NRI-NRT

తెలుగులో బిడెన్ ప్రచారం

Joe Biden Focussing On Indian Voters With Campaign In Telugu

నవంబర్ నెలలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా జో బిడెన్ రంగంలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి అయిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అమి తుమికి బిడెన్ సిద్ధమయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ప్రభావం మరీ ఎక్కువగా ఉన్నందున భారతీయుల మనుసు దోచుకునేందుకు జో బిడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని భారతీయ భాషలతోనే గురువారం ప్రారంభించడం విశేషం. భారత్ కు చెందిన 14 భాషల్లో తన ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుతం, హిందీ, పంజాబీ, తమిళ, తెలుగు, బెంగాలీ, ఉర్దూ, కన్నడ, మలయాళీ, ఒరియా, మరాఠీ, నేపాలీ భాషలను ఎంచుకున్నారు. వీటిలో తెలుగు భాష కూడా ఉండటం విశేషం. దేశంలోని భారతీయ-అమెరికన్ ఓటర్లలో ఉత్సాహాన్ని కలిగించడానికి “అమెరికా కా నేతా కైసా హో.. జో బిడెన్ జైసా హో” అనే నినాదం కూడా సృష్టించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల తరహాలో.. 2016 లో ట్రంప్ ఎన్నికల ప్రచార నినాదంగా “అబ్ కి ట్రంప్ సర్కార్” తీసుకున్నారు. ఈ నినాదం విజయవంతం అయిన నాలుగేండ్ల తరువాత భారతీయ-అమెరికన్లను మచ్చిక చేసుకోవడానికి 14 భారతీయ భాషలలో ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ ఎన్నికల నినాదం వచ్చింది. భారతీయ-అమెరికన్ ఓటర్లను వారి స్వంత భాషలలో చేరాలని ఈ ప్రచారాని శ్రీకారం చుట్టామని బిడెన్ కు చెందిన జాతీయ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు అజయ్ భూటోరియా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో సమాజ వేడుకలు, ఆకర్షణీయమైన నినాదాలు, లౌడ్ స్పీకర్లలో బాలీవుడ్ సంగీతాన్ని ప్రదర్శించే ర్యాలీలు కూడా ఉంటాయని తెలిపారు. తన డిజిటల్ ప్రచారం ఎక్కువ మంది భారతీయ-అమెరికన్లను రాజకీయాల వైపు మళ్లించడానికి, ఓటు నమోదు చేసుకోవడానికి, ఈ నవంబరులో బిడెన్ కోసం తమ బ్యాలెట్లను వేయడానికి ప్రేరేపిస్తుందని భావిస్తున్నట్టు భూటోరియా అన్నారు. “ప్రాంతీయ భారతీయ భాషల్లో ప్రచార గ్రాఫిక్‌లను సృష్టించాల్సిన అవసరం ఉన్నట్టు అనుకుంటున్నట్టు బిడెన్ కోసం సౌత్ ఆసియన్స్ జాతీయ డైరెక్టర్ నేహా దేవాన్ అన్నారు. “వైస్ ప్రెసిడెంట్‌గా.. వలసదారులు అమెరికన్ కథ యొక్క ప్రధాన అధ్యాయం అని బిడెన్ తరచూ మనకు గుర్తుచేశేవారని, ప్రతి సంస్కృతి నుంచి, ప్రతి దేశం నుంచి కష్టపడి పనిచేసే ప్రజలను ఆకర్షించగల మన దేశం యొక్క సామర్థ్యం మమ్మల్ని ఎల్లప్పుడూ బలోపేతం చేసింది’ అని ఆమె చెప్పారు.