WorldWonders

వేదనిలయంలో 14కిలోల బంగారం

వేదనిలయంలో 14కిలోల బంగారం

అనారోగ్యం బారిన ప‌డి ఆసుప‌త్రి పాలైన జ‌య‌ల‌లిత కొంత కాలం పాటు అక్క‌డే చికిత్స పొందుతూ ఆసుప‌త్రిలోనే చివ‌రి శ్వాస విడిచారు. త‌న రాజ‌కీయ వార‌సుల గురించి కానీ, త‌న ఆస్తుల‌కు వార‌స‌త్వం విష‌యంలో కానీ ఎలాంటి ప్ర‌క‌ట‌నా ఆమె చేయ‌కుండానే మ‌ర‌ణించారు. బ‌తికున్న రోజుల్లో త‌న బంధుగ‌ణాన్ని ఆమె చేర‌దీయ‌లేదు. శ‌శిక‌ళ‌-ఆమె బంధుగ‌ణ‌మే హ‌డావుడి చేసింది కానీ, అప్ప‌ట్లో జ‌య‌ల‌లిత బంధువులు మీడియాలో కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఆమె మ‌ర‌ణించే వ‌ర‌కూ కూడా ఆమె బంధుగ‌ణం విష‌యాలు అన్నీ మిస్ట‌రీగానే మిగిలాయి.

జ‌య‌ల‌లిత‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ఆస్తుల ప్ర‌చారం గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏకాలం నుంచినో హీరోయిన్ కూడా కావ‌డంతో ఆమె భారీగా ఆస్తులు గ‌డించారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాకా మ‌రింత భారీగా సంపాదించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఆ స్థాయి ఆస్తులున్న జ‌య‌ల‌లిత వాటి వార‌స‌త్వం గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. జ‌య‌ల‌లిత‌కు ఉండిన భారీ స్థిరాస్తుల గుట్టు గురించి ఇటీవ‌లే వార్త‌లు వ‌చ్చాయి. వాటివి విలువ వేల కోట్ల రూపాయ‌ల‌ని టాక్. భారీ టీ ఎస్టేట్ ఒక‌టి ఉంద‌నే దాని విలువే వెయ్యి కోట్ల రూపాయ‌ల పైనే అని స‌మాచారం. అలాంటి స్థిరాస్తులు మ‌రింత‌గా ఉన్నాయ‌ని.. వాటి వివ‌రాలు శ‌శిక‌ళ‌కు మాత్ర‌మే తెలుస‌ని టాక్.

ఇక జ‌య‌ల‌లిత ఇంట్లో ఉన్న ఆస్తుల వివ‌రాలు మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. జ‌య‌ల‌లిత ఒక కాల‌పు హీరోయిన్, ఒక ద‌శ‌లో భారీగా న‌గ‌ల‌ను సింగారించి కూడా క‌నిపించిందామె. ఇంట్లో విలాసాల‌కూ లోటు ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంటి విలాసాల మ‌ధ్య‌న జ‌య‌ల‌లిత వేదనిల‌యంలో నివ‌సించింది. ఆ వేద‌నిల‌యంలో ఉన్న ఆస్తులు భారీగా ఉన్నాయ‌ని ఇప్పుడు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ వేద‌నిల‌యాన్ని ఈపీఎస్ ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. జ‌య‌ల‌లిత మేన‌ల్లుడు ఆ మ‌ధ్య అటు వైపు వెళ్ల‌గా స్థానిక పోలీసులు అత‌డిని లోప‌ల‌కు కూడా వెళ్ల‌నీయ‌లేదు.

ఈ క్ర‌మంలో జ‌య‌ల‌లిత‌కు సంబంధించిన భారీ స్థాయిలో బంగారం, వెండి ఇంకా అనేక విలాస‌వంత‌మైన వ‌స్తువులు ఆ ఇంట్లోనే ఉన్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. బంగార‌మే 14 కేజీల వ‌ర‌కూ ఉంటుంద‌ట‌! ఇక వెండికీ లోటు లేద‌ని, ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స చేసిన ఇళ్లు కావ‌డంతో.. ఆ ఇంట్లో ఉన్న విలాసాల గురించి వేరే వ‌ర్ణించ‌న‌వ‌స‌రం లేద‌ని తెలుస్తోంది. ప‌దుల సంఖ్య‌లో టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్ ల‌తో పాటు జ‌య‌ల‌లిత‌కు దుస్తులే ప‌ది వేల‌కు పైగా ఉన్నాయ‌ట‌! అలాగే వేల కొద్దీ పుస్త‌కాలు ఉన్నాయ‌ట‌. వీటిని ప్ర‌జ‌ల ప్ర‌ద‌ర్శ‌న కోసం అయితే పెట్ట‌రు, పెట్ట‌లేరు!

మ‌హా అంటే పుస్త‌కాల‌ను ప్ర‌ద‌ర్శించి వాటినే జ‌య‌ల‌లిత ఆస్తులు అంటూ ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చు. మ‌రి బంగారం వ‌గైరాల‌ను ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వం అధికారిక లెక్క‌లో చూప‌క‌పోవ‌చ్చ‌ని, వాటిని వేరే దారి మ‌ళ్లించుకునే అవ‌కాశాలే ఉన్నాయ‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. జ‌య ద‌గ్గ‌ర ఎంత స్థాయిలో బంగారం ఉంద‌నే విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించే వాళ్లూ లేరు, ధ్రువీక‌రించే వాళ్ల మాట‌కు విలువా లేదు! దీంతో ఈపీఎస్ ప్ర‌భుత్వం ఏం చేయాల‌నుకుంటే అది చేసే అవ‌కాశం ఉంది.