ScienceAndTech

మహిళల కారణంగా తయారైన ఉపకరణం-స్టెతస్కోప్

మహిళల కారణంగా తయారైన ఉపకరణం-స్టెతస్కోప్

ఏ మాత్రం అసౌకర్యంగా ఉందనిపించినా డాక్టర్‌ని కలుస్తాం. ఏ సమస్యయినా ఉండనీ.. డాక్టర్‌ ముందుగా స్టెతస్కోప్‌తో ఛాతిని పరిశీలిస్తారు. గుండె పనితీరు.. శ్వాస విధానం ఎలా ఉందో గమనిస్తారు. ఆ తర్వాతే సమస్య ఏంటి? చికిత్స ఏంటో? చెప్తారు. సమస్య.. పరిష్కారం గురించి తెలిపేందుకు డాక్టర్‌కు ఉపయోగపడే స్టెతస్కోప్‌ చరిత్ర ఏంటో.. దానిని ఎవరు రూపొందించారో.. దాని వెనుకున్న కారణమేంటో తెలుసుకుందాం. ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే క్షణాల్లో డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. సమస్యను పరిష్కరించుకుంటున్నారు. అంతేనా? అందుబాట్లో ఉన్న హెల్త్‌ యాప్స్‌ వాడుతూ సమస్య ఏంటో.. పరిష్కారమేంటో స్వయంగా తెలుసుకుంటున్నారు. బీపీ.. షుగర్‌.. హార్ట్‌ చెకప్‌ వంటివి చేయించుకోవాలంటే వేల రూపాయల ఫీజు ఉంటుంది. డాక్టర్‌కు ఆ అవకాశం ఇవ్వకుండా సొంతంగా వాళ్లే చెక్‌ చేసుకొని సమస్య ఏంటో తెలుసుకుంటున్నారు. పరిష్కారం కూడా యాప్స్‌ ద్వారానే తెలుసుకొని ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ వెనకటి రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కదా? ఇంత విజ్ఞానం ప్రజల్లో ఉండేది కాదు కదా? అప్పుడు ఏం చేసేవారు? ఏమీ చేయలేనివాళ్లు చెట్టు పసరో.. ఆకు పసరో పెట్టి నాటు వైద్యం చేసేవారు. విజ్ఞానం పెరిగిన కొద్దీ వైద్యంలో కూడా మార్పులు వచ్చాయి. ప్రి-ట్రీట్‌మెంట్‌కు కొన్ని సాధనాలు కావాలి కదా? అలాంటి సాధారణ ఒక ఉపకరణమే స్టెతస్కోప్‌. సమస్యకూ.. పరిష్కారానికి అనుసంధానమైంగా దీనిని చెప్పవచ్చు.
**అది క్రీ.శ 1781.
ఫ్రాన్స్‌లోని ఓ సాధారణ కుటుంబం. మిషెల్లీ.. థియోఫైల్‌ భార్యాభర్తలు. ఫిబ్రవరి 17న వీరికి రెనే థియోఫైల్‌ హయాసింథే లైనెక్‌ జన్మించాడు. లైనెక్‌ చిన్నతనంలోనే వాళ్లమ్మ క్షయ వ్యాధికి గురై చనిపోయింది. చూస్తే మరీ చిన్నోడు. తల్లి పాలు లేకుండా ఎలా ఉండగలుగుతాడు? అయినా పొద్దస్తమానం అతడిని ఎవరు చూసుకుంటారు? అని ఆలోచించి లైనెక్‌ని మేనమామ ఇంటికి పంపించాడు వాళ్ల నాన్న. అతనొక లాయర్‌. పిల్లల ఆలనా పాలనా చూసుకునే తీరిక లేకపోవడంతో పెద్ద పిల్లల్ని తన దగ్గరే ఉంచుకొని.. చంటి పిల్లాడిని వాళ్లకు అప్పగించాడు. లైనెక్‌ను వాళ్ల అత్తమ్మ ఓ తల్లిలా చూసుకునేది. స్కూల్‌ ఏజ్‌కి వచ్చాక బడిలో చేర్పించి చదువు కూడా చెప్పించారు. లైనెక్‌ చిన్నప్పటి నుంచే చదువులో అయినా.. ఇతర ఏ పనిలో అయినా చాలా యాక్టివ్‌. వాళ్ల మామయ్య ఓ కళాశాలలో ప్రొఫెసర్‌. లైనెక్‌ చాలాసార్లు మామతో కలిసి వెళ్లేవాడు. మెడికల్‌ కోర్సు కాబట్టి చిన్నప్పటి నుంచే వైద్యం.. చికిత్స.. అక్కడ ఉపయోగించే పరికరాల గురించి తెలుసుకునేవాడు. వాళ్లింట్లో అన్నీ మెడికల్‌ స్టడీస్‌ పుస్తకాలే ఉండేవి. వాళ్ల మామయ్య మాటలు.. చేతలు.. సంబంధాలు అన్నీ మెడికల్‌ కోర్సుకు సంబంధించినవే కాబట్టి ఆ ప్రభావం లైనెక్‌పై పడింది. ఆయనెక్కడ చదువుకుంటే ఇతడూ అక్కడికే వెళ్లి కూర్చునేవాడు. ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యన చనువు పెరిగింది. అల్లుడి సందేహాలను మామ నివృత్తి చేస్తుండేవాడు.
