Kids

గొడుగు కథలు

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా? చాన్నాళ్లకు నన్ను తెరిచారే! వర్షాకాలం వచ్చేసిందనా! సరేగానీ.. దుమ్మూ ధూళీ ఉంటుంది.. కాస్త కడిగి ఆరబెట్టండి.. నన్నింతలా వాడేస్తున్నారే! నా చరిత్రేంటని ఒక్కసారైనా అడిగారా? అబ్బో.. చెప్పాలంటే చాలా ఉంది…
ఇంగ్లిష్‌లో అంబరెల్లా అంటారు కదా! అది లాటిన్‌ పదం ‘అంబ్ర’ నుంచి వచ్చింది. అంటే… నీడనిస్తామని. 4000 ఏళ్ల కిందటే గొడుగులు ఉన్నాయంటోంది చరిత్ర ఈజిప్ట్‌, అస్సెరియా, గ్రీస్‌, చైనా దేశాల పురాతన కళా ఖండాల్లో, చిత్రాల్లో కూడా కనిపిస్తాం.
**ఎవరైనా వాడేలా
మొదట్లో మహిళలకే అనువైన వాళ్లం అనేవారు. ఓ పర్షియన్‌ యాత్రికుడు, రచయిత జోనాస్‌ హాన్వే (1712-84) 30 ఏళ్లు ఇంగ్లండ్‌లో వేసుకు తిరిగాడు. దెబ్బకి పురుషులూ గొడుగుల్ని వాడొచ్చని మొదలుపెట్టారు.
*గొడుగుల దుకాణం
మొట్ట మొదటి మమ్మల్నమ్మే దుకాణం ‘జేమ్మ్‌ స్మిత్‌ అండ్‌ సన్స్‌’ ఇది 1830లో ప్రారంభమైంది. ఇంగ్లాండ్‌లో 53, న్యూ ఆక్స్‌ఫర్డ్‌ వీధిలో ఇప్పటికీ ఉంది.
**బోలెడు చరిత్రుంది
అవునండీ..! మహాభారత కథలోనూ మేమున్నాం! విలువిద్యలో ఆరితేరిన జమదగ్ని బాణాలు వేస్తుంటే ఆయన భార్య రేణుక చప్పున వెనక్కి తెచ్చేదట. ఒకసారి కాస్త ఆలస్యమైతే ఎండవల్లేనని జమదగ్ని సూర్యుని మీద బాణాన్ని ఎక్కుపెట్టాడు. మహర్షులకు కోపమొస్తే సూర్యుడేం చేయగలడు? దెబ్బకి దిగొచ్చి ఆమెకు గొడుగిచ్చి వెళ్లాడు.
*గొడుగుల గొప్పలకేం కొదవ
ఈజిప్టు మత గురువులు శక్తికి మేమే గుర్తంటారు. టిప్పుసుల్తాను ఛత్రమైతే బ్రిటన్‌ వేలంలో 3 లక్షల ధర పలికింది. బౌద్ధ సన్యాసుల చేతిలో మేం లేని రోజుంటుందా! 1928లో వియత్నాంలో మొదలైంది7 ప్రపంచ అంబరెల్లా దినోత్సవం. అది ఏటా ఫిబ్రవరి 10న జరుపుతారు. పెళ్లి కొడుకు వేదిక మీదకి రావాలంటే గొడుగు పట్టాల్సిందే కదా!
**దూరం పెట్టాలన్నా మేమే
కరోనా రాకూడదంటే.. మాస్క్‌, శానిటైజర్‌లతో పాటు సామాజిక దూరం పాటించాలని చెబుతున్నారు కదా. అందుకే కేరళలోని అలప్పుజ జిల్లాలో ఉన్న తన్నేరుక్కోమ్‌ అనే ఊళ్లో ఇందుకోసం గొడుగులు వాడుతున్నారు. మనం గొడుగు కింద ఉన్నామనుకోండి అది తగులుతుందని దగ్గరకు రాలేరు కదా! అలా దూరంగా ఉంటారని ఈ అయిడియా వేశారన్న మాట!!
**ఎన్నెన్నో అందాల గొడుగులు
ఎన్ని రకాలనీ! రోజు రోజుకూ కొత్తగా వస్తున్నాం. మొదట తాటాకు గొడుగే ఎండా వానలకు. నాగరికత పెరిగాక, మేమూ కొత్త రంగుల్లో, రూపాల్లో కొత్తగా ముస్తాబవుతున్నాం. ఫ్యాషన్‌ కోసం మమ్మల్ని పట్టుకుని నడిచే తారలెందరో!
సరేగానీ.. ఈ వర్షాకాలానికి ఎలాంటి కొత్త గొడుగు కొనుక్కోబోతున్నారూ.
**ఛత్రమంటే.. గొడుగే
దేవుడి ఊరేగింపు, ఉత్సవం, బ్రహ్మోత్సవాలప్పుడు ఛత్రం పడుతుంటారే! ఆ ఆచారం దేవుడికి ఇచ్చే మర్యాద. చవితప్పుడు వినాయక విగ్రహానికి వెనకుండేది మేమేగా! వైశాఖ మాసం (ఎండాకాలం) లోనైతే.. గొడుగును దానమిస్తే పుణ్యమని భావించే వాళ్లు ఎంత మంచోళ్లో కదా!