లో నిత్యం 30 వేలకుపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది.

* తమిళనాడులో ఇవాళ కొత్తగా 4,538 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,60,907కు పెరిగింది. ఇవాళ గుర్తించిన కేసుల్లో చెన్నైలో అత్యధికంగా 1243 మందికి కరోనా సోకింది. ఈ మహమ్మారితో తాజాగా 79 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,315కి చేరింది. ప్రస్తుతం 47,782 మంది వివిధ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతుండగా..ఇప్పటివరకు 1,10,807 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

* కొవిడ్‌ చికిత్స కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న వేళ అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తీపి కబురు చెప్పారు. సెప్టెంబరు మొదటి వారంలోగా కరోనా వైరస్‌ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీ’లతో చేస్తున్న క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రయోగ ఫలితాలు సెప్టెంబరు నాటికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్‌తో గురువారం జరిపిన సంభాషణలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.