కొంత అవగాహనైతే ఏర్పడింది. తర్వాత ఒక డాక్టర్‌ దగ్గర సహాయకుడిగా పెట్టించాడు వాళ్ల మామయ్య. నచ్చిన పనే కాబట్టి లైనెక్‌ సంతోషంగా చేసేవాడు. అయితే దురదృష్టం మరోసారి అతడిని వెంటాడింది. లైనెక్‌ వాళ్ల మామయ్య కూడా క్షయవ్యాధి బారిన పడి చనిపోయాడు. దిక్కుతోచని పరిస్థితి. పోనీ.. ఇంటికెళ్లి పోదామా అనుకుంటే వాళ్ల నాన్న ఆరోగ్యమూ బాగాలేదు. మామ ఆశయాన్ని సాధించాలని వైద్యవిద్యను సీరియస్‌గా తీసుకున్నాడు. ఈ సమయంలోనే అతనికి పెండ్లయింది. ఇప్పుడు కూడా చదువుకుంటూ కూర్చుంటే పూట గడిచేదెలా? ఇటు చదువును ఆపొద్దు.. అటు డబ్బూ కావాలి అని పార్ట్‌టైం కంట్రిబ్యూటర్‌గా క్లినిక్‌లో పనికి కుదిరాడు. రోజూ ఎంతోమంది పేషెంట్లు వస్తుండేవారు. వాళ్ల డాక్టర్‌ చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నోడు. ఒకసారి లైనెక్‌ భార్య అనారోగ్యానికి గురైంది. సమస్య ఏంటో తెలియలేదు. అందరూ కంగారు పడ్డారు. లైనెక్‌కు కూడా అర్థం కాలేదు. శ్వాస సమస్య ఉన్నట్లు తర్వాత గుర్తించారు. ఇంకోసారి మేనల్లుడికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఈ రెండు సంఘటనలు అతడిలో ఆలోచను రేకెత్తించాయి.
**అది.. క్రీ.శ. 1802.
లైనెక్‌ కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నాడు. దారిలో ఇద్దరు పిల్లలు ఆడుతుండగా చూశాడు. వాళ్ల ఆటను చూసి అక్కడే ఉండిపోయాడు. అదేం ఆట అంటే.. చెక్కతో శబ్దాలను గుర్తించే ఆట. అంత దూరంలో ఉండగా శబ్దం ఎలా గుర్తుపడుతున్నారు? అని చాలాసేపు ఆలోచించాడు. ఇంటికెళ్లినా మొత్తం ఇదే గుర్తుకొచ్చింది. ముందు దీని గురించి అధ్యయనం చేయాలని అనుకున్నాడు. ఆ పిల్లలు చెక్కను వాడిన విధానాన్ని ప్రాక్టికల్‌గా చేసి చూశాడు. దీని ద్వారా పక్కాగా ఏదైనా పరికరం కనిపెట్టవచ్చనే ధీమాతో ఉన్నాడు. ఒకరోజు ఇదే విషయం గురించి చర్చించేందుకు ఒక ప్రముఖ వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఇద్దరూ దీని గురించి మాట్లాడుతుండగానే డాక్టర్‌ పేషెంట్‌ను పంపించమన్నాడు. ఇక యువతి వచ్చింది. ‘ఏమైందమ్మా’ అని డాక్టర్‌ అడిగాడు. ‘ఏమో డాక్టర్‌ ఇబ్బందిగా ఉంది. భరించలేని కడుపు నొప్పి. తొందరగా తక్కువయ్యేట్లు చూడండి’ అని అమ్మాయి అడిగింది. డాక్టర్‌ ఆ అమ్మాయి ఛాతిపై చెవి పెట్టి గుండె పనితీరును పరిశీలిస్తున్నాడు. ఆ అమ్మాయేమో అసౌకర్యంగా ఫీలవుతున్నది. డాక్టర్‌ను కూడా తప్పుబట్టలేం కదా? దీనివల్ల అతడికీ ఇబ్బందే. కానీ తప్పని పరిస్థితి. ఈ సంఘటన చూసిన లైనెక్‌ బాధపడ్డాడు. ఆడవాళ్లు డాక్టర్ల దగ్గరికి రావడానికి ఎందుకు ఆసక్తి చూపించరో అర్థమైంది. ‘డాక్టర్‌ సాబ్‌.. ఇలా ఛాతిపై చెవి పెట్టి వారి శ్వాసతీరును గుర్తించడం కాకుండా ప్రత్యామ్నాయం ఏం లేదా?’ అంటాడు. ‘ఏముంది లైనెక్‌? అలాంటి ఏ పరికరమూ ఇప్పటివరకు రాలేదు. నిజంగా గుండె పనితీరును.. శ్వాస విధానాన్ని గుర్తించే సాధనమే ఉంటే మనకూ బాగుంటుంది. ఆడవాళ్ల హెల్త్‌ చెకప్‌ చేయాలంటే మనకూ ఇబ్బందే కదా?’ అన్నాడు డాక్టర్‌. ‘డాక్టర్‌ సాబ్‌.. ఇలా చాతిపై చెవి పెట్టి వారి శ్వాసతీరును గుర్తించడం కాకుండా ప్రత్యామ్నాయం ఏం లేదా?’ అంటాడు. ‘ఏముంది లైనెక్‌? అలాంటి ఏ పరికరమూ ఇప్పటివరకు రాలేదు. నిజంగా గుండె పనితీరును.. శ్వాస విధానాన్ని గుర్తించే సాధనమే ఉంటే మనకూ బాగుంటుంది. ఆడవాళ్ల హెల్త్‌ చెకప్‌ చేయాలంటే మనకూ ఇబ్బందే కదా?’ అన్నాడు డాక్టర్‌. అకాడమిక్‌ చదువు అయిపోయింది. పారిస్‌లోని సాల్పాట్రియర్‌ హాస్పిటల్‌లో వార్డ్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్నాడు. ఇది గాయపడిన సైనికులకు చికిత్స చేసే వార్డు. అది యుద్ధ సమయం. సైనికులకు సకాలంలో వైద్యం అందించాలి. అలాంటి ముఖ్యమైన వార్డుకు బాధ్యతలు అప్పగించడంతో కష్టపడి పనిచేశాడు. ఒకసారి ఒక మిలటరీ అధికారి గాయంతో వచ్చాడు. సమయానికి ఎవరూ అందుబాటులో లేరు. లైనెక్‌ చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడాడు. అది 1816.. ఇక ఏదైనా హాస్పిటల్‌లో డాక్టర్‌గా చేరడమే. అధ్యయనాలు.. పరిశోధనలు అన్నీ ముగిశాయి. ప్రాక్టికల్స్‌ కూడా అయిపోయాయి. చిన్నతనంలోనే తల్లి మరణించడం.. తర్వాత మామ మరణించడం.. భార్యకు.. అల్లుడికీ తీవ్ర ఆరోగ్య సమస్యలు రావడం వంటివన్నీ కండ్లముందే తిరిగాయి. పుట్టిన ప్రాంతానికి వెళ్లాడు. తన వాళ్లను కలుసుకున్నాడు. చిన్నప్పుడు కూడా తనకు ఏమాత్రం అనుబంధం లేని ప్రాంతం అయినా తనను సొంతవాడిగా స్వీకరించారు అక్కడివాళ్లు. సోదరుడిని కలిశాడు. ‘ప్రాక్టీస్‌ కూడా అయిపోయింది. ఇక డాక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడమే తరువాయి. అమ్మ ఏ వైద్య సదుపాయాలు లేక చనిపోయిందో.. అలాంటి సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ వృత్తిలోకి వచ్చాను’ అని అన్నతో లైనెక్‌ చెప్పాడు. ‘ఇటీవల ఒక యువతి చనిపోయింది. ఆమెకు ఏదో పెద్ద సమస్యే ఉన్నా డాక్టర్‌ దగ్గరికి వెళ్లనంటే వెళ్లను అని మొండికేసింది. ఇంట్లోవాళ్లు ఎంత మొత్తుకున్నా వినలేదు. ఆఖరికి చనిపోయింది’ అని వాళ్ల అన్న చెప్పాడు. అదే సంవత్సరం.. లైనెక్‌ డాక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కాలం గడుస్తూ ఉంది. కానీ పరిస్థితిలో మార్పు ఉండటం లేదు. మహిళా రోగులను పరిశీలించడానికి ఇబ్బంది అప్పుడెలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. తనకు ఎదురైన అనుభవాలు.. తన అన్న చెప్పిన విషయాలు అన్నీ అతడిని నిద్రపట్టకుండా చేశాయి. బాగా ఆలోచించాడు. మనమేం చేయలేమా అని తనకు తానుగానే ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నలన్నింటికీ ఓ పరిష్కార మార్గం దొరికింది. అదే.. చెక్కతో శబ్దాలను గుర్తించిన పిల్లల ఆట. 3.5 సెంటీమీటర్ల వ్యాసం.. 25 సెంటీమీటర్ల పొడవు చెక్క గొట్టాన్ని తీసుకొని స్టెతస్‌స్కోప్‌ తయారుచేశాడు. ఊపిరితిత్తుల నుంచి శబ్దాలను ప్రసారం చేయడానికి వీలుగా దీనికి ఒక ప్రత్యేక ప్లగ్‌ను అమర్చాడు. అప్పట్లో ఇదొక సంచలనం రేకెత్తించింది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నది. తర్వాత కాలంలో ఇదే స్టెతస్కోప్‌ రబ్బరుతో కాస్త సులభతరం చేశారు.