Food

అమ్మని మించిన దైవం…అమ్మపాలను మించిన అమృతం లేవు

Telugu Diet News - Mothers Milk Importance

అమ్మపాలు అమృతం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ రకరకాల కారణాలతో తల్లిపాలు శిశువులకు అందకపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి పలు వ్యాధులకు గురవడం, సరైన ఎదుగుదల లేకపోవడం, ఐక్యూ స్థాయి పడిపోవడం లాంటి తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. తల్లిపాలతో కరోనా వంటి వైరస్‌ల నుంచి పిల్లలకు రక్షణ ఉంటుందని, పాజిటివ్‌ తల్లులు కూడా పిల్లలకు పాలు పట్టవచ్చని.. పాలల్లో వైరస్‌ ఉండదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తల్లిపాలతో అటు బిడ్డకు, ఇటు తల్లికే కాకుండా సమాజానికి కూడా మేలు జరుగుతుందని దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని నిలోఫర్‌ వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు తల్లి పాలు ఇస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో పాటు తల్లికి రొమ్ము క్యాన్సర్‌ వం టి భయంకర వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందని.. అంతే కాకుండా సమాజంలో ప్రసూతి, శిశు మరణాలు తగ్గడంతో పాటు ఆర్థిక భారమూ తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఒక విధంగా చెప్పాలంటే తల్లిపాలు అమృతం లాంటివి. ఇంతటి ప్రాముఖ్యం గల తల్లిపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 1992లో మొదటి సారిగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 1నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు ఆగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, పాల ఉత్పత్తి పెరుగుదల, పాలు అందుబాటులో లేని శిశువులకు ప్రత్యామ్నాయ చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక కథనం..
**తల్లిపాలు ఎలా ఉత్పత్తి అవుతాయి..?
ప్రొలాక్టిన్‌ అనే హార్మోన్లతో పాలు ఉత్పత్తి అవుతాయి. అందుకే వీటిని మిల్క్‌ ప్రొడక్షన్‌ హార్మోన్లు అంటారు. ప్రసవించిన మహిళల్లో ఈ హోర్మోన్ల ప్రభావంతో పాలు ఉత్పత్తి అవుతాయి. ప్రసవించిన తొలి గంటలోపే తల్లుల్లో పాల ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఈ పాలనే గోల్డ్‌ డ్రాప్స్‌ (ముర్రుపాలు) అంటారు. ఈ పాలు బిడ్డలో శాశ్వత వ్యాధి నిరోధకశక్తి ఏర్పరుస్తాయి. అయితే మొదటి కాన్పు జరిగిన వారిలో భయం, మానసిక ఒత్తిడితో పాలు కొంత తగ్గిపోవడం లేదా పాలు రావడానికి కొంత సమయం పడుతుంది.
**ఆక్సిటోసిన్‌ హార్మోన్లతో పాలు విడుదల..
ఆక్సిటోసిన్‌ హార్మోన్ల ప్రభావంతో పాలు విడుదల అవుతాయి. అయితే కొందరిలో మానసిక ఒత్తిడితో ఈ హార్మోన్స్‌ తగ్గిపోయి పాల విడుదల ఆగిపోవచ్చు. అందుకే శిశువులకు పాలుపట్టే సమయంలో మహిళలు ప్రశాంత వాతావరణం, మానసిక ఒత్తిడి లేకుండా ఉంటేనే పిల్లలకు సరిపోయే పాలు అందుతాయి.
**ఐవీఎఫ్‌ చికిత్స చేయించుకున తల్లులోనూ పాలు..
వివిధ కారణాలతో ఐవీఎఫ్‌ పద్ధతిలో ప్రసవించిన మహిళల్లోనూ పాల ఉత్పత్తి జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి మహిళలో కచ్చితంగా పాలు ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు.
