Kids

జగ్గూగా మారిన జగన్నాథరావు కథ

How names are used in India-Telugu kids news

జగన్నాధరావులో ఈ మధ్య మార్పు వచ్చిందనే చెప్పాలి. హైస్కూల్లో చేరిన నెల రోజులకే ఆలోచనలు మారిపోయాయి. ‘రావులు, రావులయ్యలు పేర్లేమిటి… డామిట్ …. పాతకాలపు పేర్లు’ అంటూ చాలా అసహనంగా ఉన్నాడు.

దానికితోడు క్లాసులో టీచర్లు, ఫ్రెండ్సు ‘జగన్నాధరావు ‘ అని పిలుస్తూంటే నచ్చటంలేదు. ఇక లాభం లేదనుకుని ‘ఇకనుంచి జగ్గు అని పిలవండి’ అంటూ ఓ అల్టిమేటమ్ ఇచ్చిసాడు.

“అదేమిట్రా, జగ్గులు.. గ్లాసులు పేర్లేమిట్రా” అని ఎవరేమైన అడిగితే “అదే బాగుంటుంది. మీకు తెలియదు.” అంటూ ఠకిలమని జవాబు ఇచ్చెస్తూన్నాడు.

మొన్నటివరకు స్కూలుకి వెళ్ళె ముందు, అమ్మ తలకి కొబ్బరినూనె రాసి పాపిడి తీసి నున్నగా దువ్వెది. అది ఇప్పుడు నచ్చటంలేదు. ఆ జుట్టుని పైకి, కిందికి దువ్వి మొత్తానికి ఓ రెండు మూడు కొండలు తీస్తున్నాడు . జుట్టు లొంగక పోతే, దానికి నీళ్ళు రాసి, అద్దం ముందు నిలబడి గంటలు గంటలు కుస్తీ పడుతున్నాడు. “ఆడపిల్లల్లా అద్దం ముందు అలా గంటలు గంటలుగా నిలబడ్డాలేమిటో ” అని అమ్మ దెబ్బలాడితే
“నీకేం తెలియదు. నువ్వూ దువ్వుతుంటే స్కూల్లో బాబ మెట్ట అని పిలుస్తూన్నారు” అంటూ చిరాకు పడిపోతున్నాడు.

ఉతికిన బట్టల్ని అలాగే వేసుకు వెళ్ళే జగ్గు, ఇప్పుడు చెంబులో నిప్పులు వేసి దానితో ఇస్త్రీ చేసిన బట్టల్ని వేసుకుని స్కూలుకి వెళ్తున్నాడు. పక్క పక్క వీధుల్నుంచి వచ్చి, అయ్యకోనేరు గట్టు జంక్షన్ లో జగ్గు గురించి నిలబడి, వాడొచ్చిన తర్వాత అందరు కలసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఎదో ఆనందం జగ్గుకి వచ్చిసిందనే చెప్పాలి.

“వీడి వాలకం చూస్తుంటే చదువుకోడానికి వెళ్తున్నట్టు కనబడడం లేదు. వీడికి తోడుగా, ఓ అరడజను మంది వానర సైన్యం కూడా ఉందని, అదిగో.. ఆ భ్రమరాంబగారమ్మాయి చెప్పింది. కొంపమీదకి ఏం తెస్తాడో.. ఏమిటో, భయంగా ఉంది!” అంటూ వాళ్లమ్మ సావిత్రమ్మ ఇంట్లో ఒకటి రెండుసార్లు భర్త.

అప్పలనరసయ్య చెవిలో వేసింది. అయితే స్వతహాగా అప్పలనరసయ్య స్కూలు మాష్టారు కాబట్టీ పిల్లల మనస్తత్వం బాగా తెలుసు. ఇన్నాళ్ళు అయ్యకోనేరు గట్టుకే పరిమితమైన పిల్లలకి కొంచెం బయట ప్రపంచం కనబడేసరికి వారి ప్రవర్తన ఎలా ఉంటుందన్న విషయం ఆయనకి అవగాహన ఉంది. అందుకే భార్య మాటల్ని వెంటనే పట్టించుకున్నట్టు కనబడలేదు.

