NRI-NRT

ఎన్నికలు వాయిదా వేద్దామనుకుంటున్నాను

ఎన్నికలు వాయిదా వేద్దామనుకుంటున్నాను

నవంబర్‌ 3న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు. దేశంలో కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో ప్రజలు ధైర్యంగా ఓటు వేసే వరకు ఎన్నికలు వాయిదా వేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌ చేపడితే 2020 ఎన్నికలు తప్పుడు, మోసపూరిత ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకుని ప్రజలు సరిగ్గా, క్షేమంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకు ఎన్నికలను వాయిదా వేయాలి అని ట్వీట్‌ చేశారు.

మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌ ప్రక్రియను ట్రంప్‌ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అయితే, నవంబర్‌లో జరగబోయే ఎన్నికలను రద్దు చేసేందుకు లేదా వాయిదా వేసేందుకు ట్రంప్‌ మొగ్గుచూపుతారని మొదటి నుంచీ డెమోక్రాట్‌లు చెబుతూ వస్తున్నారు. అమెరికా జీడీపీ భారీగా క్షీణించినట్లు వార్తలు వచ్చిన కాసేపటికే ఆయన ట్రంప్‌ ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. అయితే, అమెరికా ఎన్నికల తేదీని మార్చే అధికారం అధ్యక్షుడికి లేదు. అది అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. 1845 నుంచీ ఎన్నికలు నవంబర్‌ 3నే జరుగుతుండడం గమనార్హం. ఆ తేదీలను మార్చడం అంత తేలికైన విషయం కాదు.