WorldWonders

పక్షి కోసం ప్రజలందరూ కలిసి…

పక్షి కోసం ప్రజలందరూ కలిసి…

అది తమిళనాడులోని… శివగంగ జిల్లాలోని… పొత్తకూడి గ్రామం. అక్కడ 40 రోజులుగా… వీధి లైట్లు వెలగట్లేదు. స్థానికులే వాటిని వెలగనివ్వకుండా… అధికారులు వాటిని ఆన్ చెయ్యనివ్వకుండా చేస్తున్నారు. ఇదంతా దేనికంటే… ఓ చిన్న పక్షి పిల్లల్ని కాపాడేందుకే అంటే నమ్మగలరా. ఇది నిజం. ఆ ఊళ్లోకి 50 రోజుల కిందట… అరుదైన ఇండియన్ రాబిన్ లే (Robin Lay) పక్షి జంట వచ్చింది. అక్కడి వీధిలైట్లను ఆన్‌చేసేందుకు ఉండే మెయిన్ స్విట్చ్‌బోర్డ్ పక్కన గూడు కట్టి మూడు గుడ్లు పెట్టాయి. ఐతే… స్థానిక నివాసి అయిన కరుప్పు రాజా… ప్రతి రోజూ ఆ మెయిన్ బోర్డ్ దగ్గరకు వచ్చి స్విట్చ్ ఆన్ చేసేవాడు. అతను రాగానే ఆ పక్షులు టెన్షన్ పడటం గమనించాడు. ఈ విషయాన్ని ఊరి ప్రజలకు చెప్పాడు. దాంతో అందరూ ఒకే మాటపైకి వచ్చారు. ఆ పక్షి గుడ్లు… పిల్లలుగా మారి… అవి పెరిగే వరకూ… ఆ స్విట్చ్ బోర్డ్ దగ్గరకు ఎవరూ వెళ్లకూడదనీ, అప్పటివరకూ వీధి లైట్లు లేకపోయినా సరిపెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎంత గొప్ప విషయం ఇది.

మొత్తం 35 వీధి లైట్లు. 40 రోజులుగా వెలగట్లేదు. రోజూ సాయంత్రం 6 గంటలకు ఆన్ చేసి, ఉదయం 5 గంటలకు ఆఫ్ చేసేవాడు కరుప్పు రాజా. ఇప్పుడు అలా చెయ్యడం మానేశాడు. ఫలితంగా దాదాపు 100 ఇళ్లకు వీధి లైట్ల కాంతులు ఆగిపోయాయి. వాళ్లంతా ఓ యజ్ఞంలా ఆ పక్షి గుడ్లను, గూడునూ కాపాడుతున్నారు. ఇప్పటికే మూడు గుడ్ల నుంచి మూడు బ్లూ కలర్ రాబిన్ లే పిల్లలు బయటకు వచ్చాయి. మూడూ ఆరోగ్యంగా ఉన్నాయి. వాటికి రెక్కలకు ఈకలు కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ప్రస్తుతం స్విట్చ్ బోర్డును టేప్‌తో మూసేశారు. తద్వారా ఆ పక్షులకు ఎలాంటి హానీ లేకుండా చేశారు. పంచాయతీ పెద్ద… రోజూ రాత్రి వేళ ఇళ్లన్నీ తిరుగుతూ… కాపలా కాస్తున్నారు. ఆ పిల్లల్ని చూసేందుకు ఊరి ప్రజలు తరలి వస్తున్నారు. కానీ… ఎవరూ గూడు దగ్గరకు వెళ్లట్లేదు. దూరం నుంచే చూసి ఆనందపడుతున్నారు.

ఇప్పుడు ఈ విషయం ప్రపంచం మొత్తం తెలిసింది. అందరూ ఆ ఊరినీ, వాళ్ల మంచి నిర్ణయాన్నీ మెచ్చుకుంటున్నారు. ఆ లిస్టులో మీరూ చేరినట్లేగా. (ఫొటోలో పిట్ట రాబిన్ లే. ఇండియన్ రాబిన్ లే కూడా ఇలాగే ఉంటుంది. కలర్ మాత్రం బ్లూకలర్ ఉంటుంది.)