“ఇదిగో మీకే.. వాడు ఇప్పుడు ఆకు చాటు బిడ్డలా కనబడుతున్నాడెమో… కాని మన జాగ్రత్తతో మనం ఉండాలి. తోటకూర నాడు చెప్పలేదురా కొడకా.. అని తర్వాత అనుకుని లాభం లేదు. పది, పదిహెను సంవత్సరాల వయసున్న వాళ్ళ మెదడు చాలా సున్నితంగా ఉంటుంది. ఆ వయసులో ఎవరు ఏం చెప్పిన సరే టకీలమని ఆ మెదడు ఆకర్షిస్తుందామ్మా. మంచి చెడులను అస్సలు అలోచించదు. ఆ వయాసులో వాళ్ళని చాల జాగ్రత్తగా పెంచాలమ్మా” అంటూ మామగారు చెపుతూ ఉండేవారు. ఆ మాటే ఙ్ఞాపకం వచ్చి, భర్త దగ్గర పోరు పెట్టేది.

“పెరటి చెట్టు మందుకి పనికిరాదనే మీ వాదన నాకూ తెలుసు. కాదనను, కాని రోగానికి ఎదో ఒక మందు వెయ్యాలి కదా. ఇదుగో ఇప్పుడే చెప్తున్నాను. తర్వాత నన్ను ఆడిపోసుకోకండి!” అంటూ సావిత్రమ్మ తలమీద కుండలో నీళ్ళని కొంచెం వంపుకుని కూడా భర్తకి ఓ హెచ్చరిక జారిచేసింది.

అటు జగన్నధరావు అలోచనలు వేరుగా ఉన్నాయి. ఓ వారం రోజుల్లో రధయాత్ర వస్తున్నది. ఈసారి ఎలా అయినా సరే, కృష్ణ వాళ్ళతో కలసి మంచకొండ ఎక్కాలి. పీచుమీటయి, గొడుగు ఐస్ క్రీమ్, ఆడుకోడానికి రాకెట్టు కొనుక్కోవాలి. అమధ్య కృష్ణ స్కూలు దగ్గర ఐస్ క్రీములు గట్రా ఇప్పించాడు. రధయాత్రలో వాడి బాకి తీర్చాలి. వీటన్నిటికి డబ్బులు ఉండాలి. ఎలా అన్న అలోచనతో జగన్నాధం సతమతమవుతూ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆరోజు రాత్రి ఇంట్లో భోజనంచేస్తూ అమ్మ దగ్గర ఆ విషయమే కదిపాడు.

“అమ్మా ఈసారి రధయాత్రకి నేను మీతో రాను. నేను మా ఫ్రెండ్స్ తో కలసి వెళ్తాను. మచ్చకొండ ఎక్కుతాం!” తర్వాత ఏం మాట్లడాలో వాడికి తెలియలేదు. ధైర్యం కూడా సరిపోలేదు. ‘ఇది ఒప్పుకుంటే మెల్లగా డబ్బులు అడగోచ్చులే’ అని సరిపెట్ఠుకున్నాడు. అమ్మ ఒప్పుకుంటుందని అనుకున్నాడు. కాని వాడు ఊహించినట్టు జరగలేదు

“అప్పుడే పెద్దవాడివి అయిపొయనని అనుకూంటున్నవేమిట్రా. వెదవ్వెషాలు కట్టిపెట్టి, మాతొనే రా!. ఆ జనంలో తప్పిపోతావు!” అంటూ సావిత్రమ్మ చీవాట్లు పెట్టింది. దాంతో జగన్నాధరావు అసలు అమ్మని ఎలా ఒప్పించాలా అనే అలోచనలో పడిపోయాడు . రెండ్రోజులు ధైర్యం కూడకట్టుకుని మళ్ళీ ఓ ప్రయత్నం చెసాడు.

