Agriculture

చిత్తూరోళ్ల దెబ్బకు కళ్లుతెరిచిన సోనూసూద్

Sonu Sood Helped Farmer Family In Chittoor Are Politician Family

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఒక రైతు కుమార్తెలు ఇద్దరు కాడె లాగడం, ఆ వీడియో వైరల్ కావడం, నటుడు సోనూసూద్ వారికి ట్రాక్టర్ కొనివ్వడంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

నాగేశ్వర్రావు కుటుంబం కడు బీదరికంలో లేదని, ప్రభుత్వం తరపున వారికి అందాల్సిన సంక్షేమ పథకాలన్నిటినీ ఇదివరకే అందించామని ప్రభుత్వం చెబుతోంది.

నాగేశ్వర్రావు పిల్లలు సరదాగ కాడె లాగారని, ఆ వీడియో వైరల్ అవ్వడంతో వారు కాడెద్దులను కూడా అద్దెకు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్న అసత్య ప్రచారం జరిగిందంటూ మీడియా మీడియాలో కథనాలు వచ్చాయి.

నాగేశ్వర్రావుది కె.వి.పల్లి మండలం మహల్‌రాజుపల్లె స్వగ్రామంలో ప్రభుత్వం కట్టించిన ఇందిరమ్మ ఇళ్లల్లో ఆయన తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. మదనపల్లెలోని అద్దె ఇంట్లో నాగేశ్వర్రావు కుటుంబం ఉంటోంది. కరోనా నేపథ్యంలో సంపాదన లేక, నాగేశ్వర్రావు కుటుంబం, వృద్ధులైన తన తల్లిదండ్రుల వద్దకు చేరింది.

వీరి కుటుంబం కొన్నేళ్ల క్రితమే పిల్లల చదువుల కోసం స్వగ్రామం వదిలి, మదనపల్లెకు చేరింది. అక్కడే ఒక టీ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవారు నాగేశ్వర్రావు. ఆయన వ్యవసాయానికి దూరమై చాలాకాలం అయ్యింది. పేద రైతు అనగానే, కళ్లముందు మెదిలే ‘చిరిగిన బట్టల్లో నలిగిన శరీరం’ కాదు ఆయనది. పట్టణీకరణ చెందిన ఒక చాయ్ వాలా.

‘దళితుడైన నాగేశ్వర్రావు, మానవ హక్కుల కార్యకర్తగా కూడా పని చేస్తున్నారు. 2009లో లోక్‌సత్తా పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి, వెయ్యికిపైగా ఓట్లను సాధించారు. అతను సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తి’ అని స్థానిక మీడియా చెబుతోంది.

రాజకీయ చైతన్యం ఒక దళితుడిని పేదరికం నుంచి బయట పడేయగలదా? ఈ విషయమై వాస్తవాలు తెలుసుకునేందుకు బీబీసీ చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాను ఫోన్ ద్వారా సంప్రదించింది.

”ఇప్పటికే గత ఏడాది, ఈ ఏడాది రైతుభరోసా పథకాన్ని ఆ కుటుంబానికి వర్తింపజేశాం. ట్రాక్టర్ ద్వారా వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో వారులేరు. వారు ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. కానీ ట్రాక్టర్ వచ్చేలోగా ఈ వీడియో తీశారు.’ అని కలెక్టర్ భరత్ గుప్తా బీబీసీతో అన్నారు.

నాగేశ్వర్రావు కుటుంబం గురించి మరిన్ని విషయాలు చెబుతూ…

”వాస్తవంగా నాగేశ్వర్రావు ఒక టీ షాపు నడుపుతున్నాడు. చిన్నమ్మాయికి అమ్మఒడి పథకం కింద 10వేల రూపాయలు ఇచ్చాం. కరోనా వల్ల ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా చితికిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆడపిల్లలు అవసరమై కాడె మోశారా లేక సరదాగా చేశారా అన్నది కచ్చితంగా చెప్పలేం” అన్నారు.

‘అవును, 2009 ఎలక్షన్స్‌లో పోటీ చేసినా’ ప్రభుత్వం చెబుతున్న విషయాల గురించి నాగేశ్వర్రావు స్పందించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ,

‘‘నేను దళితుడిని, మానవ హక్కుల కార్యకర్తని. 2009 ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ తరపున పోటీ చేసినాను. వెయ్యికి పైగా ఓట్లు పడినాయ్. కానీ, ఆ ఎన్నికల్లో అసలు అభ్యర్థిని నేను కాదు. డా.పార్థసారథి అనే ఒక వ్యక్తికి పార్టీ టికెట్ వచ్చింది. ఆయన దగ్గర నెలకు 6వేల జీతంతో నేను పనిచేస్తాంటి. అసలు అభ్యర్థిగా పార్థసారథి నామినేషన్ ఏసినాడు. కానీ ఎన్నికల్లో పార్టీకి పెద్దగా ఓట్లు పడవని ఆయనకు అర్థమైంది. తక్కువ ఓట్లతో ఓడిపోవడం ఇష్టంలేక, డమ్మీ అభ్యర్థినైన నాకు ప్రచారం ఖర్చులకు 50వేలు డబ్బులిచ్చి, పోటీకి నిలబెట్టినాడు. అట్ల నేను రాజకీయ నాయకుడిని అయితి” అన్నారు.

