Business

₹53వేలకు దగ్గరలో-వాణిజ్యం

Business News Today - Bullion Prices On Rise In India

* పసిడి, వెండి ధరలకు సోమవారం రెక్కలొచ్చాయి.దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.905 పెరిగి… రూ. 52,960కి చేరుకుంది. కిలో వెండి మీద రూ. 3,347 ఎగబాకి… రూ.65,670కు చెేరింది.అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్​ బంగారం ధర 1,935 డాలర్లు పలకగా… ఔన్స్​ వెండిపై 24 శాతం పెరిగింది.ఆర్థిక మందగమనం,పురోగతిపై ఆందోళనలు బంగారం ధరలు పెరగడానికి ఓ కారణమైతే…చైనా-అమెరికా సంబంధాలు క్షీణించడం వల్ల కూడా పసిడి ధరలకు రెక్కలొచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద విలువ దూసుకెళుతోంది. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌10 కూడా లేని ఆయన ఇప్పుడు ఏకంగా టాప్‌-5లోకి దూసుకొచ్చారు. ఇటీవలే తొలిసారి టాప్‌-10లో చోటు సంపాదించిన ఆయన.. రెండు వారాల వ్యవధిలోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల విలువ పెరగడం, జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో ఇదే దూకుడు కొనసాగితే నాలుగో స్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ ను దాటడానికి సమయం పట్టకపోవచ్చు!

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన ఘనత సాధించింది. అమెరికాకు చెందిన ఎక్సాన్‌ మొబిల్‌ను దాటేసి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థగా ఆవిర్భవించింది. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థలైన డిజిటల్‌, రీటైల్‌ వ్యాపారాలు దూకుడుగా ఉండటంతో ఈ కంపెనీ మార్కెట్‌ విలువ గణనీయంగా పెరిగింది. గత శుక్రవారమే కంపెనీ మార్కెట్‌ విలువ 189 బిలియన్‌ డాలర్లను తాకడంతో ఎక్సాన్‌ మొబిల్‌ను దాటేసింది. ఈ రెండింటి మధ్య బిలియన్‌ డాలర్ల తేడా ఉంది. ఓ పక్క రిలయన్స్‌ షేరు పెరుగుతుండగా.. మరోపక్క ఎక్సాన్‌ షేరు పడిపోతోంది. ఈ ఏడాది 39శాతం విలువ కోల్పోయింది. చమురు డిమాండ్‌ తగ్గుదల రోజుకు 30 మిలియన్‌ బ్యారెళ్ల వరకు ఉంది. ఇది చాలా పెద్ద మొత్తం. చమురు డిమాండ్‌ తగ్గడమే ఎక్సాన్‌పై ప్రభావం చూపింది. మరోపక్క రిలయన్స్‌ వ్యాపార వైవిధ్యం కారణంగా పెట్రోలియం విభాగంలో లాభాలు తగ్గినా.. డిజిటల్‌, రీటైల్‌ విభాగాలు కాపాడాయి. వాస్తవానికి మార్చి31 నాటికి రిలయన్స్‌ ఆదాయాల్లో 80శాతం పెట్రోలియం వ్యాపారం నుంచే వచ్చాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ల సూచీలు మందకొడిగా కదులుతున్నాయి. సోమవారం ఉదయం 9.37 సమయంలో సెన్సెక్స్‌ 167 పాయింట్లు నష్టపోయి 37,961 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 11,138 వద్ద ట్రేడవుతున్నాయి. పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఐనాక్స్‌, రెప్కో హోం ఫైనాన్స్‌, ఓమెక్స్‌, ఫ్యూచర్‌ రీటైల్‌ లాభాల్లో ఉండగా..యస్‌బ్యాంక్‌, జీహెచ్‌ఎల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, టైమ్‌ టెక్నోప్లాస్ట్‌, డిష్‌మన్‌ కార్బోజెన్‌ ఏఎంసీ వంటిషేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరోపక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ ఆదిత్య పూరీ తన వాటాలను విక్రయించినట్లు వార్తలు రావడంతో ఆ షేర్లు 2 శాతం వరకు పడిపోయాయి. ఇక యస్‌బ్యాంక్‌ ఎఫ్‌పీవోలో కొత్త వాటాలు జారీ చేయడంతో ఆ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. నేడు టెక్‌ మహీంద్రా, మార్కో, హవేల్స్‌ ఇండియా వంటి 100 కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి.

* దేశంలోని ఐదు రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని, అవి భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును రూపుదిద్దుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా గవర్నర్‌ (ఆర్బీఐ) శక్తికాంతదాస్‌ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం, పునరుత్పాదకత ఇంధన శక్తి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటి), సప్లయ్‌ చైన్‌, మౌలికవసతులు వంటి ఐదు రంగాలలో భారత్ తన శక్తి సామర్ధ్యాలతో ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగి తన స్థానాన్ని సుస్థిరపరచుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.