“కాదమ్మ ఈసారి మా క్లాసు వాళ్ళందరం కలసి వేళ్తున్నాం. అందరం ఒకరి చేతులు ఒకరు పట్టుకున వెళ్తాం. ఎం పర్లేదమ్మా, నాకు దారి తెలుసు. మొన్న కరెంటుపోతే కరెంటు ఆఫీసు వెళ్ళానుగా.. అక్కడకి దగ్గరేగా! ప్లీజ్ అమ్మా!” అంటూ ఈ మధ్యే తెలిసిన ఇంగ్లీసు పదాన్ని కూడా ఉపయోగించి వాడు అమ్మ వెంట పడ్డాడు.

“ఏమో బాబు. తర్వాత ఎదైనా జరిగితే మీ నాన్నతో చీవాట్లు తినాలి. నావల్ల కాదు. పోయి మీ నాన్ననే అడుగు!” అన్న అమ్మా మాటలు వినేసరికి, జగన్నాథరావు గుండెలో రాయి పడింది. తండ్రి అంటే చాల భయం. ఏది కావాలన్న అమ్మని అడగటమే గాని నాన్నని నేరుగా అడగలేదు. అయితే అమ్మ ఒక్కసారి చెప్పిందంటే ఇక అందులో మార్పు ఉండదు. తప్పదు.. తనే నాన్నని ఎలాగోలా అడగాలి.

ఆ రోజు ఉదయం నుంచే జగ్గు, చాల బుద్ధిగా ఉన్నాడు. సాయంత్రం ఆటలకి కూడా వెళ్ళలేదు. ఇంట్లో కాలుకాలిన పిల్లిలా తిరిగాడు. రాత్రి భోజనాలయాక ధైర్యం కూడతీసుకుని మొత్తంమీద తండ్రి ఎదురు నిలబడి భయం భయంగా అడిగాడు . అమ్మని ఎలా అడిగాడో, ఆ మాటలే ఇక్కడ ఒక్కసారిగా కక్కిసాడు. నాన్న ఎం దెబ్బలాడుతారో అని ఓమూల భయం పట్టుకుంది.

ఒప్పుకోకపోతే తన ఫ్రెండ్స్ ముందు అవమానంగా ఉంటుంది. వాడికి జీవితంలో ఇదో పెద్ద పరీక్షా సమయం.

“సరే నీ ఇష్టం. జాగ్రత్తగా వేళ్ళండి. తుంటరి పనులు చేయకండి!” అన్న తండ్రి మాటలు వినేసరికి జగన్నాధరావు ఒక్కసారిగా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .

రాత్రి మంచం మీద పడుకుని రధయాత్రని ఎలా గడపాలా అని చాలాసేపు అలోచించాడు.
ఇప్పుడు సమస్యాంతా డబ్బులు. డబ్బులు గురించి అమ్మ నాన్నా మాట్లాడటం లేదు. దానికి తోడు నాన్న ఒప్పుకోడంతో అమ్మ డబ్బులు ఇవ్వదు. నాన్నని అడిగేంతా ధైర్యం తనకు లేదు. తేల్లారితే రధయాత్ర.. ఏంచేయాలో తోచడంలేదు. చివరికి ఓ ఆలోచనతో నిర్ణయానికి వచ్చిసాడు.

తెల్లారింది. ఫ్రెండ్సందరని కూడతీసుకున్నాడు. కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం ఎలా కలవాలో, ఎలా గడపాలో అన్నీ మాట్లాడుకున్నారు. అనుకున్నాట్టే రధయాత్ర చాలా ఆనందంగా గడిచిపోయింది. జగన్నాధరావు ఇంటికి చేరుకునేసరికి అమ్మ వంటింట్లో ఎదో వెతుక్కుంటూ “పోపుల డబ్బాలో ఉన్న డబ్బులు కనబడటం లేదు, ఖర్చేం చేసానా?” అని తనలో తను మాట్లాడుకుంటూ కనబడింది. ఏం తెలియనట్టు గబగబా తన పనులు ముగించుకుని పడుకుండిపోయాడు.

