Devotional

నేడు రాఖీ పౌర్ణమి-దాని ప్రత్యేకతలు

Rakhi Pournami Special Story - How is it celebrated across globe

సమష్టి తత్త్వాన్ని, సమైక్య జీవన సూత్రాల్ని ఆవిష్కరించే మన పండుగలు ఆత్మీయానురాగాలకు వారధులు. ఆ నేపథ్యంలోనిదే రాఖీ పౌర్ణమి. మహోదాత్తమైన వారసత్వ వైభవానికి సంకేతమై వర్ధిల్లుతున్న రాఖీ పర్వం, సోదర సోదరీమణుల అపురూప బాంధవ్యానికి ప్రతిఫలనం. రక్షా మంగళ్‌, రక్షా దివస్‌, రాఖీ పూనవ్‌, సలోని ఉత్సవ్‌గా రాఖీ పౌర్ణమిని దేశంలో వివిధ ప్రాంతాల్లో వ్యవహరిస్తారు.

రక్షాబంధన ప్రస్తావన భవిష్యోత్తర పురాణం, మహాభారతం, గణేశ, విష్ణుపురాణాల్లో కనిపిస్తుంది. సోదరీమణుల చేత రక్షాబంధనాన్ని ధరించిన సోదరులకు యమకింకరుల భయం ఎన్నటికీ ఉండదని యముడు తన సోదరి యమునకు చెప్పినట్లు భవిష్యోత్తర పురాణం వివరించింది. పాండవులకు విజయం చేకూరడానికి శ్రీకృష్ణుడి సూచన మేరకు ధర్మరాజు తన సోదరులకు మంత్రయుక్తమైన రక్షాబంధన ఉత్సవాన్ని నిర్వహించాడని మహాభారతం పేర్కొంది. రాఖీ పౌర్ణమిని ‘బలేవా’గా విష్ణుపురాణం ప్రస్తావించింది. బలేవా అంటే బలిచక్రవర్తి బలీయమైన భక్తి. తన అనన్య సామాన్యమైన భక్తిప్రపత్తులతో శ్రీహరిని బలిచక్రవర్తి ప్రసన్నం చేసుకున్నాడు. తన భక్తి బంధంతో విష్ణువును బంధించి తనవద్దే అతను ఉండేలా వరం పొందాడు. ఫలితంగా, వైకుంఠం కళాహీనమైంది. లక్ష్మీదేవి తల్లడిల్లింది. శ్రావణ పూర్ణిమనాడు బలిచక్రవర్తికి లక్ష్మీదేవి రక్ష కట్టింది. ఏం కావాలో కోరుకోమన్నాడు బలి. తన భర్త, విష్ణువును లక్ష్మి కోరుకొంది. తథాస్తు అన్నాడు బలి. నారాయణుడినే లక్ష్మి కానుకగా అందుకొన్న విశేష పర్వదినం శ్రావణ పూర్ణిమగా విష్ణుపురాణం విశదీకరించింది.

దేవదానవుల సంగ్రామంలో ఇంద్రుడు పరాజయం పాలవకుండా, దేవగురువు బృహస్పతి, శచీదేవితో ఇంద్రుడికి రక్షను ధరింపజేశాడని కూర్మపురాణం పేర్కొంది. తన కుమారుడైన భరతుడికి ఎప్పటికీ శత్రుభయం ఉండరాదని శకుంతల అతడికి రక్ష కట్టిందని చెబుతారు.

‘రాకా’ అంటే నిండుదనం, సంపూర్ణత్వం. రాకా చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు. ఈ పూర్ణిమనాడు ధరించే రక్షను రాఖీగా వ్యవహరిస్తారు. రాఖీ అసలు పేరు రక్షిక. సోదరి పవిత్ర మనసుతో సోదరుడి నుదుట విజయతిలకం దిద్దాలి. మంగళ హారతినిచ్చి, అతడి కుడిచేతికి పసుపుకొమ్ము కట్టిన దారపు రక్షను ధరింపజేయాలి. మధుర పదార్థాల్ని తినిపించాలి. సోదరుడు, సోదరికి కానుకల్ని బహూకరించి, పెద్దల దీవెనల్ని అందుకోవాలి. సోదర సోదరీమణులు పూజామందిరంలో దీపారాధన చేసి దైవకృపను ఆకాంక్షించాలి.

వేదాల్ని అపహరించిన అసురుణ్ని సంహరించడానికి విష్ణువు హయగ్రీవుడిగా అవతరించిన రోజే శ్రావణపూర్ణిమ. ఐశ్వర్య ప్రదాయతుడైన ఈశ్వరుడు, మహాలక్ష్మికి ధనాధిపత్యాన్ని ఈ పౌర్ణమినాడే అనుగ్రహించాడని శివమహాపురాణం చెబుతోంది. జ్ఞానమూర్తి అయిన శ్రీవాణికి సమస్త విద్యాశక్తులు పౌర్ణమినాడే చేకూరాయని శ్రీవిద్యాసూక్తం వెల్లడించింది. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమిగా వ్యవహరిస్తారు. జంధ్యానికి మూడుపోగులు ఉంటాయి. ఇవి దేవ, పితృ, రుషి రుణాలకు సూచికలు. ఈ పోగులకు ఉండే మూడు ముడులు ఆరోగ్యం, సంపద, తేజస్సుకు సంకేతాలు. దేవభాషగా ప్రస్తావించే సంస్కృత భాష ఈశ్వర సంకల్పంతో శ్రావణ పూర్ణిమనాడే ఆవిర్భవించిందని రుద్రసంహిత వివరిస్తోంది. విష్ణువు జన్మనక్షత్రమైన శ్రావణం పేరిట ఉండే శ్రావణమాసంలో పౌర్ణమి తిథి ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో సంస్కృతీ సంప్రదాయాల బలిమి, ఘనమైన వారసత్వ విశేషాంశాల కలిమి- శ్రావణపౌర్ణమి!