DailyDose

జోరుగా మారుతీ అమ్మకాలు-వాణిజ్యం

Maruti Sales On Rise Again - Business News Roundup

* దేశంలో 2జీ సేవలు నిలిపివేసేందుకు సత్వరం విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కోరారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సేవలను చరిత్రలో భాగం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో తొలి మొబైల్‌కాల్‌ ఆరంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముకేశ్‌ అంబానీ మాట్లాడారు. మిగిలిన ప్రపంచంతో పాటు భారత్‌ కూడా శరవేగంతో డేటా సేవలు లభించే 5జీ కి సిద్ధమవుతున్నా, ఇంకా 30 కోట్ల మంది 2జీ ఫీచర్‌ఫోన్‌ వినియోగదారులు ప్రాథమిక ఇంటర్నెట్‌ సేవలకు కూడా దూరంగానే ఉన్నారని ముకేశ్‌ అంబానీ వివరించారు. అందువల్ల సత్వరం 2జీ సేవల నిలిపివేతకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. 1995లో దేశీయంగా మొబైల్‌ సేవలు ఆరంభించాక, ఇప్పటివరకు ఎంతో పురోగతి ఏర్పడిందని గుర్తు చేశారు. తొలుత కాల్‌ చేసినవారు నిమిషానికి రూ.16, కాల్‌ అందుకున్నవారు నిమిషానికి రూ.8 చొప్పున చెల్లించాల్సి వచ్చేదని, ప్రస్తుతం 4జీ కాల్స్‌ ఉచితంగా చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. అంతకుముందు ల్యాండ్‌లైన్‌ ఫోన్లు ఉన్నా కొంతవరకే సమాచార సౌలభ్యం ఏర్పడిందని, మొబైల్‌ వచ్చాకే ‘ఎక్కడి నుంచి ఎక్కడికైనా’ సమాచార సేవలు లభిస్తున్నాయని గుర్తు చేశారు. ‘ధనిక-పేద’ మధ్య తేడా లేని సేవలు అందించడంలో మొబైల్‌ టెలిఫోనీని మించిన సాంకేతికత సాధనం ఏదీ రాలేదని వివరించారు. మొబైల్‌పైనే వార్తలు తెలుసుకోవడం, వీడియోలు చూడటం, కొనుగోళ్లు చేయడం సామాన్యులకూ చేరువైందని తెలిపారు. పిల్లలు ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటే, ఉద్యోగులు పని చేస్తున్నారని, సమావేశాలు కూడా ఫోన్ల ఆధారంగానే దృశ్యమాధ్యమ పద్ధతుల్లో జరుగుతున్నాయని అంబానీ వివరించారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌లోనే మొబైల్‌ ఫోన్ల వల్లే దేశం అంతా సమాచారాన్ని పంచుకోగలిగిందని గుర్తు చేశారు.

* వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి తగ్గాయి. జులై నెలకు సంబంధించి రూ.87,422 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇదే ఏడాది జూన్‌ నెలలో రూ.90,917 కోట్లు వసూలు అవ్వగా.. ఈ సారి అంతకంటే తక్కువ వసూలు కావడం గమనార్హం. అయితే, కొవిడ్‌ కారణంగా ఇచ్చిన వెసులుబాటు నేపథ్యంలో ఎక్కువ మంది జూన్‌లో తమ పాత బకాయిలు చెల్లించడంతో ఆ నెల వసూళ్లు పెరిగినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

* బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు పడిపోవడం క్యాపిటల్‌ మార్కెట్లలో రిటైల్‌ మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు కారణం కావొద్దని సెబీ పూర్తికాల సభ్యుడు జీ మహాలింగమ్‌ అన్నారు. కొవిడ్‌-19 మహమ్మారి సంక్షోభ కాలంలో పెట్టుబడి వ్యూహాలను జాగ్రత్తగా క్రమబద్ధీకరించుకోవాలని ఆయన సూచించారు. రిటైల్‌ మదుపరుల ప్రయోజనాల కోసం మార్కెట్లను సురక్షితం, భద్రంగా మార్చేందుకు సెబీ నిరంతరం పనిచేస్తోందని వెల్లడించారు. ఎంసీసీఐ నిర్వహించిన ఓ వెబినార్‌లో ఆయన మాట్లాడారు.

* కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో పూర్తిగా స్తంభించిన వాహన విక్రయాలు క్రమంగా కోలుకుంటున్నాయి. జులై నెలలో దాదాపు అన్ని సంస్థల అమ్మకాలు పుంజుకున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ ఇండియా విక్రయాల్లోనూ భారీ వృద్ధి నమోదైనట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జులైలో 1,08,064 యూనిట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. కొవిడ్‌కు ముందు నమోదైన విక్రయాలతో పోలిస్తే ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. 2019 జులైతో పోలిస్తే విక్రయాలు కేవలం 1.1 శాతం మాత్రమే కుంగినట్లు పేర్కొంది. జూన్‌ నెలతో పోలిస్తే 88.2శాతం అమ్మకాలు పెరగడం విశేషం.

* అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అతిపెద్ద విపణి అయిన భారత్‌లో వ్యాపారాభివృద్ధికి భారీ అవకాశలున్న రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టామని, ఇదేతరహా ఒప్పందాలు ఇతర దేశాల్లో కూడా కుదర్చుకునేందుకు ప్రయత్నిస్తామని సాంకేతిక దిగ్గజాలు ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రకటించాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ కంపెనీలు ఇన్వెస్టర్స్‌ కాల్స్‌ సందర్భంగా భారత విపణి ప్రాధాన్యతను విశదీకరించాయి. ప్రపంచంలోనే ఇంటర్నెట్‌ వినియోగదారులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని గుర్తు చేశాయి.