అప్పలనరసయ్యగారు ఉదయాన్నే ఇంటి దగ్గర ప్రవేట్లు చెపుతుంటారు. ఆయన పిల్లలకు అరుగుమీద చెప్పే పాఠాలు ఆ నాలుగిళ్ళకి వినబడుతాయి. ఆ రోజు పిల్లలందరు రాగానే “ఎవఁర్రా రధాయాత్ర బాగా చేసుకున్నారా?” అంటూ కాస్సేపు కబుర్లు చెప్పి

“ఇవాళా పాఠం చెప్పే ముందు, ఓ కథ చెపుతాను. జాగ్రత్తగా వినండి.

అనగనగా ఓ ఊర్లో, ఓ దంపతులు ఉండేవారు. వాళ్ళకి నలుగురు పిల్లలు. అందరిలో చిన్నవాడంటే ఆ తల్లికి చాలా ముద్దు. వాడుకూడా తల్లి దగ్గర చాలా చనువుగా ఉండేవాడు. వాడు రోజు ఉదయాన్నే అలా వీధిలోకి వెళ్లి, వస్తున్నప్పుడు తోటకూర తీసుకొచ్చి తల్లికిచ్చాడు. తల్లి ఆనంద పడిపోయి ‘ఎం నాన్న ఎక్కడ్నుంచి తెచ్చావు’ అంటూ అడిగింది!’ ఏమి లేదమ్మా! అలా వస్తుంటే, పొలంలో ఎవరు చూడకుండా కోసుకొచ్చిసాను!’ అంటూ వాడనేసరికి, ఆ తల్లి చాలా సంబరపడిపోయింది. ‘మానాయనే అప్పుడే సంపాదించటం నేర్చుకున్నావు!’ అంటూ వాడ్ని అక్కున చేర్చుకుంది. ఇంకేం.. వాడికి వాడు చేసినపని తప్పు అనిపించలేదు. రోజు రోజుకి ఆ వృత్తిలో ఎదిగి పోయాడు. చివరికి వాడోరొజు దొంగతనం చేస్తూనే దొరికి పోయాడు. వాడినో గజదొంగగా గుర్తించి వాడిన్ని జైల్లో పెట్టిసారు. లబొదిబో అంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ‘తప్పంతా నాదే.. తోటకూరనాడే నీకు చెప్పిఉంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదు!’ అంటూ చాలా బాధ పడింది.

కాని, అప్పుడేం ప్రయోజనం ఉంటుందో చెప్పండి! అంచేత ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే, వెంటనే చెప్పాలి. అంతేకాని ఊరుకుంటే, అదిగో.. ఆ తర్వాత అలా జరుగుంది. అదర్రా కథ.

ఇక మనం పాఠాల్లోకి వెళ్దాం!” అంటూ పాఠం చెప్పడం మొదలేట్టారు.

పక్క గదిలో ఉన్న జగన్నాధరావుకి, కథ వినేసరికి చెమటలు పట్టిసాయి. ఒక్కసారిగా అమ్మా దగ్గరికి పరిగెత్తాడు. వాడి వాలకం చూసేసరికి సావిత్రమ్మ గారికి అర్ధం అయిపోయింది.

“అమ్మా పొరపాటు చేసానమ్మా. మరేప్పుడు చేయ్యనమ్మా. కొట్టకమ్మా!” అంటూ వాడు వేడుకుంటూ ఉంటే ఏ అమ్మా మాత్రం ఏంచేస్తూంది. సావిత్రమ్మా అదే చేసింది. అరుగుమీద పాఠాలు చెపుతున్న అప్పలనరసయ్యగారు ఓ చెవి, కన్ను ఇంట్లోకి వేసే ఉంచారు.

ఎప్పుడు లేనిది, మాష్టారు ఆ రోజు ఆ కథ ఎందుకు చెప్పారో పిల్లలకి అర్దంకాలేదు.

కాని అయ్యకోనేరు గట్టుకి మాత్రం బాగా అర్ధమై తృప్తిగా నవ్వుకుంది.