Business

కొండపల్లి బొమ్మను కాపాడేలా…

కొండపల్లి బొమ్మను కాపాడేలా…

ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మల కళకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. అతి పురాతనమైన కొండపల్లి బొమ్మల కళను సజీవంగా ఉంచాలనే లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోసింది. గత ఏడాది స్ఫూర్తి పథకం ద్వారా కొండపల్లి బొమ్మల నైపుణ్యానికి పదును పెట్టేందుకు నిధులు కేటాయింపునకు శ్రీకారం చుట్టింది.
*అంతేకాక కళాకారులకు మరింత నైపుణ్యం అద్దేందుకు సూక్ష్మ, చిన్న, తరహా మధ్యతరహా పరిశ్రమల జాతీయ సంస్థ (ఎస్‌ఐఎంఎస్‌ఎంఈ)ను కేంద్రం జోడించింది. వాస్తవంగా అయితే బొమ్మల కళాకారులను భాగస్వాములు చేయాల్సి ఉంది. కానీ వారి ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడం వలన ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) భాగస్వామ్యం పంచుకున్నారు. అందుకు అనుగుణంగా ఆయన తన ఎంపీ నిధుల నుంచి రూ.42.50 లక్షలను కేటాయించారు.
**స్ఫూర్తి పథకానికి నిధులు
ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.93 లక్షల నిధులను కేటాయించింది. కొండపల్లిలో ప్రధానంగా సొసైటీ ఏర్పడిన తరువాత భవనం నిర్మాణం జరిగింది. కానీ నేడు అది శిథిలావస్థకు చేరుకుంది. ఈ పథకంలో భాగంగా ముందు భవనాన్ని పునఃనిర్మాణం చేసి మార్కెటింగ్‌ చేసుకునేందుకు 25 దుకాణాలు, శిక్షణ వంటి వాటి కోసం భవనాల నిర్మాణం పూర్తి చేయనున్నారు.
**రూ.53.04 లక్షల నిధులు విడుదల
ఈ పథకానికి కేంద్రం నుంచి తొలి అడుగు పడిం ది. తొలివిడతగా సొసైటీ బ్యాంకు ఖాతాలకు కేంద్ర ఎస్‌ఐఎంఎస్‌ఎంఈ ద్వారా రూ. 31.79 లక్షలు, ఎంపీ కేశినాని శ్రీనివాస్‌ (నాని) నిధుల నుంచి రూ.21.25 లక్షలు జమ చేశారు. పనులు జరుగుతుండగా దశల వారీగా నిధులు విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. తద్వారా కొండపల్లి బొమ్మల తయారీ, వాటి మార్కెటింగ్‌ సులభతరంగా ఉంటుందనే అభిప్రాయాలు కళాకారులు వ్యక్తం చేస్తున్నారు.