NRI-NRT

ఇక అమెరికాకు విద్యార్థులను రానివ్వరు

ఇక అమెరికాకు విద్యార్థులను రానివ్వరు

వీసా విధానంలో కొత్త కొత్త మార్పులను తెస్తున్న అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. పూర్తిగా ఆన్‌లైన్‌ మాధ్యమంలో మాత్రమే బోధనను ఎంచుకుంటున్న కొత్త విద్యార్థులను ఇకపై దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ఉత్తర్వులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తం ఎనిమిది వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దాదాపు 200 పైగా విద్యా సంస్థలు వీటిపై సంతకాలు చేశాయి. హార్వర్డ్‌, ఎంఐటీ వంటి దిగ్గజ విశ్వవిద్యాలయాలు సైతం ఈ విషయంపై కోర్టుకు వెళ్లాయి. వీరికి సాంకేతిక దిగ్గజ సంస్థలైన గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలూ మద్దతుగా నిలిచాయి. మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులపై ఉన్న పరిమితుల్ని ఎత్తివేస్తూ మార్చి 13న ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) తీసుకున్న నిర్ణయానికి ట్రంప్‌ తాజా ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులతోపాటు, ఎం-1 వీసాపై వృత్తివిద్యా కోర్సులు అభ్యసిస్తున్నవారు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఎట్టకేలకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా కొత్త విద్యార్థులను అనుమతించేది లేదని తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థల్ని ఎలాగైనా తెరిపించాలన్న దురుద్దేశంతోనే ట్రంప్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.