Politics

CRDA రద్దుకు గవర్నర్ ఆమోదం-తాజావార్తలు

CRDA రద్దుకు గవర్నర్ ఆమోదం-తాజావార్తలు

* మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్. శాసన రాజధానిగా-అమరావతి పరిపాలన రాజధానిగా -విశాఖపట్నం న్యాయశాఖ రాజధానిగా కర్నూలు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్‌ 13న రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ.. 2019 డిసెంబర్‌ 20న తన నివేదికన సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్‌ 29న రాష్ట్రం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోస్టన్‌ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది.అనంతరం 2020 జనవరి 20న హైపవర్‌ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా.. ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్‌ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్‌ రాజ ముద్రవేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్‌క్లియర్‌ అయ్యింది. గవర్నర్‌ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

* అమరావతి అంశంపై ఏపీ భాజపా శాఖ మరో ట్వీట్‌ చేసింది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ పార్టీ తెలిపింది. అయితే, రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశం మాత్రం కేంద్రం పరిధిలో లేదని తెలిపింది. రాజధాని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్న సుజనాచౌదరి వ్యాఖ్యలను ఏపీ భాజపా ఖండించింది. పార్టీ వైఖరికి భిన్నంగా సుజనా చౌదరి మాట్లాడారని ట్వీట్‌ చేసింది.

* కరోనావైరస్‌ మహమ్మారి ధాటికి బ్రిటన్‌ వణికిపోయిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం వరకు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో యూకేలో ఆంక్షలు సడలించారు. అనంతరం కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. పటుచోట్ల వైరస్‌ తీవత్ర ఎక్కువ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించింది. తాజా పరిణామాలతో రెండో దఫా వైరస్‌ విజృంభణ మొదలైందా?అనే ఆందోళన బ్రిటన్‌ వాసుల్లో నెలకొంది.

* రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కల్తీ బొగ్గు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మీడియాకు వెల్లడించారు. లారీ ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులతో కుమ్మక్కై కృష్ణపట్నం పోర్టు, సింగరేణి నుంచి బొగ్గును తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం వద్ద పెద్ద డంప్‌ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ ముఠాలోని మొత్తం 13 మందిలో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1,050టన్నుల అసలైన బొగ్గు, 700 టన్నుల కల్తీ బొగ్గు, రెండు లారీలు, రెండు జేసీబీలు, రూ.2.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

* ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించడం శుభపరిణామమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. న్యాయ వ్యవస్థకు ఈ మధ్య కాలంలో ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేకపోవడంతోనే చాలా పరిణామాలు తలెత్తాయన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన జాతీయ విధానం పట్ల ఏపీ ప్రభుత్వం తీరుపై స్పందిస్తూ.. ఈ విద్యా విధానాన్ని సరిగా అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నూతన విద్యా విధానాన్ని వక్రీకరించినా సుప్రీంకోర్టు దాన్ని సరిదిద్దుతుందని.. అప్పుడైనా కోర్టు మాట వినండి అని ఎద్దేవా చేశారు.

* బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లను సుప్రీం కోర్టు నిలిపివేసింది. లాక్‌డౌన్‌ సమయంలో అసాధారణ రీతిలో జరిగిన ఆ వాహన విక్రయాల అంశం తేలే వరకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని అధికారులను ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో మార్చి చివర్లో, ఆ తర్వాత పెద్దఎత్తున ఈ తరహా వాహన విక్రయాలు చేపట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. బీఎస్‌-4 వాహన విక్రయాల అంశంపై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది.