**కరోనా పాజిటివ్‌ తల్లులు బిడ్డకు పాలివచ్చు
ప్రసవించిన వెంటనే గంటలోపు బిడ్డకు తల్లులు పాలు పట్టాలి. ఆ పాలు చాలా విలువైనవి. అందుకే ఈ పాలను లిక్విడ్‌ గోల్డ్‌ అంటారు. తల్లిపాలలో బిడ్డకు కావాల్సిన అన్నిరకాల పోషకాలు, కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌ లభిస్తాయి. కవల పిల్లలకు కూడా సరిపోయే పాలు సదరు తల్లిలో పుష్కలంగా ఉంటాయి. ప్రసవించిన తల్లికి పాలు సరిగా రావడం లేదనేది ఒక మానసిక అపోహే. బిడ్డ జన్మించినప్పటి నుంచి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి. దీనిని ఎక్స్‌క్లూజివ్‌ బ్రెస్ట్‌ఫీడ్‌ అంటారు. పిల్లలు ఏడ్చినప్పుడల్లా పాలు పట్టవచ్చు. దీనిని డిమాండింగ్‌ ఫీడింగ్‌ అంటారు. ఏడు నెలల నుంచి తల్లిపాలతో పాటు ఇంట్లో తయారు చేసిన సమతుల ఆహారం ఇవ్వాలి. కనీసం రెండు సంవత్సరాల వరకు పిల్లలకు పాలు పట్టాలి. వర్కింగ్‌ మదర్స్‌ కూడా బిడ్డకు క్రమం తప్పకుండా పాలు పట్టవచ్చు. ఈ పాండమిక్‌ టైమ్‌లో కరోనా పాజిటివ్‌ మదర్స్‌ కూడా తమ బిడ్డలకు నిర్భయంగా పాలు పట్టవచ్చు. ఇక మదర్‌ మిల్క్‌ లేని పిల్లలకు ఇతరుల పాలు పట్టవచ్చు. అవి కూడా అందుబాటులో లేకపోతే పౌడర్‌ పాలు పట్టక తప్పదు.
**ఎంతకాలం పాలు పట్టాలి..
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం శిశువు పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు కంప్లీట్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ అంటే తల్లి పాలు తప్ప.. ఇతర ఏ పదార్థాలు కనీసం నీరు కూడా పిల్లలకు పట్టకూడదు. ఇక తల్లి పాలను 6 నెలల నుంచి కనీసం రెండున్నర సంవత్సరాలు పట్టాలి. ఇలా పడితేనే బిడ్డలో ఐక్యూ లెవల్స్‌ పెరుగుతాయి. బిడ్డలో ఎదుగుదలతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. బిడ్డ తాగినన్ని రోజులు తల్లిలో పాల ఉత్పత్తి జరుగుతూనే ఉంటుందని ఈ క్రమంలోనే పాత కాలంలో పెద్ద వారు తమ పిల్లలకు ఐదేండ్ల వరకు కూడా పాలుపట్టేవారు.
**ప్రసవించిన ప్రతి మహిళలో పాలు రావడం సహజం. కొన్ని సందర్భాలలో బిడ్డ జన్మించగానే తల్లికి లేదా శిశువుకు ఆపరేషన్‌ చేయాల్సి రావడం లేదా వేర్వేరుగా ఉంచాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో తల్లి ప్రసూతి మరణానికి గురవుతుంది. కొన్ని ఘటనల్లో శిశువులను తల్లులు దవాఖానల్లోనే వదిలి వెళ్లిపోతారు. ఈ శిశువులను శిశు సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డలకు తల్లిపాలు ఎలా అనే సందేహం రావడం సహజం. అయితే ఇలాంటి వారికి ‘వెట్‌ నర్సింగ్‌’ అంటే ఇతర ఇతర తల్లులచే శిశువులకు పాలు పట్టించడం. అయితే ఇది ప్రతిసారీ సాధ్యం కాదు. కానీ బిడ్డ జన్మించిన మొదటి గంటలోపు మాత్రం తల్లి అందుబాటులో లేని సందర్భంలో వెట్‌ నర్సింగ్‌ లేదా మదర్‌ మిల్క్‌బ్యాంక్‌ ద్వారా శిశువులకు పాలు పట్టాలని నిలోఫర్‌ దవాఖాన చిన్నపిల్లల వైద్యనిపుణులు, ఆర్‌ఎంవో డాక్టర్‌ రమేశ్‌ దాంపురి తెలిపారు. వెట్‌ నర్సింగ్‌, మదర్‌ మిల్క్‌బ్యాంక్‌ కూడా అందుబాటులో లేకపోతే ఔట్‌ ఫీడింగ్‌ తప్పదన్నారు.
