Sports

భయం లేని యువకులే భారత జట్టు బలం

Mohammad Kaif On Fearless Indian Cricket Players

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ మళ్లీ తను ఆడే రోజులను గుర్తుచేశాడు. మైదానంలో చురుగ్గా కదులుతూ దూరంగా వెళ్లే ఎన్నో బంతులను ఒంటి చేత్తో అందుకునే అతడు శనివారం ఓ అద్భుత వీడియోను పంచుకున్నాడు. 2004లో పాకిస్థాన్‌ పర్యటన సందర్భంగా కరాచీలో ఆడిన తొలి వన్డేలో అతడు అందుకున్న షోయబ్‌ మాలిక్‌ క్యాచ్‌ను ట్విటర్‌లో పోస్టు చేశాడు. జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌లో షోయబ్‌ మాలిక్‌ ఆడిన ఓ బంతి గాల్లోకి లేవగా లాంగ్‌ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కైఫ్‌ అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చీ రెండు చేతులతో క్యాచ్‌ అందుకుంటాడు. అదే క్యాచ్‌ను అందుకోడానికి వచ్చిన హేమంగ్‌ బదానికి అతడి కాలు తగులుతుంది. భారత అభిమానులెవ్వరూ ఆ అద్భుత క్యాచ్‌ను ఎప్పటికీ మర్చిపోరు. దాన్ని ట్వీట్‌ చేసిన కైఫ్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ‘భయం లేని యువకులు అసాధ్యాన్ని కూడా రెండు చేతులతో ఒడిసి పట్టుకుంటారు. సారీ బదాని’ అని పేర్కొన్నాడు. కాగా, ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. రాహుల్‌ ద్రవిడ్‌(99), వీరేందర్‌ సెహ్వాగ్‌ (79), కైఫ్‌ (46) ధాటిగా ఆడారు. అనంతరం పాక్‌ 8 వికెట్లు కోల్పోయి 344 పరుగులకు పరిమితమైంది. ఇంజమామ్‌ ఉల్‌ హక్‌(122) శతకంతో రాణించడంతో ఆ జట్టు విజయానికి చేరువైంది. చివర్లో మాలిక్‌(7) క్యాచ్‌ను కైఫ్‌ అందుకోవడంతో ఆ జట్టు ఒత్తిడి తట్టుకోలేక ఓటమిపాలైంది.