* ఐక్యరాజ్యసమితి 75వ వార్షిక సమావేశాలకు న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయం ముస్తాబవుతోంది. అయితే అమెరికాలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈసారి వార్షిక సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనున్నాయి. సెప్టెంబర్‌లో జరిగే ఈ సమావేశాలు 75ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వర్చువల్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం సమావేశాలకు నేరుగా హాజరై ప్రసంగించే అవకాశం ఉందని ఐరాసలో అమెరికా రాయబారి కెల్లీ క్రాఫ్ట్‌ వెల్లడించారు. ఒకవేళ ఇదే జరిగితే ఈసారి ఐరాస సర్వసభ్య సమావేశాలకు వ్యక్తిగతంగా హాజరై ప్రసంగించే ఏకైక నాయకుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అవుతారని కెల్లీ క్రాఫ్ట్‌ అభిప్రాయపడ్డారు.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ అక్కడ 42 మంది రోగులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఘాజీపూర్‌లో కొందరు వ్యక్తులు ల్యాబ్‌లో స్వాబ్‌ ఇచ్చిన సందర్భంలో తప్పుడు ఫోన్‌ నంబర్లు, చిరునామాలు ఇవ్వడంతో వారి జాడ తెలియడంలేదు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌కు ఈ విషయాన్ని తెలుపుతూ అడిషనల్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కేకే వర్మ లేఖ రాశారు. 42 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొనేందుకు వచ్చి సరైన మొబైల్‌ నంబర్‌, చిరునామా ఇవ్వలేదని పేర్కొన్నారు.

* రాజస్థాన్‌ రాజకీయాల్లో ఏర్పడ్డ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తన వర్గ ఎమ్మెల్యేలను జైపుర్‌ నుంచి జైసల్మేర్‌కు తరలించారు. శాసనసభ సమావేశ తేదీని ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాలు మరింతగా ఉపందుకున్నాయని ఆరోపించిన గహ్లోత్‌ ఈ మేరకు జాగ్రత్త పడ్డారు. రాజధాని జైపుర్‌ నుంచి జైసల్మేర్‌ 550 కి.మీ దూరంలో ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో అవతలి వర్గం వీరిని సంప్రదించే అవకాశమే ఉండదని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం.

* ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020కి తనను వ్యాఖ్యాతగా తీసుకోవాలని కోరుతూ మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ బీసీసీఐకి ఈమెయిల్‌ పంపించారని తెలిసింది. టీవీ వ్యాఖ్యాతల నిబంధనావళి ప్రకారమే నడుచుకుంటానని తనకు మరో అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారని సమాచారం. క్రికెట్‌ పరిజ్ఞానం బాగా ఉండి చక్కని ఆంగ్లంలో సంజయ్‌ మంజ్రేకర్‌ కామెంటరీ చేయగలరు. అయితే కొన్ని అంశాలు వివరించేటప్పుడు వివాదాస్పద పదాలు జోడించడం కొందరు ఆటగాళ్లు, సహ వ్యాఖ్యాతలను ఇబ్బంది పెట్టింది.

* దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు నేలచూపులు చూశాయి. అయితే, ఫార్మా రంగ షేర్లు రాణించడంతో స్వల్ప నష్టాలతో మార్కెట్లు గట్టెక్కాయి. ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్‌ ఆద్యంతం ఊగిసలాట ఎదుర్కొంది. ఒకానొక దశలో 300 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌ చివర్లో కోలుకుని 129.18 పాయింట్లు నష్టంతో 37,606.89 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 28.70 పాయింట్లు నష్టపోయి 11,0735.50కి చేరింది.

* భారత్‌-చైనా సైనిక లేదా ఆర్థిక వివాదాల్లో భారత్‌కే అమెరికా మద్దతు ప్రకటించాలని ఎక్కువమంది అమెరికన్లు కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‌జులై 7న నిర్వహించిన ఈ సర్వేలో 1,012 మంది అగ్రరాజ్య పౌరులు భాగస్వాములు అయ్యారు. ఆసియాలో అతిపెద్ద రెండు దేశాల మధ్య సైనిక వివాదం తలెత్తితే 63.5%, ఆర్థిక వివాదమైతే 60.6% మంది ఎవ్వరికీ మద్దతు ఇవ్వకూడదని అన్నారు. అయితే డ్రాగన్‌తో పోలిస్తే ప్రత్యేకంగా భారత్‌కు మద్దతిస్తున్నవారి సంఖ్య భారీగా ఉండటం గమనార్హం.