***తల్లిపాలలో ఉండే విటమిన్స్‌, ప్రొటీన్స్‌..
‘వే’ ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శిశువులో జీర్ణక్రియను మెరుగుపరుచుతాయి.ఎమైనో యాసిడ్స్‌, డీహెచ్‌ఏ, ఎరాకిడోనిక్స్‌ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శిశువులోని మెదడు ఎదుగుదలకు ఉపయోగపడతాయి.సమపాలలో న్యూట్రీషియన్స్‌, కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌ ఉంటాయి.2:1 నిష్పత్తిలో కాల్షియం ఉండాలి. అది తల్లిపాలలో ఉంటుంది. దీని వల్ల ఎముకలు గట్టిపడతాయి.
***పాలిచ్చే తల్లులకు 2500 క్యాలరీల అవసరం..
సాధారణ మహిళల కంటే పాలిచ్చే తల్లులకు 500 క్యాలరీలు అదనంగా అవసరముంటుంది. సాధారణ మహిళలలు రోజుకు మూడు పూటలు ఆహారం తీసుకుంటే సరిపోతుంది. దీంతో వారికి 1800 నుంచి 2000 క్యాలరీలు అందుతాయి. పాలిచ్చే తల్లులు రోజుకు 4 నుంచి 5 పూటలు భోజనం చేయాలి. అప్పుడే 2500 క్యాలరీలు పెరిగి పిలలకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతాయి. పాలిచ్చే తల్లులు పాలు, పండ్లరసం, మంచినీరు, మజ్జిగ తదితర ద్రావణాలను అధికంగా తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుతుంది.
***రాత్రి ఫీడింగ్‌ ఇవ్వకపోతే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది..
సాధారణంగా రాత్రి సమయంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలకు పాలు సరిపడా అందుతాయి. చాలా మంది తల్లులు రాత్రి సమయంలో ఫీడింగ్‌ మానేయడం లేదా తక్కువ సమయమే ఇస్తారు. ఇలా రాత్రి ఫీడింగ్‌ నిలిపివేస్తే పాల ఉత్పత్తి తగ్గిపోయి పిల్లలకు సరిపోను పాలు అందవు.
**బిడ్డ బరువు ఆధారంగా తల్లిలో పాల అంచనా..
సాధారణంగా ప్రతిరోజు శిశువు 20-30గ్రాముల బరువు పెరుగుతుంది. అంతే కాకుండా శిశువులు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు. పిల్లల్లో బరువు పెరగకపోతే ఎదుగుదల సరిగా ఉండదు. దీని ఆధారంగా తల్లి నుంచి బిడ్డకు సరిపోను పాలు అందడం లేదని అంటే పాల ఉత్పత్తి తగ్గిపోయినట్లు పరిగణిస్తారు.
**ప్రసవించిన గంటలోనే పాల ఉత్పత్తి..
సాధారణంగా ప్రసవించిన గంటలోనే మహిళల్లో పాల ఉత్పత్తి మొదలవుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే అతి తక్కువ మోతాదులో ముర్రుపాలు వస్తాయి. ఈ పాలు బిడ్డకు అమృతం వంటివి. వీటిలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. ఈ పాలే బిడ్డను రోగాల బారిన పడకుండా కాపాడుతాయి.
