Fashion

ఉప్పాడ పట్టు గొప్పదనం

ఉప్పాడ పట్టు గొప్పదనం

దేశం కాని దేశంలో పుట్టింది. అయితేనేం, మనదేశంలో ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. పెండ్లయినా.. పేరంటమైనా.. పట్టుచీర కట్టాల్సిందే అనుకునే ఏ సందర్భమైనా..ఆ కట్టులోనూ కొంత కంఫర్ట్‌ ఉండాలనుకుంటే .. ఏ మగువకైనా ఉప్పాడ చీరలే గుర్తుకొస్తాయి. ఆమె మనసు లాగానే ఉప్పాడ పట్టు కూడా.. నూటికి నూరు శాతం స్వచ్ఛం, సుందరం!
***ఉప్పాడ..
ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామం. ఈ పల్లెకు చేనేతలో మూడొందల ఏండ్ల చరిత్ర ఉంది. జామ్దానీ చీరల తయారీలో తెలుగు నేతన్నల గొప్పదనాన్ని చాటి చెప్పిందీ ఊరు. కళానైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జామ్దానీ చీరలను చూడాలంటే ఉప్పాడకు వెళ్లాల్సిందే! మిగతా పట్టు చీరల్లా.. వెనుక పోగులుగా ఉండకుండా వెనుకా ముందూ ఏ వైపు చూసినా.. నునుపుగా, ఒకేలా ఉండటం వీటి ప్రత్యేకత. అలాగే ఈ చీరల్ని స్వచ్ఛమైన పట్టుతో నేస్తారు. ఈ చేనేతలు చాలా తేలికగా ఉంటాయి. వైవిధ్యమైన డిజైన్లలోనూ దొరుకుతాయి. ఏ మేకుకో చిక్కుకుంటే.. పోగులు వస్తాయనే భయం ఉండదు. అందుకే, మగువలు అంతగా మనసు పారేసుకుంటారు. ఎలాంటి శుభకార్యాలైనా ఉప్పాడ చీరల పట్లే ఆసక్తి చూపుతారు.
**ఘన చరిత్ర
జామ్దానీ బంగ్లాదేశ్‌కు చెందిన అపురూప కళ. ఇదో పర్షియన్‌ పదం. జామ్‌ అంటే పువ్వు. బంగ్లాదేశ్‌లోని ఢాకా కేంద్రంగా తయారవుతున్న ఈ చీరలకు ఘన చరిత్ర ఉంది. బెంగాల్‌ నేత కార్మికులు వీటిని తయారుచేసేవారు. మొఘల్‌ రాణులు, బ్రిటిష్‌ దొరసానులూ ఇష్టంగా ధరించేవారు. జామ్దానీ సంప్రదాయ నేతను యునెస్కో సైతం సాంస్కృతిక సంపదగా గుర్తించింది. ఈ చీరలపై మొక్కలు, పూల డిజైన్లు ఆకట్టుకునేలా ఉంటాయి. నాణ్యత, స్టయిల్‌ విషయంలో ఎప్పుడూ అగ్రస్థానమే. ఫ్యాషన్‌ డిజైనర్లు జామ్దానీ చీరలను పార్టీ చీరలుగా ఎంబ్రాయిడరీ కాంబినేషన్‌తో రూపొందించారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం దళారులను నివారించి చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా ఢాకా సమీపంలో ‘జామ్దానీ పల్లె’ను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన వాడికే వీర రాఘవులు అనే వ్యక్తి అప్పట్లో యూపీలోని అమీనాబాద్‌లో వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. ఆయనే జామ్దానీ చీరలను తెలుగుగడ్డకు పరిచయం చేశాడు. అప్పటి నుంచీ చాలా జిల్లాల్లో ఉప్పాడ చీరలను నేయడం ప్రారంభించారు. అప్పటివరకు సాధారణ నేతచీరలకి నెలవైన ఈ ప్రాంతం, జామ్దానీ పట్టు చీరల తయారీ కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది.