‘చెప్పుకోల్లంటే సిగ్గు అయితాంది…’ ఇక ప్రభుత్వం చెబుతున్నట్లుగా గతేడాది, ఈ ఏడాది రైతుభరోసా సొమ్ము 20వేలు, చిన్న కూతురికి అమ్మ ఒడి 10వేల రూపాయలు అందాయన్న విషయం గురించి ఆయన స్పందించారు.

”నిజమే సార్, కలెక్టర్ సారు చెప్పింది నిజం. రైతుభరోసా కింద డబ్బులైతే వచ్చినాయి. కానీ ఎంతొచ్చిందో నాకు తెలీదు. ఎందుకంటే వ్యవసాయ భూమి మా నాయినది. డబ్బులు ఆయన అకౌంట్లో పడతాయి. ఆ డబ్బులు నేను తీసుకోను. మా ముసలోళ్లకే ఇస్తాను. అమ్మఒడి పథకం కింద వచ్చిన 10వేల రూపాయలతో చిన్నపాప స్కూలు ఫీజు కట్టినా. చిన్నపాపది 15వేలు పెద్దపాప కాలేజ్‌లో 20వేల ఫీజు ఇంకా కట్టల్ల. మదనపల్లెలో ఇంటి బాడుగ కట్టలేక పెండ్లాం పిల్లలను తీసుకుని మా నాయిన పంచన చేరినాను. చెప్పుకోల్లంటే సిగ్గు అయితాంది సార్, మా నాయినకు వచ్చే ప్రభుత్వ పెన్షన్ 2,250 రూపాయలపై నా భార్యాపిల్లలు ఆధారపడినారు. కరోనా రాకపోయింటే ఇంత అగత్యం పట్టునా మాకు?” అని నాగేశ్వర్రావు అన్నారు.

‘మా శరీరం రంగు, కొలతల్ని చూస్తారా?’ ”సార్, చేనులో ఒకసారి దున్నితేనే సేద్యం అయినట్లా? పంట చేతికొచ్చేలోపు కలుపు తీసేకి మళ్లీ దున్నల్ల కదా? అన్నీ ఆలోచించి, ఇప్పుడు డబ్బుల్లేవు, సేద్యం వద్దు అని పిల్లలతో అనినా. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. మేం ఉండాంగదా నాయినా నీకు, తలా ఒక చెయ్యి వేస్తాం అని బలవంతం చేసిరి. చివరికి కాడె మోసిరి. వాళ్లను నవ్విస్తా పని చేపిస్తాంటి. అది మా అల్లుడు వీడియో తీసినాడు. నా పిల్లలకు సేద్యం తెలీదు, వాళ్లకు కాడె మోయడం కొత్త. వీడియో తీస్తాంటే, సిగ్గుతో నవ్వినారు. దాన్ని పట్టుకుని, పిల్లోల్లు నగుతాండారే, పిల్లోల్లు లావుగుండారే… అంటే ఎట్ల? మా శరీరం రంగు, కొలతల్ని చూసి మమ్మల్ని అర్థం చేసుకుంటారా? నేను డిగ్రీ చదివినా. నా పిల్లల్ని చదివించుకుండా. ఏం? మేం బాగుండకూడదా? ఈ కరోనా రాకపోయిన్నింటే నేను ఈ గతి పట్టేవాడినే కాదు. అన్నీ చూస్తాంటే కడుపు కాలిపోదావుంది సార్..’’

‘ఏం నేరం జేసినాం?’ సేద్యం చేతకాదని ఎవుర్నన్నా సాయం అడిగింటినా? ప్రభుత్వం ఆదుకోలేదని చెప్పింటినా? మా బతుకు మేం బతుకుతాంటిమి గదా! ఆ సారు మాకు ట్రాక్టర్ ఇచ్చినందుకు ఎంత పనైపాయ! నేను పేదోడినో కాదో తెలుసుకునేకి, గవర్నమెంటు ఆఫీసర్లు మా ఇంటిలోకి దూరిరి. నేను దళితుడిని కాకపోతే, డబ్బున్నోడినే అయ్యుంటే, మా ఊరికి వచ్చి ఎంక్వయిరీ చేసేవాళ్లా?” అని ముగించారు నాగేశ్వర్రావు.

– Report By BBC