**ఫోర్‌ మిల్క్‌లోనే యాంటీబాడీస్‌..
ఫోర్‌ మిల్క్‌ అంటే తల్లి రొమ్ము పట్టగానే వచ్చే పాలు. ఈ పాలలో రోగ నిరోధకశక్తిని పెంచే యాంటీబాడీస్‌ ఉంటాయి. ఈ పాలతో పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండ్‌ మిల్క్‌ అంటే చివరి పాలలో కొవ్వు పదార్థాలు ఉంటాయి. దీంతో బిడ్డ బరువు పెరుగుతుంది. కొందరిలో శిశువు రొమ్ము పట్టగానే పాలు రావు. కొంత సమయం తరువాత పాలు వస్తాయి. అందుకే శిశువులకు ప్రతి తల్లీ కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు పాలు పట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.
**మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌లో ఆరు నెలలపాటు నిల్వ..
సాధారణంగా తల్లిపాలను గది ఉష్ణోగ్రత వద్ద అంటే ఇళ్లలో 4 గంటల పాటు నిల్వ ఉంచవచ్చు. ఫ్రిజ్‌లో అయితే 6 నుంచి 8 గంటల పాటు నిల్వ చేయవచ్చు. అదే మదర్‌ మిల్క్‌ బ్యాంకులో అయితే ఆరు నెలల పాటు తల్లిపాలను నిల్వ చేస్తారు. మైనస్‌ 20డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద తల్లిపాలను ఈ మిల్క్‌ బ్యాంక్‌లో నిల్వ చేస్తారని వైద్యులు సూచిస్తున్నారు. నిలోఫర్‌లోని మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌లో తల్లిపాలను ఈ తరహాలోనే నిల్వచేసి అక్కడ జన్మించిన, చికిత్స పొందుతున్న శిశువులకు అందిస్తున్నట్లు నిలోఫర్‌ వైద్యులు తెలిపారు.
**పిల్లలకు పాలు పట్టకపోతే..
మారుతున్న జీవన విధానం, వృత్తిరిత్యా మాతాశిశువుల మధ్య ఎడం పెరుగుతుంది. దీంతో తల్లుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా పిల్లలకు ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి పాలు పట్టాలి. ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలకు పాలు పట్టకపోతే తల్లులు బ్రెస్ట్‌ ఎంగార్జ్‌మెంట్‌(పాల సేపులు)కు గురవుతారు. దీంతో నిరంతరం ఉత్పత్తి అయ్యే పాలతో రొమ్ములు నిండి గట్టిపడి అనంతరం పాల ఉత్పత్తి ఆగిపోవడం లేదా భారీగా తగ్గిపోవడం జరుగుతుంది. మూడు నుంచి నాలుగు రోజులు వరుసగా పిల్లలకు పాలు పట్టకపోతే తల్లుల్లో పాల ఉత్పత్తి నిలిచిపోతుంది.
**తల్లిపాలతో సమాజానికీ మేలు
తల్లిపాలతో కేవలం మాతా శిశువులకే కాకుండా ఇటు సమాజానికి కూడా మేలు జరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. తల్లి పాలు పట్టడం వల్ల పిల్లల్లో ఐక్యూ లెవల్స్‌ పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులకు గురికాకుండా రక్షణ పొందుతారు. పిల్లలో మంచి ఎదుగుదల ఉంటుంది. పిల్లలు పెరిగి పద్దైన తరువాత హైపర్‌ టెన్షన్‌, డయాబెటిక్‌, స్థూలకాయం తదితర సమస్యలకు గురికాకుండా తల్లిపాలు కాపాడుతాయి. ఇక పాలిచ్చే తల్లులనూ ఆ పాలు రక్షిస్తాయి. ఎలాగంటే ముఖ్యంగా పిల్లలకు పాలు పట్టడం వల్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌లు రావని డాక్టర్‌ ఉషారాణి తెలిపారు. పాలు పట్టినన్ని రోజులు మహిళలకు నెలసరి కూడా రాదు. అంటే తల్లి పాలు సహజ గర్భ నిరోధంగా కూడా పనిచేస్తాయి.