***వందశాతం పట్టు
ఈ చీరల తయారీ కళాత్మకమైంది. వందశాతం పట్టు నూలుతో రూపుదిద్దుకుంటుంది. చీరల తయారీ నిపుణుల సహనానికి పరీక్ష. ఓర్పు, నేర్పు అవసరం. చీరను మగ్గంపై నేస్తూ దానిపై డిజైన్‌ను చేతితో చేయాలి. ముందుగా నేయాలనుకున్న డిజైన్‌ని ఒక గ్రాఫ్‌పై గీసుకుంటారు. ఆ డిజైన్‌కి సంబంధించి ఒక కౌంట్‌ ఉంటుంది. ఆ ప్రకారంగా మగ్గంపై నిలువు దారాలకి ఎక్కిస్తారు. ఇదంతా గణిత పరిజ్ఞానంతో ముడిపడిన వ్యవహారం. ముడిపట్టును కర్ణాటక, బెంగళూరు, సూరత్‌ల నుంచి తెచ్చుకుంటారు. ఒక్కో పట్టుపోగు గుర్రపు వెంట్రుక అంత మందంగా ఉంటుంది. దాన్ని పిఠాపురం ప్రాంతంలో ప్రాసెస్‌ చేస్తారు. పట్టుకు కావాల్సిన రంగులు కూడా అక్కడే వేయిస్తారు. రంగు దారాలని తెచ్చుకొని.. ఆ రంగు దారాలకి ఒకటి, నాలుగు, ఆరు, ఎనిమిది దారాల వరకు ఒకేసారి పడుగు చేస్తారు. ఆ తర్వాత అచ్చు అల్లుతారు. ఆపైన, ఆ దారాన్ని రాట్నంపై కండెలుగా మారుస్తారు. ఈలోపు వ్యాపారులు తమకు కావాల్సిన డిజైన్స్‌ను అందిస్తారు. కండెలుగా మారిన పట్టుని మగ్గంపైకి చేర్చి జామ్దానీ చీరలను నేస్తారు. డిజైన్‌ను బట్టి చీరను నేసే సమయం పెరుగుతుంది. మగ్గంపై పన్నెండు గంటలు పనిచేస్తే కానీ అరమీటరు చీర ఉత్పత్తి సాధ్యం కాదు. ఒక్కో చీర తయారీకి కనీసం పక్షం రోజుల సమయం తీసుకుంటుంది. చీర ఖరీదు ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు పలుకుతుంది. ధర అన్నది కళాత్మకతపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా.. ప్రత్యేకంగా వెండి, బంగారు జరీతో నేసే చీరల ధర లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది.
***స్టెలింగ్‌ సూపర్‌
ఈ పట్టు చీరలు చాలా తేలికగా ఉంటాయి. ఫలానా వాళ్లకే నప్పుతాయనే పరిమితి లేదు. టీనేజ్‌ అమ్మాయిల నుంచి పెద్దల వరకూ ఎవరైనా ధరించవచ్చు. ప్లెయిన్‌ చీరలే ఎక్కువ. వీటికి మగ్గం వర్క్‌ చేయించిన బ్లౌజ్‌లు సూటవుతాయి. టిష్యూ చీరల మీద కూడా ఈ వర్క్‌ చేయించుకుంటే బాగుంటుంది. ట్రెండీగా కావాలనుకుంటే బార్డర్‌ల వరకే వర్క్‌ చేయించవచ్చు. వీటిని లంగా-ఓణీలుగా డిజైన్‌ చేయించుకోవచ్చు. లాంగ్‌ గౌన్లుగా కుట్టించినప్పుడు బార్డర్‌లను హ్యాండ్స్‌ వరకు వేసుకోవాలి. వర్క్‌ చేయిస్తే ఆ అందమే వేరు. ప్లెయిన్‌ కాకుండా గళ్లు ఉన్న డిజైన్లను గౌన్లుగా కుట్టించుకుంటే మరింత బాగుంటాయి. మల్టీ కలర్‌ చీరలు ప్రత్యేక ఆకర్షణ. వీటితో కూడా నచ్చినట్టుగా లాంగ్‌ గౌన్లు కుట్టించుకోవచ్చు. లంగా-ఓణీలు, లెహంగాలు.. ఇలా కస్టమైజ్‌ చేయించుకొని కుట్టించుకుంటే లుక్‌ అదిరిపోతుంది.