Business

ఐటీ ఉద్యోగులకు శుభవార్త-వాణిజ్యం

ఐటీ ఉద్యోగులకు శుభవార్త-వాణిజ్యం

* కరోనా సంక్షోభ సమయంలో ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు భారత ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్ర‌క‌టించింది. దేశంలోకరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి పనిచేసుకునే విధానాన్ని 2020 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేష‌న్స్ ‌ (డాట్‌) ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఈ నిర్ణయంపై నాస్కాంతోపాటు పలువురు ఐటీ కంపెనీ అధినేతలు హర్షం ప్రకటించారు.

* కొత్త టెక్నాలజీ ఏఆర్‌ (అగ్మెంటెడ్‌ రియాల్టీ) ద్వారా జులై 21 వన్‌ప్లస్ నార్డ్‌ విడుదలైంది. ఈ ఫోన్‌ మొత్తం మూడు వేరియంట్లలో వస్తోంది. 8జీబీ/128జీబీ వేరియంట్‌ ధరను కంపెనీ రూ.27,990గా నిర్ణయించింది. 12జీబీ/ 256 జీబీ వేరియంట్‌ ధరను రూ.29,999గా పేర్కొంది. దీంతో పాటు 6జీబీ/ 64 జీబీ వేరియంట్‌ను కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించినా ఇది సెప్టెంబర్‌లో రానుంది. దీని ధరను రూ.24,999గా కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి తొలి రెండు వేరియంట్లు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 4న అమెజాన్‌, వన్‌ప్లస్‌.కామ్‌లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 నిమిషాలకు సెన్సెక్స్‌ 65 పాయింట్లు కోల్పోయి 37,865 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 11,142 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.75గా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా వరుస లాభాలతో దూసుకెళుతున్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండడంతో మార్కెట్లకు నష్టాలు ఎదురయ్యాయి. నిఫ్టీలో ఎంఅండ్‌ ఎం ఫైనాన్షియల్‌, అరబిందో ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, బయోకాన్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లు రాణిస్తుండగా.. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, హెచ్‌యూఎల్‌, ఇండియా బుల్స్‌ హెచ్‌ఎస్‌జీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అశోక్ లేల్యాండ్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

* ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలపై కొవిడ్‌-19 ప్రభావం కొనసాగుతూనే ఉంది. మే నెలతో పోలిస్తే జూన్‌లో వీటి అమ్మకాలు 38.34 శాతం మేర క్షీణించి 1,26,417 వాహనాలకు పరిమితమయ్యాయని వాహన డీలర్ల సంఘం ఫాడా (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌) వెల్లడించింది. కొనుగోలుదార్ల సెంటిమెంటు ఇంకా మెరుగవ్వలేదనే సంకేతాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని పేర్కొంది. 2019 జూన్‌లో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 2,05,011 వాహనాలుగా నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్‌ నెలకు సంబంధించి 1,230 ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్‌టీఓ) నుంచి ఫాడా గణాంకాలను సేకరించింది. ఈ గణాంకాల ప్రకారం.. ద్విచక్రవాహనాల అమ్మకాలు 40.92 శాతం క్షీణించి 7,90,118 వాహనాలకు పరిమితమయ్యాయి. కిందటేడాది జూన్‌లో మొత్తంగా 13,37,462 ద్విచక్రవాహనాలను కంపెనీలు విక్రయించాయి. వాణిజ్య వాహన అమ్మకాలు కూడా 83.83 శాతం క్షీణతతో 64,976 వాహనాల నుంచి 10,509 వాహనాలకు పడిపోయాయి. ఇక 11,944 త్రిచక్రవాహనాలను కంపెనీలు విక్రయించాయి. 2019 జూన్‌లో అమ్మిన 48,804 త్రిచక్రవాహనాలతో పోలిస్తే అమ్మకాలు 75.43 శాతం క్షీణించాయి. 2020 జూన్‌లో మొత్తం అమ్మకాలు 9,84,395 వాహనాలు కాగా.. 2019 జూన్‌లో విక్రయించిన 16,97,166 వాహనాలతో పోలిస్తే 41 శాతం తగ్గాయి. ‘ఆర్థిక వ్యవస్థ మందగమనానికి తోడు కొవిడ్‌-19 కేసుల సంఖ్య పెరగడం.. వినియోగదారు విశ్వాసంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఈ ధోరణి అధికంగా కనిపిస్తోంద’ని ఫాడా ప్రెసిడెంట్‌ ఆశిష్‌ హర్షరాజ్‌ కాలే అన్నారు.

* ప్రమోటర్లు, డైరెక్టర్ల నుంచి వ్యక్తిగత హామీలను తీసుకోకుండా రుణాలిచ్చి.. భారీ రుణ ఎగవేతలకు కారణమైన ప్రభుత్వ రంగ బ్యాంకులపై చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన రిట్‌ పిటిషన్‌పై ఆర్థిక శాఖ స్పందించాలని సుప్రీం కోర్టు కోరింది. భారీ స్థాయి కార్పొరేట్‌ రుణ ఎగవేతదార్ల నుంచి వ్యక్తిగత హామీలేవీ తీసుకోనందున రోజూ కోట్ల రూపాయలను కోల్పోయామని సుప్రీం వద్దకు వచ్చిన పిటిషన్‌ పేర్కొంది. ఈ అంశాలతో కూడిన నోట్‌ను సమర్పించిన సీనియర్‌ అడ్వకేటు మనన్‌ కుమార్‌ మిశ్రాను రెండు వారాల్లోగా ఆర్థిక శాఖ వద్దకు వెళ్లాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆ తర్వాత నాలుగు వారాల్లోగా ప్రభుత్వం ఈ అంశంపై స్పందించాల్సి ఉంటుందని తెలిపింది. ‘ప్రమోటర్లు/మేనేజిరియల్‌ వ్యక్తుల నుంచి వ్యక్తిగతహామీలను తీసుకోవాలని ఆర్థిక శాఖే స్వయానా ఒక సర్క్యులర్‌లో బ్యాంకులను ఆదేశించింది. అయితే పిటిషినర్‌ అందించిన సమాచారం ప్రకారం.. సర్క్యులర్‌ను పక్కనపెట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎటువంటి హామీల్లేకుండానే రుణాలిచ్చి ఖజానాకు, తద్వారా ప్రజలకు భారీ నష్టాన్ని కలిగించాయ’ని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ‘సర్క్యులర్‌ ప్రకారం కాకుండా ఎటువంటి హామీల్లేకుండా రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల’ంటూ ఈ రిట్‌ పిటిషన్‌ను సౌరభ్‌ జైన్‌ అనే వ్యక్తి దాఖలు చేయడంతో కోర్టు పైవిధంగా స్పందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.85 లక్షల కోట్ల నష్టం వచ్చిందని గణాంకాలను వాదనల సందర్భంగా న్యాయవాది మిశ్రా సమర్పించారు.